Sun 25 Jul 06:04:16.562934 2021
Authorization
మన భారతదేశ న్యాయవ్యవస్థ అందరికీ ఆదర్శప్రాయమైనది. మన రాజ్యాంగంలో రాయబడిన శాసనాల ఆధారంగానే మన హక్కులు, అధికారాలు నిర్ణయించబడతాయి. అన్యాయం జరిగినపుడు ఏ శిక్షలు విధించాలో కూడా అందులోనే రాయబడ్డాయి. అయితే - న్యాయానికి రక్షణ, అన్యాయానికి శిక్షణ అనేది అనాదిగా జరుగుతున్నదే. జరగాల్సింది కూడా అదే. కొన్ని సందర్భాల్లో న్యాయానికి రక్షణ లేకపోవచ్చు.
ఇక్కడ - 'నాంది' (2021) సినిమాలో ఒక సగటు మనిషికి కూడా జరిగిన అన్యాయం అదే. ఏ పాపం తెలియని, ఏ నేరం చేయని, ఎవ్వరికీ హాని తలపెట్టని ఒక నిజాయితీ గల పౌరుడికి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటుతుందీపాట. తనకు జరిగిన అన్యాయానికి, తన మీద పడ్డ నిందని తానే తుడిచివేసుకోవడానికీ ఆ పౌరుడే ప్రతిఘటించడం ఇక్కడ ప్రత్యేకమైన విషయం. ఈ న్యాయ, అన్యాయాలకు మధ్య జరిగే ఈ సంగ్రామంలో న్యాయం వైపు నిలబడి మోగే ఈ మహౌజ్జ్వల గీతాన్ని రాసిన కవి చైతన్యప్రసాద్. భాషావేశంలోను,భావ ప్రకటనలోను ఆయనకు ఆయనే సాటి. అధ్యయన శీలంతో ఎంతో అనుభవాన్ని పొంది, వినూత్న అభివ్యక్తితో సన్నివేశాలకనుగుణంగా పాటను కవిత్వీకరించడంలో చైతన్యప్రసాద్ దిట్ట.
సినిమాకథ పరంగా చూస్తే... కథానాయకుడు తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి తనవైపు ఒక న్యాయవాదిని ఏర్పాటు చేసుకుంటాడు. ఇక్కడ తాను పెట్టుకున్న దరఖాస్తు సెక్షన్ - 211 కు చెందినది. అంటే ఐదేళ్ళు తాను అన్యాయంగా శిక్షను అనుభవించిన బాధితుడనని, నిందితుడిని కానని తాను చెప్పుకుంటూ పెట్టుకునే దరఖాస్తు ఇది.
ఈ దౌర్జన్యం ఇంకా ఎన్నాళ్ళు? తరతరాలుగా న్యాయానికి జరిగే ఈ అన్యాయాన్ని ఎవరూ ఆపలేరా? ధర్మం కోసం ఇలాగే నిరంతరం పోరాడుతూనే ఉండాలా? ఆశలు తొలగిపోయి నిరాశల చీకట్లు నిన్ను చుట్టుముట్టినా నువ్వు చతికిలబడిపోకుండా తొలి వెలుగులా ప్రకాశిస్తూ, ప్రశాంతమైన బాటలో నువ్వనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని హెచ్చరిస్తుందీ పాట. న్యాయం కోసం ఎన్నేళ్ళైనా, ఎన్నాళ్ళైనా సాగమని ప్రబోధిస్తుంది.
నువ్వనుకున్న గమ్యాన్ని ఈరోజే చేరాలి. ఈ యుద్ధంలో న్యాయానికి గెలుపు ఉన్నదో, లేదో అన్న సందేహాన్ని విడిచి పెట్టాలి. నీ ప్రయత్నం ఫలించాలంటే నీ సంకల్పం బలంగా ఉండాలి. ఒకవేళ నీకు ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, నీ దారులన్నీ ఎడారులై మూసుకుపోయినా, విధి నీ ప్రాణాలతో చెలగాటమాడినా, నీ సంకల్పమే, నీ ఆశయమే సందేశమై, ఒక సంఘర్షణై నిలవాలి.
