Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ హైకోర్టు వెల్లడి
న్యూఢిల్లీ : దాదాపు పదేళ్ళ క్రితం నాటి కేసులో రిలయన్స్ ఇండిస్టీస్కు అనుకూలంగా మంగళవారం ఢిల్లీ హైకోర్టు తీర్పును ఇచ్చింది. 2014లో ప్రభుత్వ రంగ సంస్థ ఒఎన్జిసికి చెందిన ప్రాంతంలో రిలయన్స్ ఇండిస్టీస్ అక్రమంగా గ్యాస్ తోడేసుకుందన్న ప్రధాన అరోపణలను కోర్టు తోసిపుచ్చింది. గోదావరిలోని కెజి బేసిన్‌లోని కెజి-డిడబ్ల్యుఎన్-98/3 క్షేత్రం నుంచి రిలయన్స్ దాదాపు రూ.12వేల కోట్ల విలువ చేసే గ్యాస్‌ను అక్రమంగా తోడేసుకుందని ఒఎన్‌జిసి ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై ఆ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఇరు సంస్థలు కలిసి అమెరికా కేంద్రంగా పని చేస్తున్న కన్సల్టింగ్ ఎజెన్సీ డిగోల్యర్ అండ్ మాక్నాగ్టొన్ (డిఅండ్ఎం)ను నియమించుకోవడం ద్వారా నిజనిర్థారణ చేయాలని కోరాయి. కాగా.. డిఅండ్ఎం కూడా రిలయన్స్‌కు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తునే.. ఆ మధ్యవర్తిత్వ అవార్డును పక్కన పెట్టాలని ఒఎన్‌జిసి, ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించాయి. కాగా.. 2018 జూలై 24 నాటి అంతర్జాతీయ మధ్యవర్తిత్వ అవార్డును ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి అనుప్ జైరామ్ భంభానీ సమర్థించారు. రిలయన్స్ ప్రధాన వాటాదారుగా ఉన్న ఈ కన్సోరియంలో బ్రిటన్ కేంద్రంగా పని చేస్తున్న బ్రిటిష్ పెట్రోలియం (బిపి), కెనడాకు చెందిన నికో రిసోర్సెస్ ఆఫ్ కన్సోరియం సంస్థలున్నాయి. ప్రస్తుత విలువ ప్రకారం ఆ సంస్థలు అన్యాయంగా 1.7 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.14 వేల కోట్లు) గ్యాస్‌ను తోడేసుకున్నాయన్న అప్పీల్‌ను తాజాగా ఢిల్లీ హైకోర్టు కొట్టివేసినట్లయ్యింది.