Sat 30 Oct 22:40:23.039593 2021
Authorization
ఒక కుందేలు అడవిలో స్వేచ్ఛగా తిరగలేక పోతుంది. పొదలమాటు నుంచి బయటకు రాలేక పోతుంది. చివరకు ఆహార (దుంపలు) సేకరణ కూడా దొంగచాటుగా చేయాల్సి వస్తుంది. కారణం అడవి జంతువులన్నీ కుందేలును రకరకాల పేర్లతో పిలుస్తూ వేళాకోళం ఆడుతుండేవి. పొట్టి కుందేలు, బుడ్డి కుందేలు, తెల్ల కుందేలు, పెద్ద చెవుల కుందేలు ఇలా జంతువులు నోటికి వచ్చిన పేర్లతో పిలవటం అది భరించలేక పోతుంది. అలా పిలవద్దని జంతువులకు చెప్పాలనుకున్నా ధైర్యం లేక మిన్నకుండేది. వాటికి కనపడకుండా తిరుగుతున్నా ఎక్కడో ఒకచోట దానిని పసిగట్టి ఏడిపించేవి. పాపం కుందేలు వాటి మాటలు వినలేక పొద నుంచి బయటకు రావటానికి సంకోచించేది. లోలోపల వెక్కివెక్కి ఏడ్చేది. తనను ఇలా చిన్నగా ఎందుకు పుట్టించావని దేవుడ్ని కూడా మనసులోనే ప్రశ్నించేది. ఒకరోజు ఉదయాన్నే జంతువులన్నీ కుందేలు పొద వద్దకు చేరుకున్నాయి. కుందేలు బయటకు రావటానికి తటపటాయించింది. ఎక్కడ బయటకు వస్తే ఆట పట్టిస్తారనే భయంతో వెనకడుగు వేస్తుంది. అదే సమయంలో కుందేలుకు బాగా ఆకలి వేయటంతో పొదలోంచి బయటకు రావాల్సి వచ్చింది. కుందేలును చూడగానే మిగతా జంతువులు రోజు మాదిరిగానే వేళాకోళం ఆడసాగాయి. కుందేలు వాటి మాటలను భరిస్తూనే దుంపలను ఏరుకొని తినసాగింది. ఇంతలో దూరంగా పెద్ద అరుపు వినపడింది. జంతువులన్నీ తల ఎత్తి ఆ వైపు చూశాయి.
అది సింహం గర్జన అని గ్రహించాయి. అంతే వాటిలో ఎక్కడ లేని భయం ఆవరించింది. ఒక్కసారిగా గజగజ వణుకుతూ ఒక దగ్గరకు చేరుకున్నాయి. ఎలుగుబంటి నోరు తెరచి మన అడవిలోకి కొత్తగా సింహం వచ్చిందని విన్నాను. కానీ ఇంతవరకు చూడలేదు. తక్షణం మనం ఈ ప్రదేశం నుంచి తప్పించుకోవాలి. లేకపోతే సింహానికి ఆహారం కాక తప్పదు అన్నది. సింహం పేరెత్తగానే జంతువుల నోట మాట రాలేదు. మన చావు ఈ కొత్త సింహం రూపంలో వచ్చిం దంటూ ఆక్రోశించాయి. మనం ఎంత దూరం పరిగెత్తినా సింహానికి దొరక్క తప్పదని భావించాయి. ఇంతలో సింహం అరుపు దగ్గరగా వినపడసాగింది. జంతువుల అవస్థను చూసి కుందేలు మీరు సింహం బారి నుంచి తప్పించుకోలేరు. నేను చెప్పినట్టు వింటే ప్రాణాలు దక్కించుకోవచ్చు అన్నది. అంత భయంలోను జంతువులు ఒక్క నవ్వు నవ్వి పెద్ద జంతువులం మా వల్ల కానిది చిన్నదానివి నువ్వు ఎలా రక్షిస్తావని ప్రశ్నించాయి. తన ప్లాన్ వాటి ముందుంచింది కుందేలు. కాసేపట్లో సింహం ఇక్కడకు రాబోతుంది. అది ఇక్కడకు రాకుండా మనమంతా ఐకమత్యంగా దానికి ఎదురుగా పెద్దగా అరుస్తూ పరిగెత్తాలి. సింహం మనల్ని ఆపి ప్రశ్నిస్తుంది. మీకంటే పెద్ద జంతువు మమ్మల్ని చంపేందుకు వస్తుంది అని చెబుతూ ఆగకుండా తలో దిక్కుకు పరిగెత్తాలి అని సలహా ఇచ్చింది. జంతువులకు చిట్టి కుందేలు ఆలోచన నచ్చింది. ధైర్యం చేసి దాని ఆలోచనను స్వాగతిస్తూ సింహం వస్తున్న వైపు భయం నటిస్తూ పరుగు ప్రారంభించాయి. దారిలో వాటికి సింహం ఎదురొస్తూ కనపడింది. జంతువులన్నీ లేని ధైర్యాన్ని కూడదీసుకుని పక్క నుంచి పరిగెత్తటం ప్రారంభించాయి. వాటి పరుగును చూసి సింహం ఆశ్చర్యపోయింది. ఏనుగును ఆపి ప్రశ్నించింది. వెనక నుంచి ఒక పెద్ద జంతువు తరుముకొస్తుందని, దాని చేతికి చిక్కితే చావు ఖాయమని తెలియటంతో ప్రాణ భయంతో పరుగులు పెడుతున్నట్టు తెలిపింది. ఇంతలో కుందేలు ముందుకొచ్చి ఆ జంతువు ఇప్పటికే రెండు సింహాలను చంపటం తాను కళ్లారా చూశానంది. సింహానికి వెన్నులో భయం ప్రారంభమైంది. ఇక్కడుంటే జంతువులను చంపి తినటం దేవుడెరుగు... తన ప్రాణాలు పోతాయి ... బతికుంటే బలిసాకు తినొచ్చు అనుకుని వెనక్కి తిరిగి మరో అడవిలోకి పారిపోయింది. సింహం పీడ విరగడ అవడంతో జంతువులన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. ఇక అప్పటి నుంచి తమను రక్షించిన కుందేలును వేళాకోళం ఆడటం మానుకొని స్నేహంగా మెలగసాగాయి. చిన్నదైనా యుక్తితో తమ ప్రాణాలు కాపాడిన కుందేలుకు కతజ్ఞతలు తెలిపాయి.
- తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర,
9492309100