ఈ అవినీతి చర్యలను గోతిలో పాతడానికి నీ సంకల్పమే నాంది కావాలి. నిద్రలేని రుద్రవీణ ఎలుగెత్తి వినిపించడానికి, గాయపడిన న్యాయమనే సింహం తిరిగి గర్జించడానికి, రాక్షసాన్ని కూల్చడానికి ఇదే నాంది కావాలి.
అడుగు ముందుకు వేశాక భయపడితే ఇక భవిష్యత్తు లేదు. అది బతుకే కాదు. యుద్ధంలో ఆయుధాలు మాత్రమే కాదు నీ సాహసమే నీకు తోడు కావాలి. వెనుకడుగు వేస్తే అది సమరమనిపించుకోదు. సవాళ్ళను ఎదుర్కొంటూ, అరాచకాల్ని ధిక్కరిస్తూ సాగిపో. ఇక సహనంతో నువ్వు ఆగిపోతే మార్పు రాదు. మంచి జరగదు. ఇన్ని రోజులు భరించిన బాధల్ని గుర్తుచేసుకో. దగాలు ఇక కుదరవని చెప్పు. దిగులు ఇక వదలమని జగతికి చాటి చెప్పు. నీ నిజాయితీ గెలిచి ప్రపంచాన్ని మేల్కొలిపే తీర్పు ఇదే రోజని తెలియజెప్పు.
నీ కంటినీరు మంటలాగ మారడానికి, నువ్వు రక్తాన్ని ధారవోసి, నీలా అన్యాయమైపోతున్న ఎందరెందరికో కొత్తబాటను వేయడానికి, నువు కోరుకున్న సరికొత్త చరిత్రను రాయడానికి, చేవచచ్చిన శాసనాన్ని నీ సంకల్పంతో మార్చడానికి ఇదే నాంది కావాలి. ఒక్క ఉక్కు గుండె తలచుకుంటే సాధించలేనిదేదీలేదని నువు నిరూపించాలి. నువు పోరాటంలో జయిస్తే, న్యాయం ఎప్పటికీ గెలుస్తుందన్న నమ్మకాన్ని నిలబెట్టినట్టు. అందుకే పొరాటం చేసి విజయాన్ని సాధించమని మహౌన్నత సందేశాన్నిస్తుందీపాట. అన్యాయం జరిగినప్పుడల్లా న్యాయం వైపు నిలబడి శంఖారావమై నినదిస్తుందీపాట.
పాట :-
ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా దౌర్జన్యాలా జ్వాలా?
న్యాయం కోసం ధర్మం కోసం సాగాలమ్మా మీలా?
నిరాశలా నిశీథులే నిరంతరం ఆవరించినా
ప్రభాతమై ప్రకాశమై ప్రశాంతమై సాగుమా
చేరాలమ్మా చేరాలమ్మా నీ గమ్యాన్నే నేడూ
సమరం మధ్య సంకోచాలా సందేహాలే వీడూ
నీ దారులే ఎడారులై ప్రాణాలతో ఆటలాడినా
సంకల్పమే సందేశమై సంఘర్షణై సాగుమా.
ఇదే నాంది ఘాతుకాల్ని గోతిలోన పాతడానికీ
ఇదే నాంది నిద్రలేని రుద్రవీణ రౌద్రగీతికీ
ఇదే నాంది గాయపడ్డ న్యాయసింహ గర్జనానికీ
ఇదే నాంది రాక్షసాన్ని కూల్చడానికీ.
భయపడితే భవిత లేనే లేదు
పిడికిలినే వీడరాదు
సమరములో సాహసాలే తోడు
వెనుకడుగే వేయరాదు
సవాలు కెదురుపడూ సయ్యంటు తిరగబడూ
సహించి నిలబడితే మార్పే రాదూ
దగాలు కుదరవనూ దిగాలు వదలమనూ
జగాన్ని మేల్కొలిపే తీర్పే నేడూ.
ఇదే నాంది కంటినీరు మంటలాగ మారడానికీ
ఇదే నాంది రక్తమోడ్చి కొత్తబాట వేయడానికీ
ఇదే నాంది చేవలేని శాసనాన్ని మార్చడానికీ
ఇదే నాంది ఒక్క ఉక్కు గుండె శక్తి చాటడానికీ.
- తిరునగరి శరత్ చంద్ర