Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సగం తగ్గిన మొండి బాకీలు
- ఎనిమిదేండ్ల తర్వాత తొలిసారి డివిడెండ్
న్యూఢిల్లీ: ఐడిబిఐ బ్యాంక్ ఎనిమి దేళ్ల తర్వాత తొలిసారి వాటాదారులకు డివిడెండ్‌ను ప్రకటించింది. ఎల్ఐసి, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఈ బ్యాంక్ గడిచిన ఆర్థిక సంవత్సరం (2022- 23) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 64 శాతం వృద్థితో రూ.1,133 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ4లో రూ.691 కోట్ల లాభాలు నమోదు చేసింది. 2022-23లో మొత్తంగా రూ.3,645 కోట్ల నికర లాభాలు సాధించింది. ఈ సందర్భంగా రూ.10 ముఖ విలువ కలిగిన షేర్‌పై 10 శాతం లేదా రూ.1 డివిడెండ్‌ను అందించడానికి ఆ బ్యాంక్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. గడిచిన క్యూ4లో బ్యాంక్ నికర వడ్డీపై ఆదాయం 35 శాతం పెరిగి రూ.3,280 కోట్లకు చేరింది. ఇంత క్రితం ఏడాది ఇదే క్యూ4లో రూ.2,420 కోట్ల ఎన్ఐఐ నమోదయ్యింది. ఇదే సమయం నాటికి 13.82 శాతంగా ఉన్న స్థూల నిరర్థక ఆస్తులు.. ఏకంగా గడిచిన క్యూ4 ముగింపు నాటికి 6.38 శాతానికి తగ్గాయి. నికర నిరర్థక ఆస్తులు కూడా 1.36 శాతం నుంచి 0.92 శాతానికి తగ్గడం విశేషం. 2023 మార్చి ముగింపు నాటికి ఐడిబిఐ బ్యాంక్ వ్యాపారం 53.02 శాతం పెరిగి రూ.1,35,455 కోట్లకు చేరింది. ఐదేళ్ల తర్వాత తొలిసారి 2022-23లో ఐడిబిఐ బ్యాంక్ కొత్తగా 42 శాఖలను తెరిచింది. మరోవైపు మెరుగైన ప్రగతిని కనబర్చుతున్న ఈ సంస్థను మోడీ సర్కార్ ప్రయివేటుపరం చేసే ప్రక్రియను వేగవంతం చేయడం గమనార్హం. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసి), ప్రభుత్వ భాగస్వామ్యంలోని ఐడిబిఐ బ్యాంక్‌ను విదేశీ పెట్టుబడిదారులకు అప్పగించడానికి వీలుగా ఇప్పటికే నిబంధనలు మార్చింది. ఇందులోని 60.72 శాతం వాటాలను విక్రయిం చాలని కేంద్రం ఆసక్తిగా ఉంది. ఐడిబిఐ బ్యాంక్‌లో ప్రస్తుతం ఎల్ఐసికి 49.24 శాతం, ప్రభుత్వానికి 45.48 శాతం, నాన్ ప్రమోటర్ షేర్హోల్డర్లకు 5.29 శాతం చొప్పున వాటాలున్నాయి. ప్రయివేటీకరణ కోసం ఇప్పటికే ఆసక్తి వర్గాల నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపమ్) దరఖాస్తులను స్వీకరించింది. వచ్చే మార్చి ముగింపు నాటికి విక్రయ పక్రియను పూర్తి చేయనున్నట్లు దీపమ్ సెక్రటరీ పాండే పలుసార్లు తెలిపారు.