Sat 26 Feb 23:22:59.341039 2022
Authorization
వింటేజీ వస్తువులుంటాయి. విక్టోరియన్ ఎరా వైభవాలు మిగిలుంటాయి. కానీ వింటేజీ విలేజ్ లు ఇంకా పశ్చిమాన ఉన్నాయని తెలుసా. 17, 18 శతాబ్దాలనాటి అనుభూతుల్ని ఇప్పటికి మీకు గుర్తుచేస్తాయని తెలుసా. నెదర్ ల్యాండ్స్లోని జాన్సె స్చాన్స్ అనే గ్రామం పాతకాలపు డచ్ సంస్కృతిని ఇంకా బతికిస్తూనే ఉంది. జాన్ నది తూర్పు ఒడ్డున విస్తరించిన ఈ గ్రామం చాలా విశాలమైంది. అందమైన పొలాలు, ఇప్పటికీ పనిచేసే గాలి మరలు, పాతకాలపు రంగురంగుల చెక్క ఇండ్లు, వింటేజీ సైకిళ్లు సంప్రదాయ గ్రామీణ వేషధారణతో ప్రశాంతంగా ఉండే ఆ గ్రామంలో అడుగుపెడితే రెండు మూడొందల ఏండ్లు టైమ్మెషీన్లో టెలిపోర్ట్ అయిపోతాం. ఈ అపురూపమైన గ్రామాన్ని చాలా అబ్బురంగా చూసుకుంటారు స్థానికులు. ఈ పల్లె అందానికి పట్టం కడుతూ అక్కడ ఓ మ్యూజియం కూడా 1994లో కొలువుదీరింది. ఉత్తర హాలెండ్ ప్రావిన్స్ కిందకు వచ్చే ఈ ప్రాంతం ఆమ్స్టర్ డ్యామ్ దగ్గరలోనే ఉంటుంది. 1961 నాటి నుంచి డచ్ ఆర్కిటెక్చర్ అద్భుతాలైన చెక్క ఇండ్లను, గాలి మరలను, బార్న్ (ధాన్యపు కొట్టాం)లను అతి జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. 1574 నుంచే ఉన్న ఈ గ్రామ ప్రత్యేకతను పదిలం చేస్తూ వచ్చారు. ఏటా పది లక్షల మంది పర్యటించే ఈ గ్రామంలో పర్యాటకుల హడావిడే కనిపించనంత విశాలంగా ఉంటుంది.
జాన్సె నదిని హత్తుకుని అల్లుకున్న ప్రకృతితో పోటీ పడుతుంది ఆ గ్రామం అందం. అక్కడి చాలా పర్యాటక ప్రదేశాలకు ప్రవేశం ఉచితం. కొన్నింటికి మాత్రం రుసుము చెల్లించాలి అది కూడా నామమాత్రమే. ఎందుకంటే ఆ పల్లె అందాన్ని వెలకట్టలేరు. ఎప్పుడైనా మనసు అలనాటి గ్రామ సీమల ఊహల్లోకి ఎగిరిపోతే ఇక్కడ వాలిపోయి దాన్ని బుజ్జగించవచ్చు.