Sat 11 Mar 23:40:47.784699 2023
Authorization
'ఒక మహిళ అర్ధరాత్రి స్వేచ్ఛగా ఇంటికి చేరుకున్నప్పుడే మన దేశానికి నిజమైన స్వాత్యంత్య్రం' అన్నారు గాంధీ. కానీ దేశం నేడు డెబ్తై ఐదేండ్ల అమృత ఉత్సవాలు జరుపుకుంటున్నది. ఏ ఒక్క విషయంలోనూ మహిళలకు న్యాయం జరిగిందా? తెల్లారితేచాలు అఘాయిత్యాలు, వరకట్నపు చావులు, భ్రూణ హత్యలు వార్తల్లో పదిలం. ఉద్యమాలకు తలొగ్గి కంటితుడుపు చర్యలకు ఢిల్లీలో నిర్భయ, హైదరాబాద్‌లో దిశ లాంటి చట్టాలెన్ని తెచ్చినా ఏమున్నది గర్వకారణం. దేశంలో రోజుకు వందల లైంగికదాడులు, హత్యలు పెచ్చరిల్లుతున్నా వారి రక్షణ మృగ్యమే కదా! పైగా రాజకీయాల్లో రాణిస్తున్న స్త్రీలపై అణచివేసే ధోరణి, అరాచక పర్వం నిత్యకృత్యమవుతున్నా తరుణం. దేనికోసం అమృత సంబరాలు?ఏం సాధించారని? ఈ అంతరాల జీవనంలో మహిళ పయనం నడి సముద్రంలో నావలా తయారైంది.
ఇంకా ఈ నేలపై పీడన కొనసాగుతూనే ఉన్నది. అసమానత రాజ్యమేలుతూనే ఉన్నది. శోకం ధారలా ప్రవహిస్తూనే ఉన్నది. అయినా ఆ తల్లి పురిటినొప్పుల బాధ భరిస్తూనే ఉన్నది. బిడ్డ ఏడుపును చిరునవ్వులదాకా తీసుకెళ్లడానికి పరితపిస్తూనే ఉన్నది. స్వేచ్ఛా, సమానత్వం కోసం పోరాటం చేస్తూనే ఉన్నది. ఆమె కలలుగన్న నూతన ప్రపంచం ఎప్పుడు సిద్ధిస్తుంది? ఒక మహిళ పురుషులకు ధీటుగా పనిచేస్తే తట్టుకోలేరు.ఆమె రాజకీయంగా ఎదిగితే సహించరు. ఏదైనా రంగంలో పోటీపడినా అవహేళన చేస్తారు. ఈ పురుషాధిక్య సమాజంలో ఆమెకు న్యాయం జరిగేదెప్పుడు? బానిసత్వపు అడ్డుగోడలు కూల్చేదెప్పుడు? నేడు మహిళా లోకాన్ని వేధిస్తున్న ప్రశ్నలివి. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. అన్ని రంగాల్లో విశేష ప్రతిభను కనబర్చినందుకుగాను వేదికల మీద అభినందించారు. కానీ వారికి కావాల్సింది సన్మానం కాదు రక్షణ. సత్కారం కాదు చేయూత. మహిళలపై ఆధిపత్యపు అహంకార ధోరణి బలత్కారం చేస్తుంటే ఒక్కరైనా పట్టించుకోరేం! దీనిపై ఎవరూ స్పందించరేం! ఈ అన్యాయం, అవమానం నుంచి మహిళ బయటపడేదెలా?
శ్రీశ్రీ చెప్పినట్లు.. 'ఇదన్యాయం అంటే.. అనుభవించు నీ ఖర్మ' అనే స్థితి ప్రస్తుత సమాజానికి స్త్రీ అద్దం పడుతోంది. ఓవైపు మహిళ తన మేథస్సుతో అంతరిక్షంలోకి అడుగు పెట్టినా గ్రామస్థాయిలో ఇంకా వివక్ష, అణచివేతకు గురవుతూనే ఉన్నది. దేశంలో జరుగు తున్న అఘాయిత్యాల్లో మొదటిస్థానంలో నిలుస్తోంది. వారి పరిస్థితి రోజురోజుకూ దిగజారి పోతుండటం ఆందోళనకరం. దీనికి తాజా ఉదహరణ ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన వేధింపుల ఘటన. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలానికి చెందిన మహిళా సర్పంచ్ దళితురాలు. రిజర్వేషన్ ద్వారా సర్పంచ్‌గా ఎన్నికైంది. 'ఎమ్మెల్యేకు నీపై ఇంట్రెస్ట్ ఉంది. షాపింగ్ పేరుతో బయటకు రా! నీ భర్తను తీసుకురావద్దు' అని కొంతమంది నిత్యం ఫోన్లు చేసి వేధించడం చూస్తుంటే ఎంతటి బరితెగింపు? అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయచ్చా? ఆమె లొంగడం లేదని గ్రామాభివృద్ధికి నిధులు విడుదల ఆపడం, ప్రథమ పౌరురాలైనా ఫ్రొటోకాల్ పాటించకుండా కార్యక్రమాలు నిర్వహించడం సహేతుకమేనా? ఆమె సిగ్గువిడిచి మరి తనకు జరిగిన వేధింపులపై రోడ్డెక్కితే మద్దతుగా గళం విప్పేవారేరి? రాజకీయాల్లో మహిళలకు స్థానం లేదా? సమాజానికి ఏదో చేయాలనే తపనతో వచ్చినవారిని గౌరవించే పద్ధతి ఇదేనా?
