ఒక్కడివో అనేకుడివో
అవేశానివో ఆశయానివో
సహనానివో, సమరానివో
ఒంటరివో, సమూహానివో
ఉద్యమ భాషవో, విప్లవ శ్వాసవో
ఏదో ఏమి, అన్నీ నీవైన వాడివి వేడివి
మా నిరంతర చలనంలో
వెన్నంటిన కదిలికవు
వేగం ఎగరేసిన ఎర్రజెండాలో
నిగనిగలాడే అద్భుత మెరుపువి
నువ్వు లేవు... కాదు కాదు
సింధూరమై తూరుపు మందారమై
ఆశయావరణానివై మాతోనే వున్నావు
లక్ష నక్షత్రాల కాంతిలా
లక్ష్యానికి వెలుగు చూపుతున్నావు!
రెడ్ సెల్యూట్ సుందరయ్యా!
రెడ్ సెల్యూట్!
- కె. ఆనందాచారి
'మేడే' అనగానే ప్రపంచ కార్మిక దినోత్సవ
పండగగా మనమంతా జరుపుకుంటాం. కానీ
ఈ మహనీయుడు కూడా అదేరోజు జన్మించడం
భారత దేశ విప్లవ దిశానిర్దేశానికి ఓ సంకేతం.
ఆయన ఆశయం సోషలిజం.. ఆయన జీవితం
త్యాగమయం.. ఆయన చూపిన మార్గం నేటితరానికి
ఆదర్శనీయం.. అనుసరణీయం.. పీఎస్ 109వ జయంతిని పురస్కరించుకుని
ఈ వారం 'సోపతి' కవర్‌పేజీ కథనం...
ఆయనొక విప్లవ కార్యదీక్షాపరుడు..
కమ్యూనిస్టు కర్తవ్య సాధకుడు..
మార్కిస్టు సిద్ధాంత బోధకుడు..
కార్మిక, ప్రజా ఉద్యమ నాయకుడు..
తెలంగాణ సాయుధ పోరాట సారథుడు..
స్వాతంత్య్ర సమర యోధుడు..
శ్రమజీవుల వైతాళికుడు...
సమసమాజ నిర్మాణ స్వాప్నికుడు..
పేదల గుండెల్లో చిరస్మరణీయుడు..
ఆయనే
కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య....
చాలా మంది పీఎస్ అని కూడా పిలుస్తారు...
కొంతమంది కాలగమనంలో కనుమరుగవుతారు. కానీ పుచ్చలపల్లి సుందరయ్య దీనికి భిన్నం. ఆయన ఆదర్శ వ్యక్తిత్వం, నిబద్ధతమైన క్రమశిక్షణ, నిరంతర ప్రజాసేవ ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశాయి. ప్రపంచంలోని కమ్యూనిస్టు నేతల జాబితా తీస్తే అందులో ప్రముఖంగా వినిపించే పేరు సుందరయ్య. దక్షిణ భారత కమ్యూనిస్టు నిర్మాణంలో అగ్రగణ్యుడు. పుట్టింది 1913 మే1 ఆంధ్రాలోని నెల్లూరు జిల్లా కొవ్వూరు తాలూక అలగానిపాడు. తల్లిదండ్రులు శేషమ్మ, వెంకట్రామిరెడ్డి. వారంతా ఏడుగురు సంతానం. నలుగురు అక్కల తర్వాత సుందరయ్య ఆరోవాడు. అందరికంటే చిన్నవాడు రామచంద్రారెడ్డి ప్రజా వైద్యునిగా అందరికీ సుపరిచితుడు. పుచ్చలపల్లిది భూసామ్య కుటుంబం. అప్పుడే 50 ఎకరాల భూమి, ఊర్లో మంచి పలుకుబడి ఉండేది. ఆయన ఆరేండ్ల వయసులో ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. అప్పటి నుంచి ఇంటికి పెద్దవారైనా అన్నలు, అక్కలే ఇంటి బాధ్యతలు చూస్తూ వచ్చారు. సుందరయ్య మొదట్లో గ్రామంలోని పంచాయతీ పాఠశాలలో చేరాడు. దాన్ని వీధిబడి అనేవాళ్లు. ఆ బడిలోకి వ్యవసాయదారుల పిల్లలు, చేనేతల పిల్లలు మాత్రమే వెళ్లేవారు. దళితులకు ప్రవేశం నిషేధం. ఇది సుందరయ్యకు ఏమాత్రం నచ్చేది కాదు. బడిలో ఈయనకు తుంటరి పిల్లవాడు అనే పేరు. కానీ శతకాలు, లెక్కలు మాత్రం బాగా చెప్పి క్లాసులోనే మొదటి స్థానంలో నిలిచేవాడు. పెద్ద బాలశిక్ష ఆయన తొలిపాఠ్య పుస్తకం. కింది తరగతులను కూడా ఇతరుల కంటే ముందే పూర్తిచేశాడు.
