Sun 15 Aug 00:51:03.800328 2021
Authorization
ఏడవ తరగతి చదువుతున్న ఏకనాథ్ నది ఒడ్డున కూర్చొని సెల్ ఫోన్ ఆన్ చేసి వీడియో గేమ్స్ చూడసాగాడు.
''ఏకనాథ్ గుడికి వెళ్ళాలి'' అంది తల్లి
''అమ్మా, నేనిక్కడే వుంటాను. నీవే వేళ్ళు'' వీడియో చూస్తూనే సమాధానం చెప్పిన కొడుకు వైపు బాధగా చూస్తూ తల్లి గుడికి బయలు దేరింది. ఏకనాథ్ వీడియో గేమ్స్ ఆడటంలో నిమగమయ్యాడు .
కొంతసమయం గడిచినతరువాత ఏకనాథ్ చేతిలోనించి సెల్‌ఫోన్ జారి నదిలో పడిపోయింది.
ఏకనాథ్ నదివైపు చూస్తూ భోరుమని ఏడవసాగాడు. ఆ ఏడుపు చూసిన నది దేవత ఒక్కసారిగా ప్రత్యక్షమయింది
అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ చూపిస్తూ ''ఇదేనా నీ సెల్ ఫోన్'' అంటూ అడిగింది
ఏక్ నాథ్‌కు చిన్నప్పుడు అమ్మచెప్పిన నదిలో పడిపోయిన గొడ్డలి కథ గుర్తుకు వచ్చింది. అబద్దం చెబితే ఏమీ ఇవ్వదని ఊహించాడు.
''నాది కాదు'' అన్నాడు.
నది దేవత ఒక్క సారిగా నదిలోకి వెళ్లి మరొక ఖరీదైన ఫోన్ తెచ్చి చూపిస్తే కాదన్న ట్టుగా తలా అడ్డంగా ఆడిం చాడు. మూడవసారి ఏకనాథ్ ఉపయోగించిన సెల్‌ఫోన్ తీసుకొని వచ్చి చూపిస్తే ''అది నాదే ఇవ్వండి'' అని అడిగాడు.
''మీ అమ్మ గుడికి ఎందుకు వచ్చింది చెప్పగలవా'' అడిగింది.
''ఇంకా పెళ్లి కానీ మా అక్కకు పెళ్లి కావాలని మొక్కు కొనడానికి వచ్చింది''
''మీ అమ్మ మనసు మార్చుకొని నీవు ఏ సెల్‌ఫోన్ చూడకుండా ఉండేలా చేయమని కోరుకోంది''
''ఎందుకలా'' అడిగాడు ఏకనాథ్
''ఈ నది ఒడ్డున ఒక అబ్బాయికి మీ అమ్మ నీ చేత పది రూపాయలు ఇచ్చి ధర్మం చేయమని చెబితే నీవు చేసావుగా''
''ఔను''
''ఆ అబ్బాయి నీలాగే ఏడవతరగతి చదివేవాడు. ఎప్పుడూ సెల్‌ఫోన్ చూస్తూ గుడ్డి వాడయ్యాడు. ఆ సంగతి తెలుసుకొన్న మీ అమ్మ చాలా భయపడిపోయింది. గుడిలో దేవుడు దగ్గర మీ అక్క గురించి అడగకుండా నీలో మార్పు రావాలని కోరుకొంది. నీకు ఈ సెల్ ఫోన్ కావాలా'' అడిగింది నదీ దేవత.
ఏక్ నాథ్ ఒక్క క్షణం అలోచించి ''అమ్మా మీరు ఆ అబ్బాయికి చూపు కలిగించేలా చెయ్యండి. నేనిక సెల్‌ఫోన్ చూడను'' అన్నాడు
ఏకనాథ్ మార్పుకు సంతోషించి ''మరో మూడు రోజుల్లో డాక్టర్ త్రివేణి ఈ గుడికి వచ్చి ఆ అబ్బాయిని చూసి జాలిపడి ఆసుపత్రికి తీసుకెళ్లి ఆపరేషన్ చేసి కంటి చూపు తెప్పిస్తుంది. ఈ సెల్‌ఫోన్ నీవు ఇక వాడవని తెలుసు, ఈ సెల్‌ఫోన్ తీసుకొని మీ అమ్మకు ఇచ్చేయి'' అంటూ సెల్ ఫోన్ ఏకనాథ్ చేతికిచ్చి అదశ్యమయింది.
- ఓట్ర ప్రకాష్ రావు, 09787446026