Authorization
Mon April 07, 2025 10:18:01 am
నయనాలకు నచ్చి
ఎదలోతుల్ని చేరి
మధురభావ పరిమళాలతో
అక్షరసుమాలు పూయించేదే
కవిత్వం.
మస్తిష్క పొరల్లో
పురుడు పోసుకున్న
ఆలోచనలతో,
సొగసైన భావాలతో,
అక్షర సాక్షిగా
ఎన్నో హృదయాలను
స్పందింపచేసేదే కవిత్వం.
రసజ్ఞుల మనస్సులను
ఉర్రూతలూగించేది,
రసానుభూతిని కలిగించేది,
మనసును
సంతోష తరంగాలలో
ఓలలాడించేదే కవిత్వం.
కవి మదిలోని సంఘర్షణలను
అక్షరాలతో
తాండవం చేయించగా
పెల్లుబుకే
రసనిష్యందధునియే కవిత్వం.
మాధుర్యాది గుణాలతో
డెందాలను అలరింపచేస్తూ
కర్కశ హృదయాలను కూడా
కదిలించేదే కవిత్వం.
అదొక...
అద్భుత పదాల ప్రోది
స్ఫూర్తి భావనల ఊట.
అనుభూతుల ఆర్ద్రత...
- వేమూరి శ్రీనివాస్, 9912128967