Sat 02 Jul 23:46:45.981033 2022
Authorization
కృష్ణానదికి ఉపనది అయిన అహల్యా నదీ తీరంలో వెలసిన ప్రాచీనాంధ్ర నగరం పెరూరు. నేడు పల్లెటూరుగా కనిపిస్తున్న ఈ గ్రామం చరిత్రలో పేరెన్నికగన్నది. పెరూరు కేంద్రంగా ఆ రోజుల్లో దేశవిదేశాల వర్తకులు వర్తక వాణిజ్యాలు చేసేవారని చరిత్ర తెలుపుతున్నది. వివిధ దేశాల నుండి, రాష్ట్రాల నుండి ఎందరో వ్యాపారులు పడవల మీద పయనించి అహల్య నదీ తీరానికి చేరుకుని వ్యాపారం నిర్వహించే వారట. కొందరు ఇక్కడే స్థిర నివాసం కూడా ఏర్పరుచుకున్నారట. నల్లగొండ జిల్లా అనుముల మండలం పేరూరు గ్రామాన్ని నా క్షేత్ర పర్యటనలో భాగంగా సాహితీమిత్రులు సాగర్ల సత్తయ్య, ఈ.లింగయ్యలతో కలిసి సందర్శించినప్పుడు ఇక్కడి శిల్ప కళా వైభవం చాలా ఆశ్చర్యపరిచింది. అద్భుతమైన వీరగల్లులు విరివిగా దర్శనమిచ్చాయి. అయితే చాలా మటుకు ధ్వంసమైనాయి.
పానగల్లు రాజధానిగా పరిపాలించిన కందూరు చోడ మహారాజులు పరిపాలించిన ప్రాంతమిది. కందూరు చోడ మహా రాజులు కందూరు భీమన్న, చాళుక్య భూలోకమల్లుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించినట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తున్నది. ప్రఖ్యాత చరిత్రకారుడు బి.ఎన్.శాస్త్రి గారు నల్లగొండ మండల సర్వస్వం, కందూరు చోడుల శాసనములు చరిత్ర సంస్కతి అనే గ్రంథాలలో పెరూరు చారిత్రక విశేషాలను వివరించారు. పెరూరు గ్రామంలో ఉన్న స్వయంభూ సోమేశ్వర ఆలయంలో మొత్తం తొమ్మిది శిలాశాసనాలు ఉన్నట్లు ఈ గ్రంథాల ద్వారా తెలుస్తున్నది. ఒకే శాసన శిలపై నాలుగు దిక్కులా నాలుగు శాసనాలు చెక్కించి ఉండడం అవి కూడా భిన్న కాలాలవి కావడం ఇక్కడి ప్రత్యేకత. ఆ శాసనాలు చాళుక్య విక్రమ సంవత్సరం 44 నాటివి, శక సంవత్సరం 1120, 1212 నాటివి ఉన్నవి. కన్నడాంధ్ర, తెలుగు భాషలకు సంబంధించిన శాసనములు కనిపిస్తాయి.
ప్రస్తుతం ఈ ఆలయానికి ఉత్తర దిశలో ఉన్న శిలా స్థంభ శాసనం ఎక్కువ భాగం భూమిలోపలికి కూరుకుపోయింది. దక్షిణ దిశలో ఉన్న శాసనం అడ్డంగా విరిగి రెండు ముక్కలుగా పక్కకు పడి ఉన్నది. ఇక్కడ ఎదురుగా కోనేరు ఉన్నది. వీరగల్లుల విగ్రహాలు చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నవి. ప్రాచీనకాలం నాటి శాసన రూపమైన పెరూరు గ్రామ నామాన్ని ఇప్పటికీ వ్యవహరిస్తుండడం విశేషం. అహల్యా నదీతీరంలో గొప్ప నాగరికత విలసిల్లినట్లు ఇక్కడి చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే అవగతమవుతుంది. మరింత లోతుగా పరిశోధన చేస్తే ఇక్కడి చరిత్రను సవివరంగా ముందుతరాలకు అందించగలుగుతాం.
- డాక్టర్ మండల స్వామి
9177607603