బాల్యం నుంచే పోరాట శైలి...
సుందరయ్యది బాల్యం నుంచే పోరాట శైలి. తన కండ్ల ముందు ఏ అన్యాయం జరిగినా సహించేవాడు కాదు. కొన్ని కులాల వాళ్లను తక్కువగా చూడటం, చులకనగా మాట్లాడటం, అంటరానితనం, సామాజిక అసమానతలు సరికాదని చెప్పేవాడు. దళితులను ఇంట్లోకి ఎందుకు రానివ్వరని అమ్మతో తగదా పడేవాడు. వ్యవసాయ కార్మికులకు రావాల్సిన కూలి విషయంలోనూ మోసం ఉందని గొడవ పడేవాడు. దళితుల పేర్ల చివర 'వాడు' అని ఎవరైనా అంటే వాగ్వాదానికి దిగేవాడు. ఎప్పుడూ నిజాన్ని నిర్భయంగా చెప్పే వాడు. తండ్రి చనిపోయాక సుంద రయ్య, రామచంద్రారెడ్డిలను పెద్దక్క తమిళనాడులోని తిరువూరుకు తీసుకెళ్లింది. అక్కడే వారిని స్కూళ్లో చేర్పించింది. అక్కడ కొంతకాలం చదివిన సుందరయ్య తర్వాత రాజమండ్రి, ఏలూరు పట్టణాల్లో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. చరిత్రా పుస్తకాలపై ఆయనకు పాఠానాసక్తి ఎక్కువ. విడవకుండా చదివేవాడు. సామాజిక అసమానత, వేళ్లూనుకున్న కుల వివక్షపై చిన్నప్పటి నుంచే ప్రశ్నలు సంధించిన ఆయన 1924-26 మధ్య రాజమండ్రిలో ఉన్నప్పుడే కొంతమంది సంఘ సంస్కర్తల గురించి తెలుసుకోవడంతో కొత్త ప్రేరణ కలిగింది. అక్కడ చదువుతున్న క్రమంలో రోజూ గ్రంథాలయానికి వెళ్లేవాడు. తలుపులకు తాళం వేసేంత వరకూ చదువుతూ ఉండేవాడు. అక్కడే కం దుకూరి వీరేశలింగం, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, పానుగంటి లక్ష్మీ నరసింహం గురించి తెలుసుకుని వారు రాసిన పుస్తకాలు చదివాడు.
తొలి పోరాటం 'సైమన్ కమిషన్'...
రాజమండ్రిలో రెండేండ్లు ఉన్న తర్వాత తమ్ముడు రామ్‌తో కలిసి 1926లో మద్రాసు వచ్చి స్థిరపడ్డారు. అప్పటికీ సుందరయ్య వయస్సు 13 ఏండ్లు. అయినప్పటికీ వ్యక్తిగత జీవితంలోనూ, రాజకీయంగానూ తగినంత అనుభవం సంపాదించుకున్నాడు. అక్కడే ట్రిప్లికేన్ హిందూ హైస్కూల్లో 6, 7, 8 తరగతులు పూర్తి చేశాడు. 1928 ఫిబ్రవరిలో 'సైమన్ కమిషన'్ బహిష్కరణకు దేశవ్యాప్తితంగా కాంగ్రెస్ ఇచ్చిన పిలుపునందుకుని జాతీయోద్యమంలో తొలిసారిగా పాల్గొన్నాడు. అప్పుడు ఆయన పదో తరగతి చదువుతున్నాడు. దేశ స్వాతంత్య్రతకు దెబ్బతీసే కమిషన్లన్నంటినీ వ్యతిరేకిం చాలని, తరగతులను వెళ్లకుండా బహిష్కరించాలని విద్యార్థులను కోరాడు. ఆ రోజు కార్యక్రమం జయప్రదమైంది. తదనంతరం పంజాబ్‌లోని జలియన్ వాల్బాగ్లో జరిగిన నరమేధంతో బ్రిటీష్ సామ్రాజ్యవాదులపై ఆయనలో ద్వేషం పెరిగింది. ఇది ఆయన్ను స్వాతంత్రోద్యమంలో నేరుగా పాల్గొనేలా చేసింది. ఆ క్రమంలోనే గాంధీ జీవితం పరిచయమైంది. గాంధీ పిలుపునందుకున్న సుందరయ్య 1930లో ఉప్పు సత్యగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమాల్లో పాల్గొని అరెస్టయ్యాడు. అప్పటికీ ఆయన వయసు 17ఏండ్లు. మైనార్టీ తీరకపోవడంతో బోస్టన్ స్కూల్‌కు తరలించారు. జైల్లో కూడా కుల, ప్రాంతీయ, వివక్షపై పోరాటం చేశాడు. అక్కడే కమ్యూనిస్టులతో పరిచయం ఏర్పడింది.
