Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జగన్నాథం తన ఒక్కగానొక్క కూతురు సువర్చలను యోగ్యుడైన ప్రభాకరానికి ఇచ్చి పెళ్లి చేశాడు. సౌమ్యుడు. భార్యను తనకు అనుకూలంగా మలచుకుని ధర్మబద్ధంగా జీవిస్తుండేవాడు. బట్టలు నేసి గ్రామాల్లో తిరిగి అమ్మి, వచ్చిన డబ్బుతో గుట్టుగా సంసారం సాగిస్తుండేవాడు.
కూతురు గర్భం దాల్చడంతో తొలి కాన్సుకు పుట్టింటికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. మగ పిల్లవాడు జన్మించడంతో ఇరు కుటుంబాల వాళ్లు సంతోషించారు. గంగారాం అని పేరు పెట్టుకుని గారాబంగా పెంచసాగారు. మగ పిల్లలు లేక పోవడంతో తన వద్దే ఉంచుకుని వెంట తిప్పుకోసాగాడు జగన్నాథం.
రెండో కాన్పుకు పుట్టింటికి పంపలేదు ప్రభాకరం. తమ ఇంట్లోనే ఉంచుకుని కాన్సు చేయించాడు మంత్రసానితో. చక్కని మగ పిల్లవాడు కలిగాడు. శాంతారాం అని పేరు పెట్టుకుని ముద్దుగా పెంచుకో సాగారు.
జగన్నాథం వడ్డీ వ్యాపారి. వచ్చిన వారి అవసరాన్ని బట్టి, వడ్డీ పెంచేసేవాడు. తిరిగి ముక్కు పిండి వసూలు చేసేవాడు. తనను కలిసిన వారితో ఎప్పుడూ నిజం చెప్పేవాడు కాదు. పచ్చి అబద్దాలు చెబుతుండేవాడు. అలా చెప్పందే డబ్బు సమకూరదు అని గంగారాంకు హిత బోధ చేసేవాడు. గంగారాం తాత గుణాలను చక్కగా ఒంట బట్టించుకున్నాడు.
జగన్నాథం తనకున్న ఆస్తినంతా మనవడి పేరున రాశాడు. తాత చనిపోవడంతో ఆస్తి తీసుకుని తండ్రి వద్దకు చేరుకున్నాడు గంగారాం. పెద్దవాడికి ఇరవై ఏళ్లు, చిన్నవాడికి పద్దెనిమిదేళ్లు వచ్చాయి. ఇద్దరికీ స్వంతంగా వ్యాపారాలు పెట్టించాలని నిర్ణయించాడు తండ్రి. వడ్డీ వ్యాపారంలో బాకీలు ఎగొట్టే వారి సంఖ్య ఎక్కువ కనుక ఈ వ్యాపారం మానేసి, కిరాణ దుకాణం మొదలు పెట్టు. గొప్ప లాభాలు రాకున్నా, నష్టం ఉండదు. సరుకు పాడు గాదు' అని చెప్పాడు. ఒప్పుకున్న గంగారాం ప్రధాన అంగడిలో దుకాణాన్ని ప్రారంభించాడు.
కొన్న రేటు ఎప్పుడూ వినియోగదారులకు చెప్పకుండా, ఎక్కువ రేటుకు కొనుగోలు చేశానని చెప్పి, సరుకులను అధిక ధరకు అమ్ముతుండే వాడు. తండ్రి వారించేవాడు. ఇది వ్యాపారస్తుడికి మంచి లక్షణం కాదు. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు. కానీ జనం నమ్మకం కోల్పోతే, వ్యాపారంలో నిలబడలేం'' అని నచ్చచెప్పే ప్రయత్నం చేసేవాడు. కానీ తండ్రి మాట లెక్క పెట్టకుండా, తాతయ్య నిజాయితీ పనికి రాదన్నాడు కాబట్టే అంత సంపాదించగలిగాడు. నాదీ తాతయ్య బాటే అన్నాడు తండ్రి మాటలు లెక్క పెట్టకుండా.
చిన్నవాడితో చిన్న బట్టల దుకాణం పెట్టించాడు. శాంతారాం మాత్రం కొన్న రేటు చెప్పి, దాని మీద పది శాతం అధికంగా తీసుకుంటున్నానని నిజాయితీగా చెప్పేవాడు. ప్రారంభంలో ఎక్కువ మంది కొనుగోలు దారులు రాలేదు కానీ, మిగతా బట్టల దుకాణాలోని ధరలతో పోల్చుకుని తక్కువ ధర వున్న శాంతారాం బట్టల దుకాణంలోనే కొంటుండేవారు. క్రమేపీ వ్యాపారం పుంజుకుంది. శాంతారాం అంటే అబద్దం ఆడడు. నిజాయితీగా వ్యాపారం చేస్తాడు' అని పేరు పడిపోయింది. దీనితో ఎక్కడెక్కడ నుండో జనం వచ్చి, బటలు తీసుకుని పోతుండేవారు. నాలుగేళ్లు గడిచే సరికి వ్యాపారం ఉధతి పెరిగింది. పెద్ద దుకాణంలోకి మారి లక్షలో వ్యాపారం చేయసాగాడు. అతను వచ్చిన లాభాల్లో ప్రతి ఏడాది - గుళ్లకు, బళ్లకు విరాళం ఇస్తుండేవాడు.
గంగారాం దుకాణానికి వినియోగదారులు రావడం క్రమేపీ తగ్గిపోయారు. దుకాణంలో వస్తువుల ధరలను మిగతా దుకాణాలలోని ధరలతో సరిపోల్చుకునే వారు. ఎక్కువ ధర తీసుకుంటున్నాడని గ్రహించిన వినియోగదారులు గంగారంను నిలదీయగా, అవి నాణ్యతలేని సరుకులు, నాది నికార్సయిన సరుకు అని బుకాయించే వాడు. అబద్దం ఎంతో కాలం దాగదు. గంగారాం దుకాణానికి జనం రావడం పూర్తిగా మానుకున్నారు. దీంతో దుకాణం మూసివేసి తండ్రి వద్దకు చేరుకుని బావురుమన్నాడు.
''సత్యం నిజాయితీగా వ్యాపారం చేసేవాడు ఎప్పుడూ నష్టపోడు. చిన్నవాడు వ్యాపారం అలాగే చేశాడు. చక్కగా రాణించాడు. నువ్వేమో నిత్యం అసత్య మాడుతూ, వినియోగ దారులను మోసం చేశావు. నీ వ్యాపారం దివాళా తీసింది. ఎప్పటికైనా సత్యానిది, నిజాయితీదే గెలుపు'' అన్నాడు.
తండ్రి మాట ఒంటబట్టించుకున్న గంగారాం ఆ పట్నం వదిలి దూరంగా వున్న శివపురి ఆ మరో పట్టణం చేరుకున్నాడు. తిరిగి దుకాణం తెరిచి, నిజాయితీగా ప్రవర్తిస్తూ, సత్యసంధతతో వ్యాపారం చేస్తూ దినదినాభివద్ధి చెంది నగరంలోనే పెద్ద వ్యాపారస్తుడిగా మారిపోయాడు. కొడుకు అభివద్ధి చూసి తలిదండ్రులు పొంగిపోయారు.
- పుప్పాల కష్ణమూర్తి
సెల్ : 9912359345