కార్మికవర్గ పోరాటాలకు నిరంతరం స్పూర్తిదాయకంగా నిలిచే ఆరంభం
పనిగంటల కుదింపు కోసం సాగే పోరాటం. సాగుతున్న పోరాటం. అమెరికాలో ఫ్యాక్టరీ వ్యవస్థకు
ఎంత చరిత్ర ఉందో పనిగంట కుదింపు ఉద్యమానికి కూడా అంతటి చరిత్ర ఉంది.
నేను యూనివర్శిటీలో చదువుకునేటప్పుడు ఎంవియస్ కోటేశ్వరరావు అని ఓ రాజనీతిశాస్త్ర ప్రొఫెసర్ ఉండేవాడు. యూనివర్శిటీలో తరచూ తలెత్తే సమస్యల నేపథ్యంలో జరిగే ఆందోళనలు, అందులో విద్యార్ధుల భాగస్వామ్యం, భాగస్వాములవుతున్న విద్యార్ధుల్లో క్రియాశీలత వంటి అంశాలను చాలా సూక్ష్మంగా పరిశీలిస్తూ ఉండేవాడు. రాబోయే తరం విద్యార్ధులకు '' చదువుకోవటానికి సాల్కర్షిప్లు ఇస్తార''ని చెప్తే అవునా అని నోరెళ్లబెట్టే పరిస్థితులు రాబోతున్నాయని వ్యాఖ్యానించాడు. ఈ సంవత్సరం మే దినోత్సవం గురించి రాయాలన్న ఆహ్వానం అందినప్పుడు నాకు గుర్తొచ్చిన మొదటి మాట అది.
ఈ రోజుల్లో ఉద్యోగానికి కుదురుతున్నామంటే జీతమెంత, శెలవులెన్ని, కాజువల్ శెలవునెన్ని, ఆరోగ్య బీమా ఉందా లేదా, ప్రమాద బీమా ఉందా, అదనపు సమయం పని చేస్తే అదనపు భత్యం ఉందా, పదవీ విరమణ తర్వాత వచ్చే ప్రయోజనాలేమిటి వంటి అనేక ప్రశ్నలు వేసుకుని వాటికి సమాధానాలు వెతుక్కుని తృప్తి చెందితే ఉద్యోగంలో చేరటం, లేదంటే మనకు నచ్చింది మరోటి వెతుక్కోవటం మాత్రమే తెలిసిన తరం నేటి తరం. శ్రమనమ్ముకునే వాడికి ఇంత స్వేఛ్చ ఎలా వచ్చిందో తెలియని తరం. ఎందుకంటే మనదైన మన చరిత్రను మరొకరెవరో రాస్తే చదువుకుని తెలుసుకునేందుకు అలవాటుపడ్డవాళ్లం. అందుకే మనదైన చరిత్ర మే డే చరిత్రను మరోసారి మననం చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. ఏ విషయాన్ని తెలుసుకోవాలన్నా, అర్థం చేసుకోవాలన్నా ఎలా మొదలైంది, ఎక్కడ మొదలైంది, ఈ మే దినోత్సవం గురించి ఎవరేమన్నారు, నేటి పరిస్థితి ఏమిటి, రేపటి కర్తవ్యమేమిటన్న ప్రశ్నలు వేసుకోవాలి. ఇవే ప్రశ్నలు మే దినోత్సవ చరిత్రకు కూడా వేద్దాం. చరిత్ర ఏమి చెప్తుందో చూద్దాం.
ఎక్కడ, ఎలా మొదలైంది?