సొంత గ్రామంలోనే తిరుగుబాటు...
జైలు నుంచి బయటకు వస్తూనే సొంత గ్రామం అలగాని పాడులో భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా 1930లో వ్యవసాయ కార్మిక సంఘం ఏర్పాటు చేసి కార్మికులతో కలిసి భూస్వాములపై తిరుగుబాటు చేశాడు. భూమి లేని పేదలకు భూమినివ్వాలని కూలీ రేట్లు పెంచాలని పట్టుబడ్డాడు. రేట్లు పెంచితే తర్వాత భూమిని పంచాలని వారు డిమాండ్ చేస్తారనే వాదన భూస్వాముల నుంచి వచ్చింది. కానీ ఆయన కూలి పెంపు పోరాటం చేసి ఆ తర్వాత భూ పంపిణీ కోసం కూడా ఉద్యమించాడు. సమానత్వం కోసం జరిగిన ఈ పోరాటంలో ఆయన దళితులతోనూ, వెనుకబడిన కులాలతో కలిసి నిలబడ్డాడు. అప్పుడే కులానికి చిహ్నమైన తన పేరులో నుంచి సుందరరామి'రెడ్డి'ని తొలగించుని సుందరయ్యగా మార్చుకున్నాడు. అన్ని కులాలతో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశాడు. గ్రామంలోని మంచినీటి బావి నుంచి దళితులకు నీరు చేదుకునే హక్కు కోసం పోరాడాడు. దళితుల కోసమే కిరాణా దుకాణం నిర్వహించేలా చూశాడు. కులాంతర వివాహాలు చేసి మహిళల సమానత్వం కోసం పాటుపడ్డాడు. సుందరయ్యకు మహిళలంటే ఎంతో గౌరవం. స్త్రీలు, పురుషులు సమానమేనని నమ్మకం. ఆ కాలంలో బాల్యవివాహాలు చేసే దురాచారం ఎక్కువ. ఈ సమస్య వాళ్లింట్లో కూడా వచ్చింది. 16ఏండ్లు మాత్రమే ఉన్న ఆయన అక్కయ్యకు 42 ఏండ్ల వీరస్వామి రెడ్డి అనే మెజిస్ట్రేట్‌కు ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించారు. దీన్ని సుందరయ్య తీవ్రంగా వ్యతిరేకించాడు. అయితే ఆ కుర్రాడి మాటలు పెద్దలు పట్టించుకోలేదు. ఆ తర్వాత పెండ్లి జరిగిపోయింది.
కమ్యూనిజం వైపు అడుగులు...
