Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొమ్మిది నెలల కనిష్టానికి పీఎంఐ
న్యూఢిల్లీ :అధిక ధరలు తయారీ రంగ డిమాండ్‌ను దెబ్బ తీస్తున్నాయి. ప్రస్తుత ఏడాది జూన్‌లో ఈ రంగం మందగించిం దని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ ఇండియా విశ్లేషించింది. గడిచిన నెలలో మ్యాను ఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 53.9గా చోటు చేసుకుంది. ఇది గత తొమ్మిది నెలల్లో అతి కనిష్ట స్థాయి కావడం గమనార్హం. 2022 మే మాసంలో పీఎంఐ సూచీ 54.6 శాతంగా నమోదయ్యింది. సాధారణంగా ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధిగా ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. గతేడాది సెప్టెంబర్ తర్వాత ఇదే బలహీనమని ఎస్‌అండ్‌పి గ్లోబల్ సర్వే పేర్కొంది. జూన్ నెలలో ఉత్పత్తి, కొనుగోళ్లు, ఉపాధి, ఆర్డర్లు అన్నీ తగ్గాయని ఎస్‌అండ్‌పి గ్లోబల్ మార్కెట్ ఇంటిలిజెన్స్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా విశ్లేషించారు. వస్తువుల అధిక ధరల తీవ్రత నేపథ్యంలో ఉత్పత్తి, అమ్మకాల వేగం తగ్గిందని ఆమె పేర్కొన్నారు. అన్ని విభాగాలపై ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు చోటు చేసుకున్నాయన్నారు. వ్యాపార విశ్వాసం 27 నెలల కనిష్టానికి పడిపోయిందన్నారు. వడ్డీ రేట్లు పెరగడం, రూపాయి విలువ పడిపోవడం, అంతర్జాతీయ భౌగోలిక సవాళ్లు కూడా తయారీ రంగాన్ని దెబ్బతీశాయని లిమా పేర్కొన్నారు. ఉత్పత్తి, ఎగుమతులు, ముడి సరుకుల కొనుగోళ్లు తదితర అంశాలు తయారీ రంగాన్ని మందగించేలా చేశాయన్నారు. అనేక కంపెనీలు అధిక ద్రవ్యోల్బణం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయన్నారు.