మే1వ తేదీకి ఓ వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పలు సాంప్రదాయాలుండేవి. ఇవన్నీ ప్రధానంగా సాంస్కృతిక జీవితానికి సంబంధించిన సాంప్రదాయాలు. కానీ పెట్టుబడిదారీ వ్యవస్థ ఉనికిలోకి రావటంతో సాంస్కృతిక సాంప్రదాయాలకు ఆర్థిక నేపథ్యాలు సమకూరటం మొదలైంది. మే దినోత్సవానికి కూడా పెట్టుబడిదారీ విధానం అటువంటి ఆర్థిక నేపథ్యాన్ని సమకూర్చింది. పెట్టుబడిదారీ వ్యవస్థ తన
సమాధిని తవ్వే వారిని తానే తయారు చేసుకుంటుందని కారల్ మార్క్స్ హెచ్చరించాడు. పారిశ్రామిక విప్లవంతో పాటే ఉనికిలోకి వచ్చిన కార్మికవర్గం ఉత్పత్తి వైవిధ్యం, నైపుణ్యం పెరిగేకొద్దీ మనుషులు తమ వ్యక్తిగత నైపుణ్యాలను మిషిన్లకు బదలాయించే క్రమంలో కార్మికుడు తన స్వాతంత్య్రాన్ని కోల్పోయాడు. అలా విశాల విశ్వజనావళి సామర్ధాన్ని యంత్రాలకు బదిలీ చేసే క్రమంలో తెరమీదకు వచ్చిందే సాంకేతిక పరిజ్ఞానం. సాంకేతిక పరిజ్ఞానం మొత్తం ఉత్పత్తి, వినిమయ జీవితాలను అదుపు చేసేకొద్దీ మనిషి తన జీవితంలో నుండి తాను పరాయీకరించడుతున్నాడు. ఇదే విషయాన్ని మార్క్స్ పరాయీకరణ సిద్ధాంతంగా సూత్రీకరించాడు. ఈ పరాయీకరణ పొందిన మనిషి తనను తాను తిరిగి పొందటానికి సాగించే పోరాటమే వర్గపోరాటం. ఈ వర్గపోరాట యజ్ఞానికి ఆర్ఘ్యం పోసేవే వర్గ ఉద్యమాలు. కార్మికవర్గ పోరాటాలు. ఈ కార్మికవర్గ పోరాటాలకు నిరంతరం స్పూర్తిదాయకంగా నిలిచే ఆరంభం పనిగంటల కుదింపు కోసం సాగే పోరాటం. సాగుతున్న పోరాటం. అమెరికాలో ఫ్యాక్టరీ వ్యవస్థకు ఎంత చరిత్ర ఉందో పనిగంట కుదింపు ఉద్యమానికి కూడా అంతటి చరిత్ర ఉంది.
కార్మికోద్యమం అంటే జీతాలు పెంచాలన్న డిమాండ్ కోసం జరిగే పోరాటమనే భావన అందరికీ తెలిసిన భావన. అందరిలోనూ పాతుకుపోయిన భావన. కానీ కార్మికోద్యమంలో ఈ కోణానికి ఎంత ప్రాధాన్యత ఉందో పనిగంటల తగ్గింపుకూ అంతే ప్రాధాన్యత ఉంది. ఈ విషయాన్ని సాధారణంగా మనం మర్చిపోతూంటాము. పారిశ్రామిక విప్లవం తొలినాళ్లల్లో బతకటం కోసం పని చేయటం అనివార్యమైన పరిస్థితుల్లో తెల్లారింది మొదలు పొద్దుగూకేంత వరకూ పని చేయాలన్న నిబంధనలకు వ్యతిరేకంగా అమెరికా కార్మికులు వ్యతిరేకంగా పలు రూపాల్లో ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అప్పట్లో 10-18 గంటల పనిదినం అంటే సార్వత్రిక విషయం. అమెరికాలో 1806లో జరిగిన ఓ విచారణలో కొంతమంది కార్మికులు 19 గంటల వరకూ పని చేస్తున్నారని తేలింది. రానురాను 1820, 1830 దశాబ్దాల్లో పనిదినం నిడివి తగ్గించాలన్న నినాదంతో అమెరికా కార్మికవర్గం ఉద్యమించింది. ఫిలడెల్ఫియాలోని మెకానిక్స్ యూనియన్ బహుశా ప్రపంచంలో మొట్టమొదటి సంఘటిత కార్మికసంఘం. 