Sat 04 Sep 21:34:22.845721 2021
Authorization
జగన్నాథపురం అనే ఊరిలో ఒక పెద్ద బంగారం అమ్మే దుకాణం ఉంది. దాని యజమాని కమలనాథుడు. తన దుకాణంలో గుమాస్తా ఉద్యోగానికి పల్లవుడు, సారంగుడు అనే ఇద్దరు యువకులు వచ్చారు. ఇద్దరూ నమ్మకస్తులుగానే కనిపిస్తున్నారు కానీ ఎవరూ తన దుకాణంలో నమ్మకంగా, నిజాయితీగా పనిచేయగలరో తెలియాలంటే వారిద్దరికి ఒక పరీక్ష పెట్టాలనుకుని వారితో ఇలా అన్నాడు ''మీకు నా దుకాణంలో ఉద్యోగం కావాలంటే ముందుగా నేను అప్పగించిన పనిని మీరు సక్రమంగా నిర్వర్తించిన తరువాతే ఎంపిక చేస్తాను'' అని చెప్పి వారిద్దరికీ పట్టు వస్త్రంతో కుట్టిన చెరొక చిన్న చిన్న సంచులను ఇచ్చి వీటిలో విలువైన వజ్రాలు ఉన్నాయి మీరు వీటిని ఉత్తరం వైపునున్న రాజానగరం అనే ఊరిలో వున్న నా పెద్ద కుమారుడికి ఈ సంచిని ఇచ్చి రావాలి అని పల్లవునికి చెప్పాడు.
తూర్పు వైపున ఉన్న సిర్రాపురం అనే ఊరిలో ఉన్న నా చిన్న కుమారుడికి ఈ సంచిని అందజేయని సారంగుడికి చెప్పి ఈ వజ్రాలు వారికి అందినట్లుగా తన కుమారుల దగ్గర్నుంచి ఒక ఉత్తరాన్ని తీసుకురమ్మని వారికి పనిని అప్పగించాడు.
యజమాని చెప్పినట్లుగా ఇద్దరు ఎవరికి వారు తమకిచ్చిన సంచులను తీసుకుని చెరొక వైపుకు బయలుదేరారు.
పల్లవుడుకి కొంత దూరం వెళ్లిన తరువాత ఆ మూటలో ఏమున్నదో చూడాలని ఆశ కలిగింది. అవసరమైతే ఒక వజ్రాన్ని దొంగిలించాలని మనసులో అనుకుని ఆ మూటను విప్పి చూస్తే దానిలో వజ్రాలకు బదులు చిన్న చిన్న గులకరాళ్లు ఉన్నాయి.
పల్లవుడు ఆశ్చర్యంతో యజమాని చేసిన పనికి వాటిని పెద్ద కుమారునికి ఇవ్వకుండానే కోపంగా వెనుదిరిగి బయలుదేరి వచ్చేశాడు.
సారంగుడు మాత్రం ఆ మూటలో ఏమున్నదో చూడకుండానే యజమాని చెప్పినట్లుగా అతని చిన్న కుమారుడికి అందజేసి అతనుచ్చిన ఉత్తరాన్ని తీసుకుని వచ్చాడు.
ఇరువురు కలిసి యజమాని దగ్గరికి వచ్చారు ముందుగా యజమానితో పల్లవుడు కోపంగా ''ఏమిటి మీరు నాకు చేసిన అవమానం వజ్రాలని చెప్పి గులకరాళ్లను ఇచ్చి పంపించారు. సారంగుడుకి మాత్రం వజ్రాలను ఇచ్చి పంపించారు మా ఇరువురి మధ్య ఈ వ్యత్యాసం చూపించడానికి కారణం ఏమిటని'' అని అడిగాడు.
పల్లవుడు అడిగిన దానికి యజమాని సమాధానంగా ఏమయ్యా పల్లవా! ముందుగా నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు ఇచ్చిన సంచిని ఎందుకు తెరిచి చూశావు అని అడిగాడు.
పల్లవుడు వెంటనే కంగారుపడుతూ నాకు అనుమానం వచ్చి అసలు అవి వజ్రాల కాదా అని తెరిచి చూశాను అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదు అని అన్నాడు.
యజమాని కోపంతో నీ మాయమాటలు కట్టిపెట్టు పల్లవా ! నీకు అప్పగించిన పని ఏమిటి నువ్వు చేసిందేమిటి వాటిని చూడవలసిన అవసరం ఎందుకొచ్చింది. అంటే ఇతరుల సొమ్ము మీద నీకు అత్యాస ఉంది. మీ ఇరువురి మనస్తత్వాలను తెలుసుకోవాలని ఈ పరీక్ష పెట్టాను. ఈ పరీక్షలో సారంగుడు విజయుడుగా నిలిచాడు. తనకు అప్పగించిన బాధ్యతను ధర్మంగా నిర్వర్తించాలనే ఉద్దేశ్యం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ మూటని విప్పి చూడలేదు. నీలాగానే సారంగడికి కూడా గులకరాళ్లని ఇచ్చి పంపించాను. తనది కాని వస్తువుపై సారంగుడికి ఆశ లేదు కాబట్టి వాటిని చూడాలనుకో లేదు. కాబట్టి ఇక నువ్వు ఈ ఉద్యోగానికి పనికిరావు. వెళ్ళవచ్చు పల్లవా! అని అన్నాడు.
పల్లవుడు తనను తాను నిందించుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
ఆ తరువాత సారంగుడు సంతోషంగా ఉద్యోగంలో చేరి తన నిజాయితీతో అందరిచేత మంచివాడనిపించుకున్నాడు.
- గెడ్డం సుశీల రావు