సుందరయ్య బెంగుళూరులో ఇంటర్ చదువుతున్నప్పుడే ఆయనలో కమ్యూనిజం బీజం పడింది. అప్పటికీ ఆయన వయసు 18 ఏండ్ల్లు. ఎంతో ధైర్యం, తెలివితేటలు, కార్యదీక్ష, ఉద్యమ స్ఫూర్తి గల సుందరయ్యలోని పోరాటపటిమ కమ్యూనిస్టు నాయకుడు హమీర్ హైదర్‌ఖాన్ దృష్టిని ఆకర్షించాయి. దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణం కోసం వచ్చిన ఆయన సుందరయ్యను కలిసి కమ్యూనిస్టు పార్టీలో చేరాలని ఆహ్వానించాడు. వారు కలిసింది ఒక్కసారే అయినప్పటికీ సుందరయ్యలో ఉద్యమ స్ఫూర్తి, విప్లవ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలను గుర్తించగలిగాడంటే అమీర్ హైదర్ఖాన్కున్న ముందుచూపు మనం గ్రహించవచ్చు. 1930లో కమ్యూనిస్టు పార్టీలో చేరిన సుందరయ్యను పూర్తి కాలం కార్యకర్తగా తీర్చిదిద్దింది కూడా అమీర్ హైదర్ఖాన్యే. అప్పటినుంచే పార్టీ నిర్మాణం, ఉద్యమాలపై దృష్టి పెట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో భూస్వాములకు వ్యతిరేకంగా పోరా డుతున్న ప్రజలను ఎక్కువ మందిని కమ్యూనిస్టు ఉద్యమం వైపు మళ్లించాడు. చాలా మందిని కార్యకర్తలుగా తయారు చేసి వారితో పోరాటాలు నిర్మించాడు. ఏపిలో మున్సిపల్, ప్రెస్ కార్మికులు, హమాలీలు, రవాణా రంగాల కార్మికులచే సంఘాలు ఏర్పాటు చేసి ట్రేడ్ యూనియన్‌కు గట్టి పునాది వేశాడు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను సైకిల్‌పై, కాలి నడకన వెళ్లి కార్య కర్తలను, ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకున్నాడు.
దక్షిణ భారత కమ్యూనిస్టు నిర్మాత...
1930వ దశకంలో దినకర్ మెహతా, సత్య సహీర్, ఇఎంఎస్ నంబూద్రిపాద్, సోలీ బాట్లీవాలా వంటి ప్రముఖ కమ్యూనిస్టు నేతలు కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ జాతీయ కార్యనిర్వాహక సభ్యులుగా ఉండేవారు. సుందరయ్య కూడా వీరితో చేరి క్రమంగా కాంగ్రెస్ సోషలిస్టు పార్టీకి కార్యదర్శి కూడా అయ్యారు. 1933లో అమీర్ హైదర్‌ఖాన్ అరెస్టు తర్వాత దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు నిర్మాణ బాధ్యతలు భుజాన వేసుకున్నాడు. లెనిన్ చెప్పిన పార్టీ నిర్మాణ సూత్రాలను అనతి కాలంలోనే ఆకలింపు చేసుకున్న ఆయన మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉన్న కోస్తా ఆంధ్ర జిల్లాలు, నిజాం ఆధీనంలో ఉన్న తెలంగాణ జిల్లాల్లో మారుమూల ప్రాంతాల వరకు సుంద రయ్య తిరిగాడు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని నిర్మించే బృహత్తర కర్తవ్యం నెరవేరుస్తూనే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సుందరయ్య పర్యటించాడు. ముంబారు, 20 ఏండ్ల వయసులోనే కేరళ రాష్ట్రంలో పర్యటించాడు. కేరళలో కాంగ్రెస్ సోషలిస్టు నాయకులైన కృష్ణపిళ్తై, నంబూద్రిపాద్ వంటి నాయకులతో చర్చలు జరిపారు. 1934లో అంటే సుందరయ్య 22ఏండ్ల వయసులోనే పార్టీ కేంద్రకమిటీ సభ్యుడై, జాతీయ నాయకత్వంలో భాగస్వాము డయ్యాడు. అమీర్ హైదర్‌ఖాన్ ముందుచూపు పార్టీకి ఎంతో మేలు చేసింది. 1937లో కమ్యూనిస్టు పార్టీ శాఖ ఏర్పటైంది. కృష్ణఫిళ్లైతో పాటు ఇఎంఎస్, కె దామోదరన్,ఎన్‌సి శేఖర్ పార్టీని బాగా నడిపారు. మద్రాస్ రాష్ట్రంలోని తమిళనాడులోనూ సుందరయ్య తొలితరం కమ్యూ నిస్టు నేతలను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు. పి.రామమూర్తి, జీవానందన్, బి.శ్రీనివాసరావు, ఎఎస్‌కే అయ్యంగార్, ఎస్వి ఘాటే వంటి తొలితరం నాయకులతో కలిసి పనిచేశాడు. ఇలా దక్షిణ భారత దేశంలో చాలా ప్రాంతాల్లో సుందరయ్య పార్టీని నిర్మించి ఉద్యమాన్ని ఏకతాటిపై తీసుకొచ్చాడు. 1957లో కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం నెలకొల్పింది. ఇఎంఎస్ నంబూద్రిపాద్ తొలి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది దేశ చరిత్రలోనే అప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. ప్రస్తుతం లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) కమ్యూ నిస్టు ప్రభుత్వం ఏలుబడిలో ఉంది. అప్పటి సుందరయ్య దూర దృష్టిని కేరళ ప్రజానీకం, పార్టీ నేతలు నేటికీ మననం చేసుకుంటూనే ఉంటారు. సుందరయ్య నిర్మించిన పార్టీతో పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లోనూ సీపీఐ(ఎం) చాలా ఏండ్లు పాలించింది.
