Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మువ్వన్నెల చీర కట్టి, మోదుగు పూల జాకెట్టు తొడిగారు కాకికి. నుదుటన పావలా కాసంత సింధూరం పెట్టి, చెవులకు లోలాకులు, ముక్కుకు ముక్కెర పెట్టారు. కాళ్లకు మామిడి పిందె పట్టాలు, చిటికిన వేలికి ఉంగరం పెట్టి, వరుడి ముందు కూర్చోబెట్టారు. కాబోయే పెండ్లి కూతురు, పెండ్లి కొడుకు తరపున వచ్చిన పక్షులన్నీ మార్చి మార్చి చూడసాగాయి. కాకి తలవంచుకుని సిగ్గు పడుతోంది.
మగ కాకి తరపున వచ్చిన స్నేహితులు ''ఏవైనా అడుగు... అడుగు...'' అని ఉత్సాహ పరుస్తున్నారు.
''ఏం అడగాలో తోచడం లేదు. మీరే అడగండి'' అంది వరుడు కాకి.
కోకిల ముందుకు వచ్చి ''చూడమ్మా! ఆడదానికి గాత్రమే అందం. నువ్వొక పాట పాడితే, మేం విని ఆనందిస్తాం'' అంది.
''నేను ఎక్కడా సంగీతం నేర్చుకోలేదండి'' అంది కాస్త భయంగా.
''ఫరవాలేదమ్మా. మేమేమన్నా, సంగీత కళాశాలలో నేర్చుకున్నామా? మనసుకు ఉత్సాహం కలిగినప్పుడు, మనకు తెలీకుండానే గుండె లోతుల్లోంచి వస్తుంది పాట. మా కోకిలలు వసంత ఋతువులో కూయడం, లోకమంతా మెచ్చుకోవడం మీరంతా చూస్తున్నారు గదా'' అంది కాస్త గర్వంగా.
కన్య కాకికి గొంతు విప్పక తప్పలేదు. నోరు తెరిచి ''కావ్... కావ్... కాకా... కాకా... కావ్... కావ్...'' అని పాడింది.
ఆ శబ్దానికి కాకులు తప్ప మిగిలిన పక్షులన్నీ చెవులు మూసుకున్నాయి. ఏదో మొహమాటం కొద్దీ విని, ''చాలమ్మా... ఇంక చాలు... ఆపు'' అందో కోకిల.
దాని మాటలకు ముడుచుకు పోయింది కాకి.
''నీ గాత్ర మాధుర్యాన్ని విన్నాం కానీ, నత్యం ఏవన్నా వచ్చామ్మా'' అనడిగింది నెమలి.
''నేనెవరి దగ్గర నేర్చుకోలేదండి'' అంది భయం భయంగా.
''అయినా ఫరవాలేదు. నీకు వచ్చినట్లే చేయి. నీలి మబ్బులు కమ్మి, ఆహ్లాదకర వాతావరణం ఏర్పడినప్పుడు, మనకు తెలీకుండానే పాదాలు నర్తిస్తాయి. మేం నాట్యం చేస్తే లోకమంతా పొగుడుతుంది. అసలు ఆడదాని నడకలో పుట్టుకతోనే నాట్యం ఉంటుందంటారు గదా. ఏది కాస్త చేసి చూపించమా'' అంది నెమలి.
నత్యం చేయక తప్పలేదు. మెల్లగా లేచి, తనకు నచ్చినట్లు నాలుగు అడుగులు వేసింది.
దాని నత్యం చూసి, పక్షులన్నీ పడీ... పడీ... నవ్వాయి.
''ఇది నత్యమా? కాలు కారితే గంతులు పెట్టినట్లు...'' అని పరిహసించింది నెమలి.
కన్య కాకికి అవమానం అనిపించింది. అక్కడ్నించి, ఎగిరి పోదామనుకుంది. కానీ- అందరినీ పిలిచి, లేచిపోతే అవమానించినట్లవుని తలవంచుకుని, దుఃఖాన్ని దిగమింగుతూ కూర్చుంది.
''ఇంతకీ నీ పేరు చెప్పనే లేదు'' అంది చిలక ముద్దు ముద్దుగా.
''కాకమ్మ'' అంది బిడియంగా.
కరకుగా వినిపించిన ఆ మాటలకు నవ్వుకున్నాయి నాజూకు పక్షులు.
''నాకు అమ్మాయి నచ్చింది'' ఉన్నట్టుంటి హఠాత్తుగా అంది వరుడు కాకి. ఆశ్చర్యపోవడం వెంట వచ్చిన పక్షుల వంతైంది.
''అమ్మాయి మాట కర్ణ కఠోరం. పాటంటావా గార్దభ స్వరం. నత్యం చూశారు గదా, పిచ్చి పట్టినట్లు ఆ గంతులు. ఏం చూసి చేసుకుందామనుకుంటున్నావురా?'' అంది మైనా పిట్ట.
''పెద్దమ్మా, తనకి శ్రావ్యమైన గొంతు లేక పోవచ్చు.. కానీ తనకున్న గొంతుతో తెల్లవారు జామున్నే అందరికంటే, ముందుగా లేచి అరచి, రైతుల్ని కూలీల్ని మేల్కొలిపి పనులకు పంపుతుంది. తనకి నత్యం రాకపోవచ్చు. కానీ పరుల కష్టాలకు కరిగిపోయి చేతనైన సహాయం అందిస్తుంది. చిలుకలా, కొంగలా అందమైన శరీరం లేకపోవచ్చు.. కానీ కష్టపడే గుణముంది . తనకు చేత కాకుంటే, కోకిలగుడ్లను తను పొదిగి, పిల్లల్ని కని- పెద్దయ్యేదాకా పెంచి, కోకిలకు అప్పజెబుతుంది. తనకు ఆహారం దొరికితే ఒక్కతే రహస్యంగా తినకుండా, తన వారిని పదిమిందినీ పిలిచి, అందరితో కలిసి పంచుకు తింటుంది. ఇంక అందరి ఇండ్లల్లో పనికి రావని పారేసిన పదార్థాలు తిని కడుపు నింపుకుని పరిసరాలను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అన్నిటికంటే మిన్నగా నాకు ఎంతో అందంగా కనిపిస్తోంది నల్లని రూపు. నన్ను భద్రంగా చూసుకుంటుందనే నమ్మకమూ ఉంది. అసలు మన శ్రమ జీవుల్ని సంగీతం వచ్చా? నాట్యం వచ్చా? అని అడగడమే తప్పు. ఇంటి పనీ, అడవి పని వచ్చా అని అడగాలి'' అంది వరుడు కాకి...
దాని విశ్లేషణకు పక్షులన్నీ ఆనందంతో చప్పట్లు కొట్టాయి. వధువు ముఖం ఆనందంతో వెలిగిపోయింది...
- పుప్పాల కష్ణమూర్తి, 9912359345