1827లో ఫిలడెల్ఫియాలోని భవన నిర్మాణ కార్మికసంఘం 10 గంటల పనిదినం కోసం సంఘటిత యూనియన్‌గా సమ్మె జరిగింది. న్యూయార్క్‌లో 1834లో రొట్టెలు తయారీ కార్మికుల సమ్మె గురించి వర్కింగ్‌మెన్స్ అడ్వకేట్ పత్రికలో రొట్టెల తయారీలో పని చేసే కార్మికుల పరిస్థితులు ఈజిప్ట్ నుండి తెచ్చిన వలస కార్మికుల స్థితిగతుల కంటే దారుణమైన బానిసబతుకులుగా మారాయని, ఈ పరిశ్రమల్లోని కార్మికులు రోజుకు 24 గంటల్లో 18 నుండి 20 గంటల వరకూ పని చేయాల్సి వస్తోందని రాసింది. ఈ విధంగా వివిధ ప్రాంతాల్లో పదిగంటల పనిదినం కోసం దేశవ్యాప్త ఉద్యమంగా మారింది. ఉధృతమైంది. అయితే 1837లో పెట్టుబడిదారీ వ్యవస్థలో తలెత్తిన సంక్షోభం కారణంగా ఈ ఉద్యమాలు కాస్తంత వెనకపట్టు పట్టాయి. సంక్షోభం నుండి వ్యవస్థను కాపాడటాలంటే శ్రమశక్తి భాగస్వామ్యం అవసరం అని గుర్తించిన ప్రభుత్వం ఈ సంక్షోభం తర్వాత అమెరికా అధ్యక్షుడు వాన్ బరెన్ పదిగంటల పనిదినాన్ని చట్టబద్ధం చేస్తూ ఆదేశాలు జారీచేశాడు.
1827-1861 మధ్య సాగిన ఉద్యమాలు :
పది గంటల పనిదినాన్ని సాధించిన కార్మికులు ఎనిమిది గంటల పనిదినాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఉద్యమాలు సాగిం చారు. 1827 నుండీ 1857 వరకూ అమెరికా కార్మికవర్గం సాగించిన ఉద్యమాలు, ఆందో ళనలు, నిరసనల్లో ఎనిమిదిగంటల పని దినం ప్రధాన ఎజెం డాగా మారింది. కానీ 1857లో పెట్టుబడి దారీ వ్యవస్థ మరో సంక్షోభానికి లోనుకావటంతో ఈ ఉద్యమం కాస్తంత వెనకపట్టు పట్టింది. ఈ నినాదం అమెరికాకు మాత్రమే పరిమితం కాలేదు. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం ఉనికిలో ఉన్న అన్ని దేశాల్లోనూ తరతమ స్థాయిలో సాగింది. అమెరికాలో నీగ్రోల విముక్తికోసం 1861-62లో జరిగిన అంతర్యుద్ధంలోనే మే డే ఉద్యమం పునాదులున్నాయి. అంతర్యుద్ధం తొలినాళ్లల్లో అంతకు ముందు శక్తివంతమైన కార్మికసంఘాలుగా ఉన్న మౌల్డర్స్ యూనియన్, మెషినిష్ట్ అండ్ బ్లాక్స్మిత్స్ యూనియన్లు కకావికలయ్యాయి. కానీ అంతర్యుద్ధం ముగియటంతోనే వివిధ ప్రాంతాల్లో చిన్న చిన్న సంఘాలుగా ఉన్న కార్మికసంస్థలు జాతీయ స్థాయి స్వరూపం తీసుకున్నాయి. 1866 ఆగస్టు 20న బాల్టిమోర్‌లో సమావేశమైన మూడు కార్మిక సంఘాలు విలీనమై జాతీయ కార్మిక సంఘం ఏర్పాటైంది. అప్పటికే కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌తో సంబంధాలు కలిగిన విలియం హెచ్ సిల్విస్ ఈ జాతీయ కార్మిక సంఘానికి నాయకుడిగా ఎన్నికయ్యాడు. అమెరికాలో జరిగే ఎన్నికల్లో ఎనిమిది గంటల పనిదినం డిమాం డ్‌ను సమర్ధించే రాజకీయ నాయకులను మాత్రమే ఎన్నుకోవాలని కూడా పిలుపునిచ్చింది. ఈ డిమాండ్లను దేశవ్యాప్తంగా విస్తరింపచేయటానికి గాను ఎక్కడిక్కడ ఎనిమిది గంటల లీగ్‌లు ప్రారంభమయ్యాయి.
