Sun 13 Mar 00:16:43.130702 2022
Authorization
కూచారం గ్రామంలో రాజయ్య అనే రైతు ఉండేవాడు.రాత్రి పగలనక కష్టపడి వరి పంట పండించే వాడు. పంటకు ధర లేక ఎన్నో నష్టాలు వచ్చుచుండెను. ఇల్లు గడవడం చాలా కష్టంగా మారింది. చాలా మంది రైతులు సరైన ధర రాకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కాని రాజయ్య మాత్రం మార్కెట్లో ఏ పంటకు ధర ఎక్కువగా ఉంటుందో ఆ పంట వేసే వాడు.
రాజయ్యకు కొడుకు ఉన్నాడు. కొడుకు పేరు మురళి. భార్య కనకమ్మ కూలి పనులకు వెళుతుంది. మురళికి చదువుపై శ్రద్ధ లేదు. అందరు చదివి ఉద్యోగాలు చేస్తే మరి తినడానికి ధాన్యం ఎలా లభిస్తుంది అని ఆలోచించి తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు.
నేను మానాన్న లాగా రైతును కావాలని కలలు కంటూ ఉండేవాడు. రోజు నాన్నకు వ్యవసాయంలో సహాయం చేస్తుండేవాడు. ఈ సారి వరి పంటతోపాటు, పెసరు పంట వేశాడు. కోతకు వచ్చే సమయానికి అనుకోకుండా భారీ వర్షం కురవడంతో పంట అంతా నీటమునిగి మొత్తం నేలపాలు అయ్యింది. చేసేది లేక గుండె ధైర్యం తెచ్చుకొని పెసరు పంటకైనా మంచిధర వస్తే అప్పులన్నా తేర్పవచ్చునని అనుకున్నాడు రాజయ్య. పెసరు పంట పండింది. కొంత తినడానికి ఉంచుకొని మిగతా పంటను అమ్మి అప్పు కట్టాడు.
వరి పంటకు బదులు ఈ సారి మొక్కజొన్న పంట వేయాలి అని కొడుకు అన్నాడు.
రాజయ్య, కనకమ్మ, వీళ్ళకు తోడు కొడుకు మురళి సహాయ పడడంతో మొక్కజొన్న పంట మంచిగా పండింది. అప్పులన్నీ తీరిపోయి కుటుంబం సుఖంగా జీవించసాగింది.
మురళికి నాన్నమ్మ అంటే చాలా ఇష్టం. కానీ పోయిన సంవత్సరం కరోనా సోకడంతో చనిపోయింది. నానమ్మ కావాలని ఎప్పుడూ కలలు కంటూ ఉండేవాడు.
ఒకరోజు మురళి వేరే ఊరికి వెళ్తున్నాడు. అక్కడ ఒక ఇంటిలో కొడుకులు ఇద్దరు గొడవ పడుతూ వాళ్ళ అమ్మకు ముసలితనం రావడంతో బయటికి గెంటి వేస్తున్నారు. నువ్వే సాదాలి అని అన్న, నువ్వే సాదాలి అని తమ్ముడు గొడవ పెట్టుకుంటున్నారు. ఇదంతా మురళీ గమనించాడు. మీ అమ్మను అలా బయటకి వదిలేయడం బాగుందా ఈవిధంగా చేస్తే ఎలా అని నచ్చ చెప్పబోయాడు మురళి.
మా కుటుంబం మా ఇష్టం మేము ఏమైనా చేసుకుంటాం. నీకేమి అవసరం. అంత బాధ అనిపిస్తే మీఇంటికి తీసికెళ్లు అంటారు. వెంటనే మురళి సరే మీకు అంత ధైర్యం ఉంటే పంపించండి. మా ఇంటికి తీసుకెళ్తానుఅని మురళి అంటాడు.
పోయిన సంవత్సరం మా నాన్నమ్మ కరోనా వ్యాధితో చనిపోయింది. నాకు పెద్ద వారు అంటే చాలా గౌరవం. మీ అమ్మను తోలిస్తానంటే హాయిగా నేను తీసుకెళ్తాం అని అంటాడు. వాళ్ల అమ్మ అంటుంది నీకెందుకు బిడ్డా ఈ ప్రేమ. నేను కష్టమైనా, నష్టమైనా ఇక్కడేఉంటాను మీ కుటుంబానికి భారం కాను. ఏదో దొరికింది తినుకుంటూ ఇక్కడే పడి ఉంటాను అని అంటుంది.
వద్దమ్మా మా ఇంటికి వెళ్దాం పద!
మా అమ్మనాన్నలు ఏమీ అనరు. చాలా ప్రేమ తోటి నిన్ను చూసుకుంటారు అని ప్రాధేయపడతాడు మురళి. మురళి వెంట ఆ ముసలి అవ్వ వాళ్ళ ఇంటికి వస్తుంది. జరిగిన విషయం అంతా తల్లిదండ్రులకు చెప్తాడు మురళి. కొడుకు మంచి పని చేసిండని తల్లిదండ్రులు మురళిని మెచ్చుకుంటారు. మన ఇంటికి నానమ్మే వచ్చిందని మురళి అనుకుంటాడు. నాకు మంచి మంచి సలహాలు, కథలు చెప్పుతుంది అనుకుంటాడు.
పెద్దమనుషులు ఉన్న ఇల్లు అందాల హరివిల్లులా బాగుంటుందని తల్లిదండ్రులు ముసలవ్వను చేరదీశారు. ముసలవ్వ పొద్దట్నుంచి, రాత్రి అయ్యే వరకు కుటుంబం ఏఏ పనులు చేయాలో అన్ని సూచనలు చెబుతుండేది.
ఆ అవ్వ చెప్పిన విధంగా వారందరూ నడుచుకోవడం వల్ల కుటుంబం చాలా సుఖంగా ఉంటుంది. అప్పటి నుంచి ఆ అవ్వను మురళి నాన్నమ్మ అనుకుంటూ ప్రేమగా పిలుచుకుంటున్నాడు.
- కందుకూరి శతి, 9704865816
9వ, తరగతి, జెడ్ పి హెచ్ ఎస్
గుర్రాల గొంది, సిద్దిపేట జిల్లా.