Sat 20 Nov 22:59:32.8613 2021
Authorization
జగన్నాథుడు అనే పండితుడు విదర్భ రాజ్యానికి వెళ్లి తన పాండిత్యాన్ని ప్రదర్శించి విలువైన కానుకలను పొందాడు. అతడు చాలా పేదవాడు. అతని వెంట వచ్చిన అతని భార్య లీలావతి కూడా ఈ కానుకలను చూసి ఎంతో సంతోషించింది. కానీ అవి తమకు అన్నంపెట్టలేవు. అందువల్ల వాటిని అమ్మి డబ్బుగా మార్చుకుం దామని అనుకున్నారు. కానీ వారికి ఆ కానుకలు అమ్మడానికి మనసొప్పలేదు. కానీ తప్పనిసరై వాటిని డబ్బు కొరకు వారు కేవలం వంద రూపాయలకే అంగడిలో అమ్మారు .
ఆ రాజ్యంలో పిల్లుల ధర చాలా చౌక. ఒక్క రూపాయికే ఒక పిల్లిని అంగడిలో అమ్మసాగారు. జగన్నాథుడు భార్య సలహాచే ఆ వంద రూపాయలు పెట్టి ఒక వంద పిల్లులను కొని ఒక బండిలో వాటిని తన రాజ్యానికి తరలిం చాడు .అతని బంధువులు అతనిని అసహ్యించుకొని ''ఆ వంద రూపాయలు కూడా నీకు బాకీ లేవు. ఈ పిల్లులను ఏం చేస్తావు రా !వాటి బదులు ఇంకేమైనా సరుకులు కొన్నా ఉపయోగపడేవి కదా!'' అని అన్నారు .
అతని భార్య అతనికి ధైర్యం చెప్పి శాలిని రాజ్యంలో పిల్లులకు ధర చాలా ఎక్కువ అని తెలుసుకొని తన భర్తతో వాటిని అక్కడ అమ్మమని చెప్పింది. జగన్నాథుడు వాటిని బండిలో శాలినీ రాజ్యానికి తరలించి అక్కడ ఒక పిల్లిని వంద రూపాయలకు అమ్మి పదివేల రూపాయలు సంపాదించాడు. ఆ రాజ్యంలో ఎలుకల బాధ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఆ పిల్లులకు గిరాకీ పెరిగింది. అందువల్ల జగన్నాథునికి చాలా లాభం వచ్చింది .
అతడు తిరిగి వచ్చేట ప్పుడు భార్య సలహాతో అదే డబ్బుతో ఒక గుర్రా నికి వంద రూపాయలు చొప్పున ఖర్చుచేసి వంద గుర్రాలను కొనుక్కొని వచ్చాడు. అతని రాజ్యంలో గుర్రాలకు చాలా గిరాకీ ఉందని తెలుసుకొని అతని భార్య అతనికి వచ్చేటప్పుడు అదే డబ్బుతో గుర్రాలను కొనుక్కొని రమ్మని సలహా ఇచ్చింది. అలాగే వాటిని తీసుకొని వచ్చి ఒక్కొక్క గుర్రాన్ని వెయ్యి రూపాయలకు అమ్మి లక్ష రూపాయలు సంపాదించి లక్షాధికారి అయ్యాడు. అది మొదలు అందరూ లీలావతి సలహాలను అడిగి వ్యాపారం మొదలుపెట్టారు. ఆమె తన సలహాలకు డబ్బు వసూలు చేయసాగింది.
ఇది గమనించిన పిసినారి వరహాల శెట్టి కూడా ఆమె సలహాకు డబ్బులు ఎందుకులే అని తన భార్య సలహాచే విదర్భ రాజ్యం వెళ్లి జగన్నాథుని వలెనే అక్కడ పిల్లులను కొనుక్కొని రావడానికి వెళ్లాడు. అయితే అక్కడ అందరూ పిల్లులను కొనుక్కోవడానికి రావడం వలన వాటికి గిరాకీ పెరిగి వంద రూపాయలకు ఒక్క పిల్లి ధర పలికింది. చేసేది లేక వరహాలశెట్టి పది వేల రూపాయలు పెట్టి వంద పిల్లులను బండిలో శాలినీ రాజ్యానికి జగన్నాథుని వలెనే తరలించాడు. కానీ అక్కడ పిల్లుల ధర పడిపోయింది. అందువల్ల పది రూపాయలకు ఒక పిల్లి ధర పలికింది. వాటిని వాపస్ తేలేక వరహాల శెట్టి అక్కడ అలాగే అమ్మి నష్టపోయి తమ రాజ్యంలో గుర్రాలకు డిమాండ్ ఉన్న సంగతి తెలుసుకొని మరో పది వేలు ఖర్చు చేసి వంద రూపాయలకు ఒక గుర్రాన్ని కొనుక్కొని జగన్నాథుని వలెనే వంద గుర్రాలు తీసుకుని వచ్చాడు.
కానీ అతని దురదృష్టం కొద్దీ వారి రాజ్యంలో గుర్రాలకు కూడా గిరాకీ చాలా తగ్గింది. పది రూపాయలకే ఒక గుర్రం అమ్ముడు పోసాగింది. చేసేదేమీ లేక వరహాల శెట్టి పది రూపాయలకు ఒక గుర్రం అమ్మి 10 వేలు ఖర్చు పెట్టి ఒక వెయ్యి రూపాయలు మాత్రమే పొంది వ్యాపారంలో మరలా చాలా నష్టపోయాడు. ఇదంతా తాను పిసినారి తనం వలననే జగన్నాథుని భార్యను సంప్రదించకుండా తన భార్య సలహా చేతనే తాను వ్యాపారంలో నష్ట పోయానని శెట్టి ఎంతో బాధపడ్డాడు. జగన్నాథుని భార్య లీలావతి సలహాలకు తాను ముందే ఆమెకు ఎంతో కొంత డబ్బు చెల్లిస్తే తాను లాభపడే వాడినని శెట్టి అనుకున్నాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. అందువల్ల శెట్టి తిరిగి ఆమె వద్దకు వెళ్లి ఆమె సలహాలు స్వీకరించి మరొక వ్యాపారం చేసి తన పోయిన సొమ్మును తిరిగి రాబట్టుకున్నాడు. శెట్టి పిసినారి తనం విడువడమే కాకుండా తన భార్యను మరొకసారి సలహాను అడగలేదు.అందుకే పిసినారితనం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు.
- సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,
9908554535