Sat 04 Dec 23:34:12.640532 2021
Authorization
శివయ్య, కేశవయ్య ఇరుగు పొరుగు వారు. ఇద్దరూ మంచి స్నేహితులు. శివయ్య వజ్రాల వ్యాపారం చేస్తాడు, కశవయ్య వస్త్రాల వ్యాపారం చేస్తాడు.
ఒక సారి శివయ్య కుటుంబ సమేతంగా బంధువుల పెళ్లికి వెళుతూ, పది వజ్రాలు ఉన్న పెట్టెను కేశవయ్యకు లెక్క చెప్పి ఇస్తూ, ఒక వారం తరువాత వస్తాము, వచ్చాక తీసుకుంటాను అప్పటి వరకూ భద్రం చేయమన్నాడు. వీటి భద్రత నాది క్షేమంగా వెళ్ళి రండి అని చెప్పాడు కేశవయ్య.
ఒక వారం తరువాత శివయ్య, కేశవయ్య ఇంటికి వెళ్ళాడు. కేశవయ్య వజ్రాల పెట్టెను తిరిగి ఇస్తూ లెక్క చూసుకోమన్నాడు. లెక్క చూసుకుంటే నేను నిన్ను అనుమానించినట్లే అని వజ్రాల పెట్టెను తీసుకుని వెళ్లిపోయాడు
ఒక వారం తరువాత శివయ్య వజ్రాల పెట్టెను తెరిచి చూస్తే అందులో తొమ్మిది వజ్రాలే ఉన్నాయి. కేశవయ్య నుండీ పెట్టె తీసుకున్నప్పుడు లెక్క చూసుకుని ఉంటే బాగుం డేది, అని మనసులో అనుకు న్నాడు. కానీ మనసు ఊరు కోదు కదా.. ఈ విషయాన్ని తన మిత్రుడు చంద్రంతో చెప్పాడు.
దానికి చంద్రం ''కేశవయ్య పెట్టె ఇచ్చినప్పుడు నువ్వు లెక్క చూసుకోక పోవడం నీదే తప్పు'' అన్నాడు. ఒకరికి విషయం చెబితే వారు ఊరుకునే కాలమా ఇది, 'నోరు దాటితే పృథ్వి దాటుతుంది' అనే నానుడి ఉండనే ఉంది. చంద్రం ఊరుకోకుండా శివయ్యకు జరిగింది మరొకరికి చెప్పాడు. అలా ఆ విషయం ఊరందరికీ తెలిసింది. ఇది రంగయ్య చెవిన కూడా పడింది.
రంగయ్య కష్టపడి పనిచేసి కుటుంబ పోషణ చేస్తాడు. తన భార్య ఆరోగ్యం దెబ్బ తినడంతో వైద్యుణ్ణి సంప్రదించాడు. అతని భార్యను చూసిన వైద్యుడు ఇది చాలా పెద్ద జబ్బు దీనికి చాలా ఖర్చు అవుతుందని చెప్పాడు. శివయ్య ఇంట్లో పని చేసే శీనయ్య తన యజమాని వజ్రాల పెట్టెను కేశవయ్య ఇంట్లో పెట్టి ఊరు వెళ్ళిన విషయం రంగయ్యతో చెప్పాడు. తన భార్యను బ్రతికించుకోవాలని రంగయ్య అదే రోజు రాత్రి శివయ్య ఇంటికి దొంగతనానికి వెళ్ళి డబ్బులు దాచిన గదిని గుర్తించి పెట్టెలో దాచిన వజ్రాల పెట్టెను తీసి ఒక వజ్రాన్ని దొంగిలించాడు.
ఊరికే అందరూ కేశవయ్యను ఆడిపోసుకోవడం రంగయ్యకు బాధ కలిగించింది. దోచుకున్న వజ్రాన్ని ఎక్కడ మార్చలేక ఒక రోజు ఆ దేశం రాజు వద్దకు వెళ్లి తను వజ్రాన్ని దోచుకున్న సంగతి చెప్పాడు.
''శివయ్య, కేశవయ్యల వద్దనే ఈ విషయం చెప్పవచ్చుకదా! నా వద్దకు రావడం దేనికీ?'' అన్నాడు రాజు.
''మహారాజా! వారి వద్దే ఈ విషయం చెబితే నా ప్రాణానికి హాని జరుగుతుందని మీ వద్దకు వచ్చాను'' అన్నాడు రంగయ్య.
''చేసిన నేరం ఒప్పుకోవడం వల్ల నీకు శిక్ష తగ్గుతుంది'' అన్నాడు రాజు. తరువాత మంత్రితో చెప్పి శివయ్యను, కేశవయ్యను పిలిపించాడు.
''అనవసరంగా కేశవయ్య మీద నింద మోపబడిందన్న బాధతో నీవు చేసిన దొంగతనాన్ని నిజయ తీగా ఒప్పు కోవడం చాలా గొప్ప విష యం'' అని రంగ య్యను మెచ్చుకుని జరిగింది శివయ్యకు, కేశవయ్యకు చెప్పాడు రాజు.
రంగయ్య ఆ వజ్రాన్ని శివయ్యకు ఇచ్చాడు. ''రంగయ్య నీది మొదటి తప్పుగా భావించి శిక్ష లేకుండా చేస్తున్నాము'' అన్నాడు రాజు.
''కేసవయ్య వద్ద వజ్రాల పెట్టెను తిరిగి తీసుకున్నప్పుడు లెక్క చూసుకోకుండా అతని మీద నింద వేసి విషయం ఒకరికి చెప్పి అందరికీ చేరేలా చేశావు.. నిజానికి కేశవయ్య ఎంత మదనపడి ఉంటాడో ఆలోచించావా?'' అని శివయ్యతో అన్నాడు రాజు.
''అవును మహారాజా! నాదే తప్పు'' అని కేశవయ్యను క్షమించమని అడిగాడు శివయ్య.
రంగయ్య నిజాయతీని మెచ్చుకుని తన వస్త్రాల అంగడిలో పనికి పెట్టుకున్నాడు కేశవయ్య.
- యు. విజయశేఖర రెడ్డి, 9959736475