ఎనిమిది గంటల పనిదినం
డిమాండ్‌పై తొలి కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ బాల్టిమోర్‌లో 1866 ఆగస్టు 16న జరిగిన కార్మికుల జనరల్ కౌన్సిల్ '' ఈ దేశంలో కార్మికవర్గాన్ని పెట్టుబడిదారీ దోపిడీ నుండి విముక్తి
చేయాలంటే అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో ఎనిమిది గంటల పనిదినం చట్టం చేయటం అనివార్యమైన అవసరం. ఈ లక్ష్యాన్ని సాధించేవరకూ వెనుదిరక్కుండా పోరాడ టానికి మా శక్తిసామర్ధ్యాలన్నీ వెచ్చించాలని నిర్ణయించామని తీర్మానించారు.
అంతర్జాతీయమైన మే దినోత్సవం
ఫ్రెంచి విప్లవం శతజయంతి సందర్భంగా 1889 జూన్ 14న పారిస్‌లో సమావేశమైన రెండో కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ సమావే శాలు అమెరికా ప్రతినిధుల నోట మే దినోత్సవ ఉద్యమ వీరోచిత పోరాటం గురించి చర్చిం చాయి. 1890 నుండీ అన్ని దేశాలూ 8 గంటల పనిదినం సాధన కోసం ఉద్యమాన్ని అంతర్జాతీయం చేయాలని తీర్మానించింది. 1890 మే దినోత్సవం యూరోపియన్ దేశాలన్నింటా జరిగింది. అనేక పరిణామాలు, పోరాటాలు, త్యాగాల తర్వాత 1919 అక్టోబరు 29న అంతర్జాతీయ కార్మిక సంస్థ ఎనిమిది గంటల పనిదినం తీర్మానాన్ని ఆమోదించి అన్ని దేశాలు ఈ తీర్మానంలో భాగస్వా ములు కావాలని పిలుపు నిచ్చింది. ఈ విధంగా దాదాపు 150 ఏళ్ల పాటు వివిధ దేశాల కార్మికవర్గం సాగించిన పోరాటం ఫలితంగా ఎనిమిదిగంటల పనిదినం నేడు ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులు, అధికారులకు చట్టబద్దమైన హక్కుగా మారింది. ఈ హక్కును కాపాడుకోవటమా, కోల్పోవటమా అన్నది నేటి కార్మికోద్యమం ముందున్న ఏకైక ప్రశ్న.
ఎనిమిది గంట పనిదినం ఉద్యమం గురించి మార్క్స్ ఏమన్నాడు?
ఇరవై నాలుగు గంటల్లో 12 నుండి 20 గంటల వరకూ సాగే పనిదినాన్ని ఎనిమిది గంటలకు కుదిస్తే కార్మికులకు విరామ సమయం పెరుగుతుందన్న విషయంలో ఎవ్వరికీ సందేహం లేదు. కానీ ఈ దోపిడీ వ్యవస్థపై జరిగే పోరాటం ఈ నినాదం ద్వారా ఏ విధంగా ప్రభావితమవుతుంది అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవటానకి కారల్ మార్క్స్‌ను ఆశ్రయించాల్సిందే. బాలనాగమ్మ సినిమాలో మాయల ఫకీరు ప్రాణం ఏడు సముద్రాల అవతల మర్రి చెట్టు తొర్రలో ఉన్న చిలక కంట్లో ఉందని చెప్పినట్లే పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రాణం అదనపువిలువ దోపిడీని సిద్ధించుకోవటంలోనే ఉందని, ఈ అదనపు విలువ దోపిడీ మార్గాలను మూసుకుంటూ పోతే శ్రమ దోపిడీపైనే ఆధారపడిన ఈ వ్యవస్థ కూసాలు కదులుతాయని గుర్తించి నిరూపించిన ఏకైక జగదేక మేధావి కారల్ మార్క్స్.
