Sat 05 Feb 22:55:13.636164 2022
Authorization
రాకేష్ జమీందారు బిడ్డ తన తండ్రి వలే పేదలకు సహాయం చేయాలనే ఆలోచన ఉన్నవాడు. ఒక రోజు స్కూల్ నుంచి కారులో వస్తుండగా ఓ చెత్త కుండి దగ్గర కొంతమంది పిల్లలు ఎంగిలి విస్తళ్ళు కోసం ఎగబడి తినడం చూసి చలించి పోయాడు. వారికి సరిగ్గా బట్టలు కూడా లేవు. చింపిరి జుట్టుతో ఉన్నారు. ఒకరినొకరు తోసుకుంటూ, కొట్టుకుంటూ విస్తళ్ళ కోసం ఎగబడుతున్నారు. ఇంటికి వెళ్ళినా అదృశ్యం కళ్ళ ముందు కదలాడుతోంది.
డైనింగ్ టేబుల్ దగ్గర తల్లి, తండ్రి ''అన్నం తినవేం'' అన్నారు. జరిగింది చెప్పాడు రాకేష్. దానికి తండ్రి ''ఈ దేశంలో ఇవి మాములే, నేను కూడా అటువంటి వాళ్ళకు
సహాయం చేశాను వారి కోసం ఏదయినా ఏర్పాటు చేయాలి అనుకున్న కానీ అలానే సమయం గడిచి పోతున్నది ముందు అన్నం తిను'' అన్నాడు. తల్లి తల నిమురుతూ ''రేపు స్కూలుకు వెళ్ళేటప్పుడు వారికి ఏమైనా ఇద్దువు గానిలే ముందు అన్నం తిను నాయన'' అంది. ముద్ద నోట పెట్టుకోబోతుండగా సహించక లేచాడు. ఆ రోజు ఏమి తినక అలానే పడుకున్నాడు. ఆ దృశ్యం కళ్ళ ముందు కదలాడుతుంటే ఎప్పటికో నిద్ర పోయాడు. ఉదయానే మళ్ళీ అదే దృశ్యం కనపడితే కారు దిగి వాళ్ళ దగ్గరకు వెళ్ళి ''ఆగండి మీకు కావలసినంత భోజనం పెడతాను, చక్కగా చదువు చెప్పిస్తాను. ఇలా ఎంగిలి విస్తళ్ళకు ఎగబడకండి'' అన్నాడు.ఆ మాటకు పిల్లలు తలలు ఆడించారు. వాళ్ళను తన కార్లోనే ఇంటికి తీసుకు వెళ్ళి స్నానం చేపించి, మంచి బట్టలు ఇప్పించాడు. ఓ ప్రైవేట్ టీచర్ను ఏర్పాటు చేసి చదువు చెప్పించాడు. క్రమంగా శుచి, శుభ్రత, క్రమశిక్షణ ఆ పిల్లలు నేర్చుకున్నారు. వారిలో ఒకరు చక్కగా చదువుకుని కలెక్టర్ అయ్యాడు. కాలక్రమంలో రాకేష్ ఆక్సిడెంట్లో మరణించాడు. కలెక్టర్ అయిన కుర్రాడు అనాధ పిల్లలకు రాకేష్ పేరిట ఆశ్రమం ఏర్పాటు చేసి వారి ఆకలి తీరుస్తున్నాడు. అది రాకేష్ తండ్రికి తెలిసి ఆ ఆశ్రమానికి వచ్చాడు. తన కుమారుని చిత్రపటం అక్కడ కనపడగానే కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఎంతోమంది అనాధ పిల్లలు అచ్చట ఆశ్రయం పొందుతున్నారు. రాకేష్ వలన కలెక్టర్ అయిన కుర్రాడు ఆయన దగ్గరకు వచ్చి ''మీ కుమారుని ఆశయం ఉదాత్తమైనది. జమీందారు బిడ్డ అనే గర్వం ఏ కోశాన లేదు. ఆ రోజు నన్ను చేరదీసి చదువు చెప్పించి ఉండకపోతే నేను కలెక్టర్ అయ్యేవాడినా! నిజంగా నీ కుమారుడు ఈ ఆశ్రమానికే జమీందారు'' అన్నాడు కళ్ళు వత్తుకుంటూ. ''అవును బాబు నీ మంచితనంతో, కృతజ్ఞతతో వాడి పేరు పెట్టి ఋణం తీర్చుకుంటున్నావు. ఈ సమయంలో వాళ్ళ అమ్మ ఉంటే ఎంతో సంతోషించేది. నా ఆస్తిని కూడా ఈ ఆశ్రమానికే రాసిస్తున్న. ప్రతి పిల్లవాడు చదువుకోవాలి, రోడ్లపై తిరగ కూడదు'' అన్నాడు. ''అలాగే సార్ '' అన్నాడు. రాకేష్ తండ్రి మంచి మనసుకు కృతజ్ఞతలు చెప్పాడు ఆ కుర్రాడు.
- కనుమ ఎల్లారెడ్డి, 93915 23027