Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోపి ఒక ఎండాకాలం అడవిని చూడడానికి వెళ్ళాడు. అడవుల్లో చాలా కొద్ది చెట్లే ఉన్నాయి. అవి కూడా ఎండిపోయి ఉన్నాయి. అక్కడ జంతువులు, పక్షులు చాలా తక్కువగా కనిపించాయి. క్రూరమగాల జాడనే లేదు. గోపికి చాలా దాహం వేసింది. అడవిలో నీటి కోసం చాలాచోట్ల వెదికాడు. ఎక్కడా నీటి మడుగే లేదు. ఇంతలో ఒక కోతి చేతిలో ఏదో పట్టుకొని వచ్చింది. గోపి ఆశ్చర్యంగా చూశాడు. అది ఒక నీటి సీసా. దానికి ఆ సీసా మూతను తీయరావడం లేదు. వెంటనే గోపికి ఒక ఆలోచన తట్టి తన సంచిలోని రెండు పండ్లను తీసి దాని వైపు విసరి వేశాడు. అది చేతిలో ఉన్న నీటిసీసాను, మరొక వస్తువును కిందకు విసరి ఆ పండ్లను తీసుకుని పారిపోయింది.
గోపి అక్కడికి వెళ్లి ఆ నీటి సీసా మూతను తీసి అందులోని నీటిని గడగడా తాగివేశాడు. ''పాపం! ఆ కోతికి ఆ నీటి సీసా మూతను తీయరాక దప్పికతో ఎంత బాధ పడిందో ! ఇంకొక ఆ వస్తువు ఏమిటో'' అని ఆలోచించి ఆ వస్తువు వైపు చూశాడు. అది ఒక చిన్న బంగారు ముక్క. గోపి ఆశ్చర్యపోయాడు. ఈ కోతి దానిని ఎక్కడినుండో పట్టుకుని వచ్చిందనుకున్నాడు. వెంటనే గోపికి మరొక ఆలోచన వచ్చి ఒక వాడి మొనగల కర్రను తీసుకుని అక్కడ కొద్దిగా నేలను తవ్వాడు.
వెంటనే తన గ్రామానికి వచ్చి ఊరి వారితో ''నాకు మన అడవిలో నేలను తవ్వితే ఈ బంగారు ముక్క దొరికింది. మీరూ తవ్వండి. అక్కడ బంగారు గనులు ఉన్నట్లు ఉన్నాయి'' అని అన్నాడు. అది విన్న గ్రామస్తులు కొందరు ''అంతా అబద్ధం. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఎవరికీ బంగారం దొరకలేదు. వీడికి బంగారం దొరికిందని అంటే నమ్మలేం'' అని అన్నారు. కొందరు మాత్రం ఒకవేళ వీడన్నట్లు అక్కడ బంగారం దొరికితే నయమే కదా! మన దరిద్రం పోతుంది అని అనుకొని అడవికి పలుగూ, పార చేతబట్టుకొని వెళ్లారు.
అప్పుడు గోపి ఆ అడవిలో తాను తవ్విన ప్రదేశాన్ని వారికి చూపించి ఇక్కడే తనకు బంగారం దొరికిందని చెప్పాడు. వారు గోపి మాటలను విని అక్కడక్కడా కొన్ని చోట్ల నేలను తొవ్వారు. వారికేమీ దొరకలేదు. వారంతా నిరాశతో ఉండగా, గోపి తను అడవిలో నీటి కోసం పడ్డ విషయం, కోతి నీటి సీసా, బంగారం తెచ్చిన విషయం చెప్పాడు. ''అందరూ కలిసి గుంతలు తవ్వడం వల్ల వానాకాలం ఆ గుంతల్లో నీరు నిండి, అడవిలో నీటి కొరత రాకుండా ఉంటుంది. నాకు దొరికిన బంగారాన్ని అమ్మి, మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని సమానంగా పంచుకోండి'' అని ఆ బంగారం ఇచ్చాడు. వారంతా దాన్ని తీసుకుని వెళ్లిపోయారు.
ఆ సంవత్సరం చాలా వర్షాలు పడ్డాయి. అడవిలో గ్రామస్తులు తవ్విన ఇంకుడు గుంతలన్నీ నీటితో నిండి పోయాయి. చెట్లు పచ్చగా కళకళలాడాయి. అడవి దట్టంగా తయారైంది. పక్క గ్రామంలోని అడవికి వలస పోయిన జంతువులు, పక్షులన్నీ తిరిగి రావడం ప్రారంభించాయి.
మరుసటి ఏడాది గోపి అడవికి వెళ్ళాడు. అతనికి అడవిని చూసి ఎంతో సంతోషం అయ్యింది. మళ్లీ అతనికి ఒక కోతి కనబడింది. ఈసారి దాని చేతిలో నీటి సీసా లేదు. దానికి తన సంచిలోని రెండు పండ్లను తీసి దాని వైపు విసిరేశాడు. అది తన చేతిలో దాచుకున్న వస్తువును కింద పడేసింది. అది కూడా బంగారమే. తాను చేసిన పనికి ఇది బహుమతి అనుకున్న గోపి గ్రామస్తులందరికీ బంగారం విషయం చెప్పాడు. వారు ఆ బంగారాన్ని అతడినే తీసుకోమని చెప్పారు. కానీ అందుకు గోపి నిరాకరించాడు. ఆ బంగారాన్ని అమ్మి వచ్చిన డబ్బుతో గ్రామంలోని బీద వారికి పంచాడు.
- సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య
9908554535