కార్యకర్త నుంచి కార్యదర్శి వరకు...
కమ్యూనిస్టు పార్టీలో మితవాదుల చీలికల తర్వాత తను నమ్మిన సిద్ధాంతంతో 1964లో ఆవిర్భవించిన సీపీఐ(ఎం) లోనే తుదిశ్వాస వరకు కొనసాగాడు. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, త్రిపుర, పశ్చిమబెంగాల్లోనూ పార్టీ నిర్మాణానికి కృషిచేశాడు. ఏపీలో మోటూరు హనుమంతరావు, మాకినేని బసవ పున్నయ్య, కేరళలో ఇఎంఎస్ నంబూద్రిపాద్, క్రిష్ణ పిళ్ల్తె, ఏకె గోపాలన్, పంజాబ్‌లో హరికిషన్ సింగ్ సుర్జీత్, పశ్చిమబెంగాల్లో జ్యోతిబసు, ప్రమోద్‌దాస్ గుప్తా లాంటి ప్రముఖులతో కలిసి మార్కిస్టు పార్టీని దేశంలో బలమైన శక్తిగా నిర్మించాడు. ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్ర కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా, సీపీఐ (ఎం) ఆవిర్భావం నుంచి 1976 వరకు కేంద్ర కమిటీకి కార్యదర్శిగానూ 12ఏండ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. జైలు జీవితం గడిపాడు. అజ్ఞాతంలో ఉండి పార్టీకి సహాయ సహకారాలు అందించాడు. కుల రహిత సమాజం, భూస్వామ్య దోపిడీ పీడనలు, పాలక వర్గాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన చేసిన అలుపెరగని పోరాటం, చూపిన తెగవు తెలుగు రాష్ట్రాలే కాదు దేశప్రజల్లోనే ఒక కమ్యూనిస్టు అగ్రనాయకునిగా నిలబెట్టాయి. ఆయన్ను నేటికీ కమ్యూనిస్టు గాంధీగానే పిలుస్తారు.అలగానిపాడు గ్రామంలో సామాన్య కార్యకర్తగా మొదలైన ఆయన ప్రస్థానం విప్లవ భావవ్యాప్తి క్రమంలో చైనా, రష్యా, క్యూబా లాంటి కమ్యూనిస్టు దేశాల్లోనూ పర్యటించేలా చేశాయి.
ఆదర్శం..ఆయన జీవితం...
సుందరయ్య అంటేనే నిబద్ధత, కచ్చితమైన క్రమశిక్షణ గల కమ్యూనిస్టు. సిద్ధాంత విలువలు పాటించిన మచ్చలేని నాయకుడు. వ్యక్తి కంటే సమాజ నిర్మాణమే ముఖ్యమని చాటిన మహౌన్నతుడు. వారసత్వం కన్న ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగిన ఆదర్శనీయుడు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ కడవరకూ పేదల కోసం పాటు పడిన చిరస్మరణీయుడు. శాసనసభ్యుడైనా చట్ట సభలకు సైకిల్‌పై వెళ్లిన నిరాడంబరుడు. భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకు, భవిష్యత్తు తరాలకు అవసరమైన సోషలిజాన్ని నిర్మించడం కోసం మార్కిస్టు మహా ప్రస్థానాన్ని కర్తవ్య దీక్షతో కొనసాగించిన మహారుషి. ఇంతటి అ సాధారణ నేత 1985 మే19న మద్రాస్‌లోని నర్సింగ్హౌంలో అనారోగ్యంతో కన్ను మూశాడు. 'మన పుట్టుక సాధారణమే అయినా..మరణం చరిత్ర కావాలి' అన్న దానికి సుం దరయ్య జీవితం నిలువెత్తు నిదర్శనం. ఆయన పుట్టి శతవసంతలైనా ఆకాశంలోని ఎర్రటి మబ్బుతెరల చాటు నుంచి భువికి దిగిన నక్షత్రంగానే మనం చెప్పుకోవాలి. దివికేగి మూడు దశాబ్దాలు దాటుతున్నా ఆయన సాగుచేసిన విప్లవవనంలో రోజూ వికసిస్తున్న ఎర్ర మందారమేనని గర్వపడాలి..