ఈ పోరాటాలు పెట్టుబడిదారీ వ్యవస్థ పుట్టు పూర్వోత్తరాలు, దాని మనుగడకున్న మార్గాలు, దాని స్థానంలో నూతన వ్యవస్థ ఆవిర్భావానికి ఉన్న అవకాశాలు, ఆటంకాలు గురించి అధ్యయనం చేయటానికి జీవితాన్ని అంకితం చేసిన కారల్ మార్క్స్ దృష్టిని దాటిపోలేదు. నేషనల్ లేబర్ యూనియన్ ఇచ్చిన ఎనిమిదిగంటల పనిదినం ఉద్యమం గురించి మొదటి ఇంటర్నేషనల్ దృష్టి తెస్తూ కారల్ మార్క్స్ తన పెట్టుబడి గ్రంధం మొదటి సంపుటంలోనే అమెరికాలో జరుగుతున్న కార్మిక పోరాటాల గురించి ప్రస్తావించిన కొన్ని అంశాలు ఇవి :
అమెరికాలో కార్మికోద్యమం నల్లజాతి బానిస కార్మికుల సమస్యలు పట్టించుకోనంత కాలం పక్షవాతంతో కొట్టుమిట్టాడింది. నల్లజాతి కార్మికులపై సాగుతున్న దోపిడీ కొనసాగుతున్నంత కాలం తెల్లజాతి కార్మికుడు విముక్తి పొందినంత మాత్రాన మొత్తం దోపిడీ వ్యవస్థ నుండి విముక్తి పొందటం సాధ్యం కాదు. కానీ నీగ్రోల తిరుగుబాటు మరో కొత్త ఉదయానికి పునాది వేసింది. ఎనిమిదిగంటల పనిదినం నినాదాన్ని నీలిఆకాశంలో రెపరెపలాడించింది. ఈ ఉద్యమం అట్టాంటిక్ సముద్ర తీరం నుండి పసిఫిక్ తీరం వరకూ, న్యూ ఇంగ్లాండ్ నుండి కాలిఫోర్నియా వరకూ విస్తరించింది. ఈ ఉద్యమాలు ఉత్పత్తి సంబంధాల్లో వస్తున్న మార్పులకు దర్పణాలు - అని పేర్కొంటూనే పెట్టుబడిదారీ వ్యవస్థ కబంధ హస్తాల నుండి ముక్తి పొందటానికి కేవలం పనిగంటలను కుదిస్తే చాలదన్న విషయాన్ని కూడా మార్క్స్ గుర్తించాడు. అందుకే మార్క్స్ ఏంగెల్స్‌ల నాయకత్వంలోని కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ ''కార్మికవర్గ విముక్తికి పనిదినం కుదింపు పునాదిరాయి. ఈ పునాది లేకుండా ఎటువంటి భవనాన్ని నిర్మించలేము'' అని తీర్మానించింది. నీగ్రో విముక్తి, కార్మిక వర్గ విముక్తి రెండిటికీ మధ్య ఉన్న అవినాభావ సంబంధం గురించి మార్క్స్ అంచనా పై మాటల్లో మనం చూడొచ్చు. భారతదేశంలో కులదోపిడీ, అణచివేతలకు వ్యతిరేకంగా సాగే ఉద్యమాలు, వర్గ దోపిడీకి వ్యతిరేకంగా సాగే ఉద్యమాల మధ్య ఐక్యసంఘటన అసవరాన్ని పైన ప్రస్తావించిన మార్క్స్ విశ్లేషణ పునరుద్ఘాటిస్తుంది.
ఐక్య సంఘటన ఉద్యమంగా హేమార్కెట్ ఆందోళన
అమెరికాలో ఎనిమిదిగంటల పనిదినం కోసం సాగుతున్న ఆందోళనల్లో చికాగోలో జరిగిన ఆందోళన చాలా ఉధృతంగా, సమరశీలంగానూ జరిగింది. అయితే అప్పటికి అటు అంతర్జాతీయ కార్మికవర్గం గానీ, అమెరికా కార్మికవర్గం గానీ పెట్టుబడిదారీ వ్యవస్థ నుండి విముక్తి చేయటానికి ఓ సంఘటిత ప్రయత్నం చేసేందుకు కావల్సినంత అనుభవం గానీ, ఆచరణకు కావల్సినంత అనుభవం కానీ లేవు. అయితే కార్మిక సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపుకు మొత్తం చికాగో కార్మికవర్గం కదనరంగంలోకి దిగింది.
