Sun 12 Sep 05:36:29.309975 2021
Authorization
సోమన్న పొలంలో పని చేసుకుంటూ ఉండగా ఒక కాకి ఎగరలేక బాధతో అరవసాగింది. అతడు తన పనిని ఆపి ఆ కాకిని దగ్గరకు తీసుకొని దాని రెక్కలకు గాయమైనదని గమనించాడు. వెంటనే దానికి నీరు త్రాగించాడు. దాన్ని చెట్టుపైన ఉంచి ఆహారాన్ని పెట్టాడు. అది ఆహారాన్ని తిని చెట్టుపైననే ఉండిపోయింది.ఆ మరుసటిరోజు కూడా దానికి ఆహారాన్ని పెట్టాడు. ఇలా వారం రోజులు గడిచాయి. అయితే అతడు రోజూ కాకికి ఆహారం తినిపించడం చూసిన చుట్టు పక్కల పనిచేసుకుంటున్న కొందరు ''ఎవరైనా ఈ కాకికి ఆహారం పెడతారా'' అని అన్నారు. అప్పుడు సోమన్న ''ఎందుకు పెట్టకూడదు. అందులో ఇది గాయపడి ఉంది. పక్షులపై మనం జాలి చూపాలి'' అని అన్నాడు. ఆ మాటలు విని వారు మారు మాట్లాడకుండా అక్కడినుండి వెళ్లిపోయారు. గాయం మానిన ఆ కాకి ఒక వారం తర్వాత రివ్వున ఎక్కడికో ఎగిరిపోయింది. సోమన్న సంతోషించాడు.
ఒకరోజు సోమన్న భార్యతో పొలంలో పనిచేస్తూ తన చిన్న పాపను పొలం బయట ఒక చాపను వేసి పరుండ పెట్టాడు .ఆ పాప వద్దకు అప్పుడే ఆ కాకి కూడా వచ్చింది. ఎక్కడి నుంచో ఒక తేలు ఆ పాప వద్దకు రాసాగింది. అది గమనించిన కాకి అరవసాగింది. అది ఎందుకు అరుస్తుందో తెలియని సోమన్న ఆ తేలును గమనించి దాన్ని దూరంగా విసరివేసి పాపను రక్షించాడు. కాకి తలపై ప్రేమతో నిమిరాడు.
మరొక రోజు సోమన్న కొడుకు స్నానానికని చెరువుకు వెళ్ళాడు. స్నానం చేసే సమయంలో అతని వ్రేలుకున్న బంగారు ఉంగరం ఆ నీటిలో పడిపోయింది. అది అతని తండ్రి సోమన్నది. కొడుకు ముచ్చటపడితే అతని తల్లి తన భర్త సోమన్న వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి మరీ ఇచ్చింది. నీటిలో సోమన్న కొడుకు ఎంత వెతికినా ఆ ఉంగరం మాత్రం దొరకలేదు. దాంతో ఏం చేయాలో పాలుపోని సోమన్న కొడుకు బజారుకు వెళ్లి అచ్చం అలాంటిదే ఒక నకిలీ ఉంగరం కొని వేలికి పెట్టుకొని వెళ్లి తల్లికి ఇచ్చాడు. ఆ తల్లికి ఎలాంటి అనుమానం రాలేదు. ఆమె తన భర్తకు దాన్ని ఇచ్చింది.
అత్యవసరంగా ఒకసారి సోమన్నకు పొలంలోని ఎరువుల కొరకై డబ్బు కావలసి వచ్చి తన ఉంగరాన్ని ఒక నగల వర్తకుడి వద్ద కుదువ పెట్టడానికి వెళ్ళాడు. అతడు దాన్ని పరిశీలించి అది నకిలీదని తేల్చాడు. సోమన్న ఆశ్చర్యపోయాడు. అతడు అది నిజమైన ఉంగరం అని ఎంత వాదించినా నగల వర్తకుడు ఒప్పుకోలేదు. చివరకు సోమన్న ఇంటికి వెళ్లి భార్యకు ఈ విషయం చెప్పాడు. భార్య ఇంకొక నగల వర్తకునికి చూపించమని సలహా ఇచ్చింది. సోమన్న భార్య సలహాచే మరొక నగల వర్తకునికి దాన్ని చూపించాడు. అప్పుడు అతడు కూడా అది నిజమైన ఉంగరం కాదని తేల్చాడు. చేసేదిలేక సోమన్న ఇంటికి వచ్చి కుమారుని ఏం జరిగిందో చెప్పమని గద్దించాడు. అతడు భయపడుతూ జరిగిన విషయం చెప్పే సరికి కుమారుని ఏమీ అనలేక సోమన్న తల పట్టుకున్నాడు .చివరికి మిత్రుడి వద్ద అ డబ్బును అప్పుగా తీసుకొని అతడు ఎరువులను కొన్నాడు.
సోమన్న కొడుకు వేలినుండి నీటిలో జారిపడిన ఆ ఉంగరం ఒక జాలరికి దొరికింది. అతడు దానిని సంతోషంతో తీసుకొని నాలుగు రోజుల తర్వాత మరొక గ్రామంలో అమ్ముదామని అనుకున్నాడు. అతడు తన ఇంటిలో దాన్ని ఒకసారి తన వేలుకు ధరించాడు. ఆ జాలరి చెరువులో స్నానం చేసే సమయంలో అది జారుతుందని తెలిసి గట్టు పైన పెట్టి చెరువులోకి దిగాడు. ఇంతలో ఎక్కడి నుండి ఒక కాకి వచ్చి దాన్ని ముక్కున కరచుకొని పోయింది. రెప్పపాటుకాలంలో ఇది జరిగి పోయింది. అది తనకు తేరగా దొరికిన ఉంగరమే కనుక అతడు బాధపడలేదు.
ఉంగరం ముక్కున కరచుకొని పరిగెత్తిన కాకి సోమన్న ఆహారం తినిపించినదే. అది సోమన్న ఇంటిలో వాలి అతని కొడుకు ముందు దాన్ని వదిలి వేసింది. సోమన్న కొడుకు ఆశ్చర్యంతో దానిని తీసుకొని వెళ్లి తన తల్లికి ఇచ్చాడు. ఆమె ఎంతో సంతోషపడి దానిని సోమన్నకు ఇచ్చింది. సోమన్న దానిని గమనించి అది తన ఉంగరమేనని నిర్ధారించాడు. ఆ కాకిని దగ్గరకు తీసుకుని దాని తలను నిమిరాడు. ఈ విషయం ఇరుగుపొరుగువారిని పిలిచి సోమన్న కాకి తనకు చేసిన మేలు గురించి చెప్పి ''ఇప్పుడు చెప్పండి. ఈ కాకికి నేను ఆహారం తినిపించాను. అందుకు కతజ్ఞతతో ఇది అరచి నా పాపను తేలు నుండి కాపాడింది. పోయిన నా ఉంగరాన్ని తెచ్చి ఇచ్చింది. కతజ్ఞత అన్నది మనకు లేదు. ఏ పక్షి కైనా, జంతువు కైనా మనం మేలు చేయాలి తప్ప కీడు చేయరాదు'' అని అన్నాడు. ఆ మాటలు విన్న ఇరుగుపొరుగువారు ''సోమన్నా! మమ్మల్ని క్షమించు. మేమే తొందరపడ్డాము. నీవు చెప్పింది నిజమే. ఈ కాకి నీకు కతజ్ఞతగా చాలా మేలు చేసింది'' అని అన్నారు. ఆ మాటలకు సోమన్న ఎంతో సంతోషించాడు.
- సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య
9908554535