Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవంటేనే రహస్యాన్ని విప్పి చెప్పే వాడు. ఎలాంటి దాపరికాలు లేనివాడు. కవి ఇబ్రహీం నిర్గుణ్ ఇప్పుడేది రహస్యం కాదు అంటున్నాడంటే తానుగా విప్పి చెప్పేవేవో ప్రత్యేకంగా ఉన్నాయన్న అర్థం స్ఫురిస్తుంది కదా! అవును తుపాకులను మొలిపించాలని ఆరాటమున్న కవి ముందు ఏ రహస్యం దాగుతుంది. కవిత్వమై అందరి గుండెల్లో పేలుతుంది. కవికి కవిత్వమే అన్ని కన్నులు. ఇబ్రహీం నిర్గుణ్ కు కూడా.
ఈ కవితాసంపుటిలో గతస్మతుల తాలూకా ఆనవాళ్ళున్నాయి. నాన్న గురించి ఉంది, అమ్మ గురించి ఉంది, ఇబ్రమ్ సాబ్ బొత్త గురించి ఉంది. విసర గలిగే మాట ఉంది. దోపిడీ వ్యవస్థపై విరుచుకు పడడమూ ఉంది.
ఎరుపంటే ఈ కవికి కలవరింత, పులకరింత. ఇతనికి అడవి ఒక రహదారి. మంచి దశ్యచిత్రకారుడు. ఇతనికి కల్లోలిత ప్రపంచాన్ని దూరం చేద్దామనుకునే ఓ కలల ప్రపంచం ఉంది. ఈ కవి ఎర్రని సూర్యునితో కూడా రాత్రి వెన్నెలను తాగించగలడు.
వెంటాడే వాక్యాల్లోకి..
1. వాళ్ళు నువ్వెవరివని అడిగారు
నేను సేద్యకుడ్ని అన్నాడు
ఏం సేద్యం చేస్తుంటావ్ అనడిగారు
అక్షరసేద్యం అన్నాడు
మరీ ఈ అడవిలో ఏం చేస్తున్నావ్ అనడిగారు
అక్షరాలు నాటుతున్నాను అన్నాడు
(తుపాకులు మొలిచే తోట; పేజీ 38)
ఈ కవిత ఆదివాసీలను చైతన్యపరిచే కవిత. కనీసం అక్షరానికి కూడా నోచుకొని వాళ్ళల్లో పోరాడే తత్వాన్ని నింపటం కోసం రాసిన కవిత. పూర్తిగా సంభాషణాత్మకంగా సాగుతుంది. కవి 'అక్షరాలను నాటుతాననటం' ఈ కవితలో సజనాత్మక అభివ్యక్తి. కవి చెప్పినట్టు అవసరమున్నచోట అక్షరాలు నాటాల్సిన సమయమిది
2. ఓ ఆడశిశువును
పురిట్లోనే గొంతునులిమి
పెంటకుప్పల్లో పారేసిన రోజున
భారత్ కల చెదరలేదా!?
(భారత్ కల చెదిరిందట; పేజీ 121)
భారత్ క్రికెట్ మ్యాచ్ ఓడిన తెల్లారి పేపర్లో వచ్చిన వార్త నేపథ్యంగా రాసిన కవిత. ఈ కవితలో ఇలాంటి పదునైన వాక్యాలెన్నో ఉన్నాయి. ఆడ పిల్లలను పురిట్లోనే చంపేసే కీచకులకు, నయవంచకులకు చురక ఈ కవిత. ఆడ్ ల పేర్లతో కోట్లు దండుకునే ఆటకు సంబంధం లేని దేశం కలకు అనుసంధానం చేయటాన్ని కవి ప్రశ్నిస్తాడు. దేశమంటే ఆట గెలవటం కాదు. సామాన్యడు బతుకులో గెలవటం అనే సారాంశంగా సాగే ఈ కవితా వాక్యాలు మననం చేయదగ్గవి.
3. పోరా..!
పో...!
నువ్వు పోయాక
నీదేహం మట్టి కాకుండా
కులమైనప్పుడు చర్చిద్దాం
(రా...!చర్చకురా! ; పేజీ 135)
ఈ కవితా వాక్యాలు కులాన్ని, మతాన్ని నిరసిస్తున్నాయి. నిజంగా ఎవరి దేహమైనా చివరికి మట్టి కావాల్సిందే. ఊపిరి ఉన్నంత సేపే ఈ ఆరాటాలు, ఆధిపత్యాలు. ఆ చిలుకెగిరిపోతే మిగిలేది ఏముంటుంది.
మనిషి చచ్చాక వెంటరాని కులం బతికున్నాక ఎందుకన్న అవగాహనతో కవి ప్రశ్నిస్తున్నాడు.
4. రేపుదయం వాడే
చీకట్లకు నిప్పుపెట్టి
గుట్టమీద దీపమై వెలిగిపోతాడు
(వెలుగు వెతుక్కుంటు వస్తుంది; పేజీ 178)
ఇంట్లో పిల్లలకు అన్ని సౌకర్యాలను కల్పించినపుడు వాడికిక దారి దొరకదు. ఎంత వెలుగున్నా వాడి బతుకు చీకటే. సొంతంగా ఏ పని చేయలేడు. అందుకే కవి పిల్లవాడికి సమస్యలను పరిచయం చేయలాంటాడు. చీకటిని సమస్యలకు, దీపమై వెలగడాన్ని విజయానికి ప్రతీకగా చెబుతూ కవి కవిత్వం చేసిన తీరు ఆకట్టుకుంటుంది.
నేటి సమాజంలోని సమస్యలను తన కలంతో ఎండగడుతూ ప్రగతిశీలకంగా ముందుకెళ్తున్న కవి నిర్గుణ్ కవిత్వంలో ఇంకెన్నో వెంటాడే, వేటాడే వాక్యాలున్నాయి. ప్రముఖ విమర్శకులు జి.లక్ష్మీనరసయ్య కవి ఇబ్రహీం నిర్గుణ్ని ముందుమాటలో 'కమిటెడ్ కవి' అని సంభోదించారు. అక్షరాలా ఈ కవికి వర్తించే వాక్యాలవి.
- తండ హరీష్ గౌడ్, 89784 39551