Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: రాబోయే ఐదేండ్లు భారత్ సహా ప్రపంచం గడ్డు పరిస్ధితులను ఎదుర్కోనుందని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. రాబోయే అర్ధ దశాబ్ధంలో దీటుగా ముందుకు సాగేందుకు భారత్‌కు సమర్ధవంతమైన నాయకత్వం అవసరమని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నా భారత్ మెరుగైన స్ధితిలోనే ఉందని, ప్రపంచానికి దిక్సూచీలా భారత్ ఉంటుందని ఐఎంఎఫ్ గుర్తించిందని ఓ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ జైశంకర్ వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా పరిస్ధితులు సంక్లిష్టంగా మారితే భారత్‌కు గడ్డుకాలం తప్పదని అన్నారు. రాబోయే ఐదేండ్లలో ఆర్ధిక సునామీ తప్పదని, ఈ క్రమంలో మనకు దీటైన నాయకత్వం అవసరమని జైశంకర్ స్పష్టం చేశారు. సరైన వ్యవస్ధలను గాడిలో పెట్టి సంక్లిష్ట పరిస్ధితులను విశ్వాసంతో ఎదుర్కొని సరైన జడ్జిమెంట్‌తో మనం ముందుకెళ్లాలని అన్నారు. ఆర్దిక వ్యవస్ధను నిశితంగా పరిశీలిస్తూ సంస్కరణల అమలుతో గడ్డు కాలాన్ని ఎదురీదాలని చెప్పుకొచ్చారు. ప్రపంచ చోదక శక్తిగా భారత్ పట్ల ప్రపంచం ఇదే దృక్పధాన్ని కలిగిఉందని అన్నారు. భారత్ వృద్ధి రేటు కొనసాగుతుందని ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్ధలు అంచనా వేస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.