Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 44 ప్రదేశాల్లో దాడులు
- మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణ
న్యూఢిల్లీ : చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివోకు చెందిన భారత కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేసింది. మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో దేశంలోని వివో, దాని అనుభంధ కంపెనీలపై మంగళవారం దేశవ్యాప్తంగా 44 ప్రదేశాల్లో దాడులు నిర్వహించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)లోని సెక్షన్ల కింద ఈ సోదాలు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. ఇటీవల షావోమి కార్యాలయాల్లోనూ సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ సంస్థకు చెందిన రూ.5,551 కోట్ల ఆస్తులను ఇడి అటాచ్ చేసింది. చైనా కంపెనీలు తమ ఆదాయానికి సంబంధించిన సమాచారాన్ని దాచిపెట్టాయని, పన్ను ఎగవేత కోసం... లాభాలను నివేదించలేదని ఆరోపణలు ఉన్నాయి. భారీగా అమ్మకాలు చేస్తున్నప్పటికీ.. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్‌కు నష్టాలు చూపుతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్ హర్యానా తదితర రాష్ట్రాల్లోని వివో కార్యాలయాలు, ప్లాంట్లలో సోదాలు కొనసాగాయి. గత నెలలో, రెండు చైనా కంపెనీలు నకిలీ పత్రాలు, చిరునామాలతో అక్రమాలకు పాల్పడినట్టు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తించడంతో ఇడి అధికారులు సోదాలు చేపట్టారని తెలుస్తోంది. ఇప్పటికే జెడ్‌టీఓ కార్పొరేషన్, వివో మొబైల్ కమ్యూనికేషన్స్ కంపెనీ లోకల్ యూనిట్లు ఆర్థిక అవకతవకల విచారణను ఎదుర్కొంటున్నాయి.