వీర తెలంగాణ..విప్లవ సాయుధ పోరాటం...
వ్యవసాయక విప్లవం అనుభవాలను చూసిన సుందరయ్య ప్రత్యక్షంగా పాల్గొని నాయకత్వం వహించిన మరో పోరాటం వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటం. బ్రిటిష్ కాలంలో దేశ వ్యాప్తంగా కమ్యూనిస్టులపై నిషేధం ఎత్తివేసినప్పటికీ తెలంగాణలో కమ్యూనిస్టులు రహస్యంగానే ఉండాల్సి వచ్చింది. కారణం నైజాం సర్కార్‌పై తిరుగుబాటు. రజాకార్ల అమానుషం, భూస్వాముల ఆకృత్యాలు, దేశ్‌ముఖ్‌ల వేధింపులతో విసిగిపోయిన పల్లె ప్రజలు కమ్యూనిస్టులతో కలిసి సాయుధ పోరాటం చేశారు. వారిని కదిలించి ఉద్యమంలోకి తీసుకురావడంలో సుందరయ్యది కీలకపాత్ర. చాలామంది వేర్పాటువాదులు కమ్యూనిస్టుల్లో విభేదాలు తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ పార్టీకి నష్టం జరగకుండా కార్యకర్తలను కాపాడుకున్నాడు. ఓ వైపు నెహ్రూ పంపిన సైన్యాలు, మరోవైపు జగీర్దార్లు, భూస్వాములు, రజాకార్ల ఆగడాలు ఎదుర్కొనేందుకు పార్టీ ఎత్తుగడలు, వ్యూహాలతో ముందుకు సాగింది. ఇది కూడా సుందరయ్య 40వ దశకం నుంచి పోరాడి కమ్యూనిస్టు నాయకుల ఐక్యతతో విశాల వేదికగా ఆంధ్ర మహాసభ జరపడంతో పార్టీకి తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. గ్రామాల్లో చాలామందిని గెరిల్లా సైన్యంగా తయారు చేసి రజకార్లను ఎదుర్కొనేందుకు శిక్షణనిచ్చారు. ఆ కాలంలోనే మల్లు స్వరాజ్యం లాంటి మహిళలు కూడా తుపాకి పట్టి దొరలపై పోరాటం చేశారు. నల్లగొండ జిల్లా కడివెండిలో విసునూరు రాంచంద్రారెడ్డికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో దొడ్డి కొమురయ్య తొలి అమరుడయ్యాడు. ఈ క్రమంలో ఊపందుకున్న ఉద్యమం 10వేల మంది గ్రామ మిలిటరీ సభ్యులు, 2వేల మంది సాధారణ గెరిల్లాలు నైజాం సర్కార్‌పై తిరుగుబాటు చేశారు. 1946 నుంచి 1951వరకు సాగిన ఈ మహాత్తర పోరాటంలో 4వేల మంది కమ్యూనిస్టులు వీరమరణం పొందారు. 10వేల మంది కార్యకర్తలు జైలు పాలయ్యారు. 50వేల మంది పోలీసు క్యాంపుల్లో నిర్భందించబడ్డారు. కానీ వారి త్యాగం వృథా కాలేదు. అప్పటిదాకా ఫ్యూడల్ నిజాం హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ యూనియన్‌లో విలీనం చేయడానికి మొండికేసినా చివరికి కమ్యూనిస్టులు బలోపేతం కావడం, భారత మిలిటరీ జోక్యం పెరగడంతో తలొగ్గక తప్పలేదు. హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసిన తర్వాత తెలంగాణలో కమ్యూనిస్టులు పేదలకు 10లక్షల ఎకరాలు భూ పంపిణీ చేశారు.
ముఖ్యమంత్రి అవుతారనుకుని...
తెలంగాణలో సాయుధ పోరాటం విజయంతో ప్రజలకు కమ్యూనిస్టులపై నమ్మకం పెరిగింది. దీనికితోడు స్థానిక ప్రజా ఉద్యమాలు పార్టీకి వెన్నుదన్నుగా నిలిచాయి. ఈ క్రమంలోనే 1952లో ఎన్నికలొచ్చాయి. ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) పేరు మీద కమ్యూనిస్టులు వంద సీట్లలో పోటీచేసి 45సీట్లు గెలుచుకున్నారు. ఆంధ్రా నుంచి 17పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుని ప్రధాన ప్రతిపక్షంగా నిలిచారు.ఈ ఎన్నికలు హైదరాబాద్, మద్రాసు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీకి మంచి ఫలితాలు తెచ్చాయి. ఆ కాలంలోనే సుందరయ్య మద్రాస్ నియోజకవర్గం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యాడు. ప్రతిపక్షనేతగా మూడేండ్లపాటు సమర్థవంతమైన నేతగా బాధ్యతలు నిర్వహించాడు. ఉత్తమ పార్లమెంటెరీయన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత పరిణామాలతో రాజీనామా చేశాడు. 1955లో మధ్యంతరంగా వచ్చిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు గన్నవరం ఎమ్మెల్యేగా ఎన్నికై 1964 వరకు ప్రతి పక్షనేతగా వ్యవహరించాడు. కమ్యూనిస్టుల సీట్లు పెరిగినందున సుందరయ్య ముఖ్య మంత్రి అవుతారని అందరూ అనుకున్నారు. కానీ అన్ని పార్టీలు కాంగ్రెస్ గూటిన చేరి ఎన్నడూ లేనంత విషాన్ని కమ్యూనిస్టులపై కక్కాయి. ఆంధ్రా ప్రాంతంలో పెద్దఎత్తున దాడులకు దిగినా వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయారు. సుందరయ్య 1978 నుంచి 1983 వరకు కూడా శాసనసభ్యునిగా సేవలందించారు.
శాసన సభ్యుడైనా.. సైకిల్‌పైనే..
పార్లమెంట్, అసెంబ్లీలో 20ఏండ్ల పాటు సభ్యుడిగా పనిచేసిన సుందరయ్య సాధారణ జీవితాన్నే ఇష్టపడేవాడు. ఎమ్మెల్యేగా కొనసాగిన సమయంలో సైకిల్ క్యారేజికి పైళ్లను కట్టుకుని వచ్చేవారు. సైకిల్‌ను స్టాండ్‌లో పెట్టుకుని అక్కడినుంచి ఫైళ్లను తీసుకుని నడుచు కుంటూ ఆయన సమావేశ మందిరానికి వచ్చేవాడు. ప్రతిరోజూ సరైన సమయానికి చేరుకు నేవారు. పార్లమెంట్‌కు రావడానికి ముందే దినపత్రికలు చదివేవాడు. ఆ రోజు పార్లమెంట్ వ్యవహారాలకు సంబంధించిన అన్ని పేపర్లను క్షుణ్ణంగా పరిశీలించి సిద్ధం చేసుకుని వచ్చే వాడు.ఆయన పార్లమెంట్లో ప్రసంగాలను చాలా శ్రద్ధగా వినేవాడు. ఆయన ఆహార్యం, ఆత్మవిశ్వాసం, ఆయన నడవడికను చూసిన వారు మిగతా వారికంటే భిన్నంగా గుర్తించే వారు. శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఇదే జీవన విధానాన్ని అనుసరించాడు. తన బట్టలు తానే ఉతుక్కోవడం, సొంత పనులు కాలినడకన లేదా సైకిల్‌పై వెళ్లి చక్కబెట్టుకునే వాడు. శాసనసభకే కాకుండా ముఖ్యమంత్రి ఇంటికి కూడా సైకిల్‌పైనే వెళ్లేవాడు. పార్లమె ంటరీ కార్యక్రమాల్లో భారత విప్లవోద్యమ పాత్ర, పరిమితుల గురించి ఆయనకు స్పష్టమైన అవగాహన ఉండేది. బాధ్యతయుతమైన విమర్శ ఎలా ఉండాలో, ప్రత్యామ్నాయ సూచనలు ఎలా చేయాలో, పార్లమెంట్ బయట జరుగు తున్న ప్రజా పోరాటాలను ఎలా ప్రతిధ్వనింప చేయాలో సుందరయ్య ఆచరణలో చూపాడు. కమ్యూనిస్టు పార్లమెంట్ సభ్యుడు ఎలా ఉండాలన్న దానికి, ప్రజాప్రతినిధి అయినా సాధారణంగా ఎలా గడపచ్చో సుందయ్య జీవితం ఓ చక్కని ఉదాహరణ. సామాజిక సమస్యల పట్ల అవగాహన, పాఠనాసక్తితో దేశ పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన నేతగా పేరు తెచ్చుకున్నాడు. సుందరయ్య రాసిన మూడు పుస్తకాలు ప్రజల్లో విశేష ఆధరణ పొందాయి. 'విశాలాంధ్రలో ప్రజారాజ్యం', 'ఆంధ్ర ప్రదేశ్ సమగ్ర నీటి పథకం', 'వీర తెలంగాణ విప్లవ పోరాటం, గుణపాఠాలు' చాలామందిని మార్గదర్శకం చేశాయి. ప్రజల్ని పోరాటాల వైపు నడిపించాయి. అక్షరాలకున్న శక్తిని ఆనాడే అర్థం చేసుకున్న సుందరయ్య 'ప్రజాశక్తి' పత్రికస్థాపనకు విశేష కృషి చేశాడు.