ఈ ఐక్యసంఘటనలో వామపక్ష స్వభావం కలిగిన సంస్థలు ప్రభావం మెండుగా ఉంది. 1886లో ఏప్రిల్ చివరి ఆదివారం నాడు 25వేల మంది కార్మికులు నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. మే1వ తేదీన ఆందోళనకు కార్మికసంఘాల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపుననుసరించి వేలాదిమంది కార్మికులు పనులు ఆపేసి ఆందోళనలో పాల్గొన్నారు. అంతకు ముందు కూడా అమెరి కాలో కార్మిక ఆందోళనలు జరిగినా చికాగో హేమార్కెట్ ఆందోళన స్థాయిలో కార్మికవర్గ సంఘీభావం ఎక్కడా వ్యక్తంకాలేదు. సమకాలీన అమెరికా రాజకీయాల్లో ఈ ఉద్యమం అనేక పర్యవసానాలకు దారితీసింది. సమాజం మారటానికి సాగే విప్లవం ఎంత అనివార్యమో అటువంటి విప్లవ యత్నాలను సాధ్యమైతే నీరుగార్చేందుకు, సాధ్యం కాకపోతే కూలదోసేందుకు ప్రతీఘాత విప్లవం ఒకదాన్ననుసరించి రెండోది వస్తూనే ఉంటాయి. అయితే ఈ రెండిటి మధ్య కాల వ్యవధి విప్లవం కోసం పని చేసే సంస్థ, దాని నాయకత్వ స్పష్టత, నిర్మాణ పటిష్టత, రాజకీయ దిశా నిర్దేశంలో స్పష్టతల మీద ఆధారపడి ఉంటుం ది. 8 గంటల పనిదినం కోసం సాగిన ఉద్యమంలోనూ అటువంటి అనుభవాలే ఎదురయ్యాయి. మే1న జయప్రదంగా సాగిన ఉద్యమాన్ని చెల్లా చెదరు చేయటానికి రాజ్యం, కంపెనీల యాజమాన్యాలు కుమ్మక్కయ్యాయి. మే 3న మెకార్మిక్ పేపర్ మిల్లు కార్మికుల ఆందోళనపై సాగిన దమనకాండను ఖండిస్తూ మే 4న హే మార్కెట్ కూడలిలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనపై పాలకవర్గాలు జరిపిన కాల్పుల్లో నలుగురు కార్మికనేతలు చనిపోయారు.
అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్ పిలుపు
1880-1890 దశాబ్దంలో అమెరికా పారిశ్రామిక వ్యవస్థ పెను మార్పులకు లోనైంది. దేశీయ మార్కెట్ విస్తరించింది. ఉత్పత్తి పెరిగింది. అయితే 1885లో చోటు చేసుకున్న ఆర్థిక సంక్షోభం కారణంగా కార్మికవర్గ సమస్యలతో పాటు నిరుద్యోగం కూడా పెరిగింది. కార్మికవర్గంతో పాటు ఎనిమిదిగంటల పనిదినం డిమాండ్‌ను సమర్ధిస్తూ నిరుద్యోగులు కూడా వీధుల్లోకి వచ్చారు. 1885లో జరిగిన ఓ సభలో ఈ డిమాండ్‌ను అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్ పునరుద్ఘాటించటమే కాక దేశంలోని అనేక సంఘాలు, సంస్థలు కూడా అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్‌తో జత కలిశాయి. ఈ తీర్మానంలో 1886 మే నుండి అమెరికా, కెనడాల్లో ఎనిమిది గంటల పనిదినాన్ని చట్టబద్ధం చేయాలని అమలు చేయాలని మహాసభ తీర్మానించింది. అటువంటి వాటిలో నైట్స్ ఆఫ్ లేబర్ అనే సంస్థ చాలా శక్తివంతమైనది. ఈ సంస్థ సభ్యత్వం ఈ కాలంలో రెండు లక్షల నుండి ఏడులక్షలకు పెరిగింది.
- కొండూరి వీరయ్య, 9871794037
Sun 25 Apr 02:42:31.9249 2021