మహిళల్ని చులకనగా చూడటం,బెదిరించడం, లొంగదీసుకోవడం ఇదో తంతులాగే కొనసాగుతుండటం శోచనీయం. ఒక్క మహిళా సర్పంచ్‌యే కాదు. వార్డు సభ్యురాలి నుంచి కార్పొరేటర్ వరకు, జడ్పీటీసీ నుంచి చైర్పర్సన్ వరకు అవమానపు, అవహేళనల కోరల్లో చిక్కుకుని నలుగుతున్నారు. కొంతమంది రాజీ నామా కూడా చేశారు. అమ్మగా, అలిగా, సోదరిగా కుటుంబం కోసం తాను ఒక కొవ్వొత్తిలా కరుగుతూ మరీ సమాజానికి వెలుగుని స్తుంటే ఎందుకీ అణచివేత? వారిని బయట తిరిగే స్వేచ్ఛలేదు. ఇష్టమైన దుస్తులు ధరించే హక్కులేదు. సమానత్వం అసలు కానరాదు. పైగా 'పక్కలోకి రమ్మని' వేధించడం చూస్తుంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఉంటుందా? తనకు నచ్చినట్టు ఉండకుంటే అడ్డంకులు సృష్టించడం, వెంటబడటం, దాడులకు ఉసిగొల్పడం తరతరాలుగా జరుగుతున్నదిదే అన్యాయం. ఇది ఒక్క రాజకీయాల్లోనే కాదు అన్ని రంగాల్లో మితిమీరుతోంది. తెలంగాణకు చెందిన మహిళా మాజీ ఎంపీ ఒక కేసులో ఢిల్లీలోని సీబీఐ ఎదుట హాజరైతే కాషాయపు పెద్ద మనిషి నీతిమాలిన వ్యాఖ్యలు చేశాడు. 'ఆమెను అరెస్టు చేయకుంటే ముద్దు పెట్టుకుంటారా?' ఇదేనా సంస్కారం? బాధ్యత గల పదవుల్లో ఉన్నవారు మహిళలపట్ల చేసే వ్యాఖ్యలు రేపటి సమాజానికి ఏం నేర్పుతున్నాయి.
'ఒక మహిళ అర్ధరాత్రి స్వేచ్ఛగా ఇంటికి చేరుకున్నప్పుడే మన దేశానికి నిజమైన స్వాత్యంత్య్రం' అన్నారు గాంధీ. కానీ దేశం నేడు డెబ్తై ఐదేండ్ల అమృత ఉత్సవాలు జరుపుకుంటున్నది. ఏ ఒక్క విషయంలోనూ మహిళలకు న్యాయం జరిగిందా? తెల్లారితేచాలు అఘాయిత్యాలు, వరకట్నపు చావులు, భ్రూణ హత్యలు వార్తల్లో పదిలం. ఉద్యమాలకు తలొగ్గి కంటితుడుపు చర్యలకు ఢిల్లీలో నిర్భయ, హైదరాబాద్‌లో దిశ లాంటి చట్టాలెన్ని తెచ్చినా ఏమున్నది గర్వకారణం. దేశంలో రోజుకు వందల లైంగికదాడులు, హత్యలు పెచ్చరిల్లుతున్నా వారి రక్షణ మృగ్యమే కదా! పైగా రాజకీయాల్లో రాణిస్తున్న స్త్రీలపై అణచివేసే ధోరణి, అరాచక పర్వం నిత్యకృత్యమవుతున్నా తరుణం. దేనికోసం అమృత సంబరాలు?ఏం సాధించారని? ఈ అంతరాల జీవనంలో మహిళ పయనం నడి సముద్రంలో నావలా తయారైంది. వారు అన్నింట్లో సమిధలే తప్ప ప్రమిధలయ్యేదెప్పుడు? నేతలు చెప్పే నీతుల్లా 'ఆకాశంలో సగం' అయ్యేదెన్నడూ..?