పిల్లలు వద్దనుకుని...
భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చిన సుందరయ్య తన యావదాస్తిని పార్టీ, ఉద్యమాలు, కార్యకర్తల కోసమే ఖర్చుచేశాడు. పిల్లల్ని కూడా వద్దనుకుని జీవితాన్ని ప్రజా సేవకే అంకితమిచ్చాడు.తను పార్టీ పనిమీద 1942లో బొంబారు వెళ్లినప్పుడు అక్కడ పరిచయమైన సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగిని లీలాతో ఆయన జీవితాన్ని పంచుకోవాలను కున్నాడు. 1943 ఫిబ్రవరి 27న పార్టీ ప్రధాన కార్యదర్శి పీసీ జోషీ, మరికొద్ది మంది పార్టీ నేతల సమక్షంలో వీరు ఆదర్శ వివాహం చేసుకున్నారు.ఆమె కూడా పార్టీకి పూర్తికాలం కార్య కర్తగా పనిచేశారు.బిడ్డల్ని కంటే ప్రజాసేవకు ఎక్కడ అడ్డమవుతుందోనని సహచరితో చర్చించి సుందరయ్య వెస్టెకమీ ఆపరేషన్ చేసుకున్నాడు.కానీ కార్యకర్తలందరూ తనలాగే ఉండాలని ఆయన కోరుకోలేదు.పరిమితమైన సంతానంతో సుఖంగా ఉండాలని తోటి కార్య కర్తలకు ఈ దంపతులు చెబుతుండేవారు.
సుందరయ్య జీవితం.. ముఖ్య విశేషాలు...
- సుందరయ్య 1913 మే1న నెల్లూరు జిల్లా అలగానిపాడులో జన్మించాడు.
- 1928లో తొలి స్వాతంత్య్ర పోరాటం సైమన్ కమిషన్‌లో పాల్గొన్నాడు.
- 1930లో గాంధీ పిలుపునందుకుని స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నాడు.
- 1930లో అమీర్ హైదర్‌ఖాన్ స్ఫూర్తితో కమ్యూనిస్టు పార్టీలో చేరాడు.
- 1934లో కేంద్ర కమిటీకి,1942లో పొలిట్‌బ్యూరోకి ఎన్నికయ్యారు.
- 1936లో అఖిల భారత కిసాన్ సభ (ఎఐకేఎస్) ఏర్పాటులో కీలకంగా వ్యవహరించాడు.
- 1939-42 నాలుగేండ్లు అజ్ఞాతజీవితం గడిపాడు. అప్పుడే మార్క్సిస్టు సాహిత్యాన్ని అధ్యయనం చేశారు.
- 1943లో లీలాను ఆదర్శ వివాహం చేసుకున్నాడు.
- 1944లో రాసిన 'విశాలాంధ్రలో ప్రజారాజ్యం' పుస్తకం సమైక్య రాష్ట్రంలో విశేష ఆధరణ పొందింది.
- 1946-51 తెలంగాణలో సాయుధ పోరాటానికి నాయకత్వం వహించాడు.
- 1952-55 మద్రాస్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు.
- 1953లో సోదరుడు రామచంద్రారెడ్డి స్థాపించిన ప్రజావైద్యశాలకు సహాయం చేశాడు.
- 1955-64 ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించాడు.
- 1964లో సీపీఐ(ఎం) ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించారు.
- 1978-83 గన్నవరం శాసనసభ్యుడిగా సేవలందించాడు.
- 1985 మే 19న మద్రాసులోని ఆస్పత్రిలో అనారోగ్యంతో మరణించాడు.
- నమిలికొండ అజరుకుమార్,
9490099140
- [email protected]
Sun 01 May 00:16:43.060865 2022