Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటాడే వాక్యాలు
కవి కవిత్వాన్ని సామాజికంగాను, వైయుక్తికం గాను రెండు పాయలుగా విడగొట్టుకుంటాడు. ఒక కవి కవిత్వం ద్వారా సమాజాన్ని సంస్కరించాల నుకుంటాడు. ఇంకో కవి ఆత్మాశ్రయంగా తనలోని భావాలను కుప్ప పెడుతుం టాడు. రెండు వేరు వేరు మార్గాలయిన ఒక్కో కవి ఒక్కో విధంగా అనుభూతి చెందుతాడు. ఆ దష్టి కోణంలో నుండి చూసినప్పుడు డా.సిహెచ్ ఆంజనేయులు సామాజికత వైపుగా తన కవిత్వాన్ని నడిపించాడు.
ఈయన ఇప్పటివరకు నాలుగు కవితా సంపుటాలు ప్రకటించాడు. అవి వరుసగా అక్షరాలు పూస్తున్నాయి, గాయబడిన జాబిలి, దిగివచ్చిన గగనం, ఆశల గాలిపటాలు, అనిసెట్టి అగ్నివీణ-విశ్లేషణ పేరుతో పరిశోధన గ్రంథం కూడా రచించాడు. ఈయన నల్లగొండ జిల్లా, భువనగిరిలో జన్మించాడు. ప్రస్తుతం ఉద్యోగ రీత్యా ఖమ్మంలో నివసిస్తున్నాడు. ఈయన కవి, విమర్శకులు కూడా.
ఈయన రాసిన కవితలలో ఎక్కువగా రైతు జీవితం, మానవీయత, దుఃఖం, నీటి విశిష్టతను తెలియజేయటం, జీవన తాత్వికత, ప్రకతి సంబంధిత మొదలగు అంశాలు వస్తువులుగా ఎక్కువ పాళ్ళలో కన్పిస్తాయి. ఈ కవి జీవితాన్ని కవిత్వంగా మలిచిన వాడు కాబట్టే మానవ సంబంధాల గూర్చి, మనుషుల మధ్య ఉండే ప్రేమానురాగాలు గూర్చి ఇంత చక్కగా రాయగలిగాడు.
వెంటాడే వాక్యాల్లోకి..
1. రాలిన ఆకులను చూసి
చెట్టువైపు జాలిగా చూడకు
చిగురుటాకులను చూసి
వసంతోత్సవమని
అతి ఉత్సాహం చెందకు
(రాలిన ఆకులను చూసి, పేజీ 35)
ఈ వాక్యాలు జీవన తాత్వికతను నిండినవి. ఈ నాలుగు వాక్యాల్లోనే కవి ఊహ రెండు పార్శ్వాలుగా నడిచింది. ఒకవైపు దీనస్థితికి ప్రేరణను కల్పిస్తూనే, మరోవైపు ఉన్నత స్థితిని హెచ్చరిస్తాడు. ఈ పరమార్థం ప్రతీ వ్యక్తి తెలుసుకోదగ్గది. రాలిన ఆకులను, చిగురుటాకులను జీవన విధానానికి ప్రతీకలుగా తీసుకొని కవితను నడిపించిన తీరు కవి సామర్థ్యానికి నిదర్శనం.
2. నేనిప్పుడు మనిషిని మనిషిగా ఆరాధించే
ప్రేమైక మనిషికోసం వెతుకుతున్నా
మనిషే నా విశ్వాస సంతకం
మనిషే నా సకలం (అపరిచితులం,పేజీ 54)
ఈ వాక్యాల్లో మనందరికి కావాల్సిన వాస్తవికత దాగుంది. ఈ రోజుల్లో మనిషిని మనిషి పట్టించుకునే తీరు కనబడటం లేదు. ఒకటి వాళ్ళకుండే పరిస్థితులు కావచ్చు, ఉదాసీనత కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కానీ అందులో నుండి మనిషి బయట పడాలనే ఆశావాహ దక్పథాన్ని కవి ఈ వాక్యాల్లో వెలిబుచ్చాడు. మనిషికి మనిషికి మధ్య ఉండే విశ్వాసం ఎంత గొప్పదో వ్యక్తపరిచాడు. మనిషే నా సకలం అంటూ మనిషికి మనిషికి మధ్య ఉండే గొప్ప బంధమేంటో వివరించాడు.
3. బంగారుకొండా మరిచిపోకు
నిండు నూరేళ్ళ జీవితాన్ని బలిపెట్టకు
నీలో ఏ జ్ఞానవేత్త దాగున్నాడో
బతికి పరిమళించు
బతుకందరికీ పంచు
(నిష్క్రమించకు-ఆలిచించు,పేజీ 108)
నేటి పరిస్థితులలో యువకులు కార్పోరేట్ చదువుల పేరుతో, ప్రేమ పేరుతో ఏదో ఒకరకమైన ఒత్తిడికి లోనవుతూ నిండు నూరేళ్ల జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. ఆ అంశాన్ని కవిత్వంలోకి తీసుకొచ్చి అలాంటి సంఘటనలు జరగకూడదన్న ఆలోచనతో కవి ఈ వాక్యాలను రాశాడు. ఎంత సుతిమైత్తగా 'బంగారు కొండ' అని కవి సదరు పాత్రను పిలిచి తల్లిదండ్రులకు ఆ వాక్యం ద్వారా సూచననిస్తున్నాడు. ఈ వాక్యం లాంటి ప్రేమను తల్లిదండ్రులు పంచగలిగితే నిజంగా వాడిలోని విజ్ఞాన సుగంధాలు ఖచ్చితంగా బయటికి వస్తాయి. పరిమళించు, బతుకును పంచు అంటూ యువకులలో ప్రేరణను కల్గించే ఈ వాక్యాలు మరువలేనివి.
4. ఈ పచ్చనాకులు
నాకు ఒక జీవనలాలన
ఒక జీవనగమనాగమనం
ఒక ఆశా ఉదయం (పచ్చనాకులు,పేజీ125)
ఈ కవి ప్రకతి ప్రేమికుడు. జీవితానికి ముడిపెడుతూ ఈ వాక్యాల్లో పచ్చనిఆకుల విశిష్టతను గొప్పగా తేల్చిచెప్పాడు.నిజంగా మన జీవనమంతా ఆకుతో సాగుతున్నదే. ఇటు శ్వాసగా,అటు మెతుకుగా నిలుస్తున్న ఆకులు మానవ జీవితంతో విడదీయలేనివి. ఏ కళ్ళకైనా పచ్చదనాన్ని మించిన దశ్యం ఉండదు కదా. ఈ కవి కూడా కవిత్వంలో కొంత ఎక్కువ పాళ్ళే ప్రకతిని కలవరిస్తాడు. పచ్చనాకులాంటి వాక్యాలివి. ఇలా ఆశావాహ దక్పథ మేళవింపుగా ముందుకొచ్చిందే 'ఆశల గాలిపటాలు'. కవి ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే అందరు సామాజిక బాధ్యతను గుర్తెరుగాలి. ఈ కవితా సంపుటి ఆ దిశగా మార్గమేసింది.
- తండ హరీష్ గౌడ్
సెల్: 8978439551