Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాభాల్లో 67 శాతం వృద్థి
- తగ్గిన మొండి బాకీలు
ముంబయి : దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అత్యంత ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలను సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 67 శాతం వృద్థితో రూ.7,627 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. ఇది వరకు ఎప్పుడూ లేని స్థాయిలో రికార్డ్ స్థాయిలో అత్యధిక లాభాలను ఆర్జించింది. బుధవారం ఎస్‌బీఐ తన ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. ఆ వివరాలు.. మొండి బాకీలకు తగ్గిన కేటాయింపులు, నికర వడ్డీ ఆదాయంలో పెరుగుదల మెరుగైన ఆర్థిక ఫలితాలకు దోహదం చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.4574 కోట్ల లాభాలు నమోదు చేసింది. గడిచిన క్యూ2లో రూ.7400 కోట్ల మేర లాభాలు ప్రకటించే అవకాశం ఉందని తొలుత నిపుణులు, మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. ఈ అంచనాలు మించి ఫలితాలు ప్రకటించడం విశేషం. క్రితం క్యూ2లో బ్యాంక్ నికర వడ్డీపై ఆదాయం 10.6 శాతం పెరిగి రూ.31,184 కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.28181 కోట్లుగా ఉంది.
2021 సెప్టెంబర్ ముగింపు నాటికి బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 4.9 శాతానికి తగ్గాయి. ఇంతక్రిత జూన్ త్రైమాసికంలో ఇది 5.32 శాతంగా, గతేడాది సెప్టెంబర్ త్రైమాసికంలో 5.28 శాతంగా ఉన్నాయి. దేశీయ అడ్వాన్స్‌లు 4.6 శాతం పెరగ్గా.. స్థూలంగా 6 శాతం వృద్థి నమోదయ్యింది. ఇందులో గృహ రుణాల వాటా 24 శాతంగా ఉంది. ఈ రంగం రుణాల్లో 10.74 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. డిపాజిట్లు 9.77 శాతం వృద్థిని సాధించింది. సేవింగ్ బ్యాంక్ డిపాజిట్లు 10.55 శాతం పెరిగాయి.
సెప్టెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ వడ్డీ యేతర ఆదాయం 3.7 శాతం తగ్గి రూ.8,207 కోట్లుగా నమోదయ్యింది. గతేడాది ఇదే కాలంలో రూ.8,527 కోట్లుగా ఉంది. రుణ వ్యయం తగ్గినట్లు ఎస్‌బీఐ తెలిపింది. క్రితం క్యూ2లో మొండి బాకీల కోసం చేసే కేటాయింపులు 55 శాతం మేర తగ్గి 2,699 కోట్లకు దిగివచ్చాయి.
ఇది బ్యాంక్ మెరుగైన ఫలితాలకు ప్రధాన కారణం. గతేడాది ఇదే క్యూ2లో ఇందుకోసం రూ.5,619 కోట్లు కేటాయించింది. బుధవారం బిఎస్‌ఇలో ఎస్‌బిఐ షేర్ విలువ 1.14 శాతం పెరిగి రూ.527.65కు చేరింది. ఇంట్రాడేలో ఏకంగా రూ.542 గరిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది.