Sun 22 Aug 05:46:04.269573 2021
Authorization
పశ్చిమ కనుమల్లో ఓ దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో అడవి జంతువులు కలిసి మెలిసి జీవించేవి. కోతి, తోడేలు, నక్కలు స్నేహితులుగా ఉండేవి. అవి తమ కష్ట సుఖాలను ఒకరికొకరు చెప్పుకునేవి. అలా ఒకసారి ఆ ముగ్గురు మిత్రులు మాట్లాడుకోవడానికి ఓ పెద్ద చెట్టుకిందకు చేరాయి. ఆ సమయంలో ముగ్గురు చెట్టుపైన ఉన్న చాలా తేనె తుట్టలను చూసాయి. ముగ్గురికి వాటిని తెంచుకుని తినాలనే కోరిక కలిగింది.
తోడేలు చెట్లెక్కడంలో నేర్పరి అయిన కోతిని చెట్టెక్కి తేనె తుట్టలను తుంచమని ప్రేరేపించింది.
అప్పుడు కోతి ''తాను చెట్టెక్కడంలో దిట్టనేగాని.. ఒకవేళ తాను చెట్టెక్కితే ఆ తేనె టీగలు కుడుతాయనే'' భయంతో వెనుకంజ వేసింది.
కోతి చెప్పిన మాటతో నక్క, తోడేలు ఆలోచనలో పడ్డాయి.
రామచిలుకను రాయ బారిగా పంపి గుహలోని ఎలుగు బంటిని చెట్టు దగ్గరికి పంపించాయి.
తేనె తుట్టలను చూడగానే ఎలుగుబంటి ఉత్సాహంతో తేనె తుట్టలను తుంచి కొన్నింటిని కడుపునిండా జుర్రుకుంది. కొన్ని తుట్టెలను తీసుకుని తానుం టున్న గుహకు బయలుదేరింది.
ఎలుగుబంటికి దారిలో కోతి ఎదురైంది. ఏంటి ఎలుగు మామ ఎక్కడికి వెళ్తున్నావు? అంటూ కోతి పలుకరించింది.
''ఏం లేదు అల్లుడూ.. నా పిల్లలకిష్టమని తేనె తుట్టలను తుంచుకెళ్తున్నానని బదులిచ్చింది''.
అయ్యో! మామా నువ్వు చేతిలో పట్టుకెళ్తున్నవి 'అడవి కందిరీగ తుట్టెలు', 'తేనె తుట్టలు' కావని చెప్పి పక్కనే ఉన్న చెట్టుపైకి ఎగిరింది.
కొంత దూరం ఎలుగుబంటి వెళ్ళేసరికి తోడేలు ఎదురొస్తూ కన్పించింది. ఎలుగును చూసిన తోడేలు యోగక్షేమాలు విచారించి ''నీకేమయ్యింది ఎలుగు బావా! కందిరీగల తుట్టెతో నీకేం పనిపడిం?'' అని అక్కన్నుంచి వెళ్ళిపోయింది.
నిజంగా తాను తీసుకెళ్తున్నది తేనెతుట్టను కాదేనేమోననే ఎలుగుబంటి సందేహంలో పడింది. అదే అలోచనలతో ముందుకెళ్తున్న ఎలుగుకు నక్క కన్పించింది.
ఎలుగుబంటిని చూడగానే నక్క ఎంతో ఆత్మీయంగా పలుకరించింది. తాతల, ముత్తాతల కాలం నుంచి తమ రెండు కుటుంబాల మధ్యన ఉన్న స్నేహ సంబంధాన్ని చిలువలు పలువలుగా చెప్పింది. కాసేపు మాటలతో కోటలను కట్టింది. ఎక్కడ లేని ప్రేమ, ఆత్మీయతలను ఒలకబోసింది. నీ చేతిలో ఉన్న కందిరీగ తుట్టెలతో కొత్త వైద్యాన్ని చేస్తున్నావా? అని చివరగా తన పాచికను అమలు చేసింది.
ఎలుగుబంటికి మనస్సులో ఉన్న అనుమాన బీజం పెరిగి పెద్దదయ్యింది. నిజంగా తాను తీసుకెల్తున్నది ''కందిరీగల తుట్టెనే'' అన్న అనుమానంతో తేనె తుట్టలను తీసి పక్కనే ఉన్న పొదల్లోకి విసిరేసి తన నివాసానికి బయలు దేరింది.
ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న నక్క, తోడేలు, కోతి తమ పాచిక పారినందుకు సంతోషిస్తూ.. తలా ఒక్క తుట్టెను తీసుకుని ఆబగా తినసాగాయి.
- తూర్పింటి నరేశ్ కుమార్
8184867240