Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాళాపురం గ్రామంలో రామయ్య ప్రతి చిన్న పనికి అందరితో గొడవపడే వాడు. అందుకని అతనికి ఎవరూ సహకరించే వారు కాదు. ఊర్లో అందరి చేన్లు జొన్న పంటతో కళకళ లాడుతున్నాయి. వాటికి బిన్నంగా ఇంకా ఎక్కువగా రామయ్య చేను బాగా పండింది. ''ఈసారి అందరికంటే మన ఊరిలో నీ చేనులోనే జొన్నలు ఎక్కువగా వస్తాయి'' అన్నాడు చంద్రయ్య.
దానికి రామయ్య చిర్రెత్తి పోయి '' ఏం నీ చేను ఏం పాపం చేసింది?'' అన్నాడు కఠినంగా.
దానికి చంద్రయ్య నవ్వుతూ ''ఊర్లో అందరూ నీ చేను గురించే చెబుతున్నారు. అందరి కంటే నీ పంటే చాలా బాగుంది అని అనుకుంటున్నారు'' అన్నాడు.
ఆ మాటకు కోపంతో ఊగిపోయాడు. ఎవరెవరు ఆ మాటలు అన్నారో తెలుసుకుని వాళ్ళ ఇంటి మీదికి వెళ్ళి ''మీ అందరికి నా చేనుపైనే కన్ను పడింది అని రగడ, రగడ చేశాడు.
అప్పుడు ఊరు పెద్ద విరుపాక్షయ్య చూసి ''చూడు రామయ్య అందరూ నీ చేనే బాగా పండింది అంటే నువ్వు సంతోషించాలి గాని అలా అందరితో రగడ పడతావెందుకు రేపు నీ చేనులో కంకులు కోయడానికి వారి సహాయం అవసరం కదా! అప్పుడు ఎవరు వస్తారో చెప్పు'' అన్నాడు.
దానికి రామయ్య ''ఎవరూ రాకపోతే నేనొక్కడినే కోసుకుంటాను. ఎన్ని రోజులైనా కాని'' అన్నాడు గర్వం, అహంకారం నిండిన గొంతుతో.
ఊర్లో అందరూ జొన్నలు కోసుకుని ఇళ్ళకు తరలించు కున్నారు. ఇక రామయ్య చేను ఒక్కటే మిగిలింది. ఒక్కడే కోసుకుంటున్నాడు. ఒక్కడితో పని సాగటం లేదు. ఒక్కడే ఇబ్బంది పడుతున్నాడు.
అతని కష్టం చూసి ''ఇప్పటికైనా అందరితో మంచిగా ఉండు, నీ తోటి రైతుల సహాయం అభ్యర్థించు రెండు, మూడు రోజుల్లో కోయడం అయిపోక పొతే వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి నీ ఇష్టం'' అన్నాడు విరుపాక్షయ్య.
ఆ మాటకు ''నా పంట నేను కోసిన తరువాతనే వర్షం వస్తుంది. ఏమి కాదులే'' అన్నాడు. ఆ రోజు పంట కొస్తుండగానే చిన్న, చిన్న తుంపర్లు పడ్డాయి. అది కొద్దిగా ఎక్కువై మళ్ళీ తగ్గింది. రామయ్య ఆకాశం వైపు చూశాడు మబ్బు పట్టి ఉంది. వర్షం ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. త్వరగా పూర్తి చేయక పోతే వర్షానికి అంతా నాశనం అవుతుంది అనుకున్నాడు మనసులో. ఏమి చేయాలి అని ఆలో చిస్తుండగా పక్క పొలంలోని చంద్రయ్య తండ్రి నాగయ్య వచ్చి ఇప్పటికైనా నీ తోటి రైతుల సహాయం అభ్యర్థించు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. బిరుసుగా మాట్లాడటం, అందరితో రగడ పడటం మాను వెళ్ళు వారి సహాయం కోరు. వర్షం వస్తే సర్వం నాశనం అవుతుంది'' అని చెప్పాడు. ఆ మాటలోని నిజం గమనించి వెంటనే రామయ్య ఊర్లోకి వెళ్ళి రైతులందరితో మదువుగా మాట్లాడి సహాయం చేయండి. నా తప్పు మన్నించండి. మీరంతా సహకరిస్తే ఈ రోజే కోత పూర్తి అవుతుంది'' అందరితో మర్యాదగా మాట్లాడాడు.
రైతులందరూ అతనిలో మార్పుకు సంతోషించారు. ''పదండి కష్టపడి పండించాడు. మన తోటి రైతు పంట వర్షానికి దెబ్బతింటే మనకు బాగుండదు అనుకుని అందరూ కొడవళ్లు పట్టుకుని కోతకు ఉపక్రమించారు. వారితో పాటు రామయ్య కూడా. కాసేపటికి కోత పూర్తి అయింది. పంటంతా ఇంటికి చేరగానే వర్షం ప్రారంభమైంది. తోటి రైతుల సహాయానికి కత్ఞతలు చెప్పాడు. ''నా రగడతోనే ఇంతవరకు తెచ్చుకున్న నన్ను క్షమించండి'' అన్నాడు అందరితో.
- కనుమ ఎల్లారెడ్డి,
పౌర శాస్త్ర అధ్యాపకులు, తాడిపత్రి.