Sun 23 Jan 11:25:45.034185 2022
Authorization
రఘు ఆడుకోవడానికి తన స్నేహితురాలు లలిత ఇంటికి వెళ్లేసరికి అక్కడ ఒక అందమైన దృశ్యం కనపడింది. రఘుని చూడగానే స్వాగతం పలికింది లలిత పక్కనున్న ఆమె కొత్త స్నేహితురాలు. రఘు నవ్వుతూ లలిత వద్దకు వెళ్లి '' భలేగా ఉంది లలిత ఈ చిలుక. ఎంత బాగా పిలిచిందో నా పేరు'' అన్నాడు ఆనందంగా. లలిత తన కొత్త నేస్తం చిలుక వైపు చూస్తూ '' మా నాన్నగారు నా పుట్టినరోజు బహుమతిగా ఈ చిలుకను కొనిచ్చారు. నేనేం మాట్లాడితే అది మాట్లాడుతోంది తెలుసా'' అని చెప్పింది. నేస్తమా! రఘు చాలా మంచివాడు అని చెప్పు అంది చిలుకతో. వెంటనే ఆ చిట్టి చిలుక ముద్దు ముద్దుగా రఘు చాలా మంచివాడు అని చెప్పేసరికి రఘు తెగ సంబరపడిపోయాడు. రోజూ పాఠశాల ముగియగానే లలిత వాళ్ళింటికి వెళ్లి కాసేపు చిలుకతో ముచ్చట్లు చెప్పి వచ్చేవాడు.
ఒకరోజు రఘుకి, లలితకి పాఠశాలలో చిన్న తగువు అయ్యింది. రఘు కోపంతో ఆ రోజు లలిత ఇంటికి వెళ్ళలేదు. కానీ రఘు మనసంతా ఆ చిట్టి చిలుక పలుకుల మీదనే ఉంది. ఎలాగైనా తను కూడా చిలు కను పెంచుకుని దానికి లలిత వద్దనున్న చిలుక కన్నా బోలెడు మాటలు మాట్లాడించాలని అను కున్నాడు. అనుకున్నదే తడవుగా వాళ్ళ అమ్మనడిగి ఒక అందమైన చిలుకను కొనిపించుకున్నాడు. ఆ చిలుకకు లోలా అని పేరు పెట్టాడు. దానిని ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి దానితో మాట్లాడించడానికి అన్ని రకాలుగా ప్రయత్నించాడు. కానీ లోలాకి రఘు ఇంట్లో మొదటి రోజు అవడం వలన కాస్త బెరుకుగా ఉండి ఒక్క పలుకు కూడా పలుకలేదు. తన చిలుక పలుకుల కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన రఘు చాలా నిరుత్సాహపడిపోయాడు. రఘు వాళ్ళ అమ్మ ''లోలా మనింటికి ఇవాళే కదా వచ్చింది. కాస్త సమయం ఇవ్వు దానికి'' అని రఘుని సముదాయించింది.
మరునాడు ఉదయమే లేచి పాఠశాలకు వెళ్లే ముందు కాసేపు లోలాతో మాట్లాడించడానికి ప్రయత్నించాడు. బడికి వెళ్లే సమయం కావడంతో ఇంక లోలాను వదిలి బడికి వెళ్ళాడు. సాయంకాలం ఇంటికి వస్తూనే లోలా దగ్గరే కూర్చుని మాటలు నేర్పే పనిలో గట్టిగా అరుస్తూనే ఉన్నాడు. రఘు అరుపులకు లోలా బెదిరిపోయింది. లోలా పలుకక పోయేసరికి రఘుకి చాలా కోపం వచ్చేసింది. ''ఈ చిలుక పలుకదు అమ్మా! మొద్దు చిలుక'' అంటూ ఏడుస్తూ పడు కున్నాడు. లలిత వద్ద ఉన్న చిలుక కన్నా గొప్పగా మాట్లాడగల చిలుక తన వద్ద ఉందని తన స్నేహితులందరికీ గర్వంగా చెప్పుకోవాలని ఆశపడ్డ రఘు మనసంతా బాధతో నిండిపోయింది.
రాత్రంతా నిద్రలో కూడా ఈ చిలుక నాకొద్దు అంటూ కలవరిస్తూ పడుకున్న కొడుకుని చూసి వాళ్ళ అమ్మకి జాలివేసింది. మరునాడు ఉదయం లేచాక అసలు లోలా వైపు చూడను కూడా చూడకుండా రఘు బడికి తయారయ్యి వెళ్ళిపోయాడు. రఘు కనపడక లోలా అటు ఇటు చూస్తూ వెతుకుతోంది.
ఆ రోజు సాయంకాలం రఘు బడి నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంటిలో నుంచి ''రఘు లోపలికి రా'' అంటూ చిలుక పలుకులు వినపడ్డాయి. రఘు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్లి ఆశ్చర్య పోయాడు. తను పలుకదు అనుకున్న లోలా ఇప్పుడు ఎంత మధురంగా మాట్లాడుతోందో! లోలా పక్కనే తన చిలుకతో పాటు కూర్చున్న లలిత కూడా కనపడింది రఘుకి.
ఆశ్చర్యంతో చూస్తున్న రఘు వద్దకు వాళ్ళ అమ్మ వచ్చి '' నీ చిలుక మాట్లాడట్లేదు అని బడిలో స్నేహితుల వద్ద నువ్వు బాధపడటం చూసిన లలిత ఇవాళ నీ కోసం మనింటికి వచ్చి లోలాకి మాటలు నేర్పింది. నువ్వేమో లలిత మీద కోపంతో లోలాకి తొందరగా మాటలు నేర్పాలని ఆరాటపడ్డావేగాని దానికి నేర్చుకునే సమయం ఇవ్వకుండా అది మాటలు రానిది అని ఒక నిర్ణయానికి వచ్చేశావు.'' అని అసలు విషయం చెప్పింది.
రఘు తన పొరపాటు తెలుసుకుని లలిత వద్దకు వెళ్లి మన్నించమని అడిగి మాటలు చెప్తున్న తన చిలుకని చూస్తూ మురిసిపోయాడు.
- హారిక చెరుకుపల్లి,
9000559913