Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూళ్లూరుపేట: పీఎస్‌ఎల్‌వీ-సీ 54 రాకెట్ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సర్వం సిద్ధం చేసింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శనివారం ఉదయం 11.56 గంటలకు రాకెట్ నింగిలోకి ఎగరనుంది. మన దేశానికి చెందిన 1117 కిలోల బరువు గల ఓషన్ శాట్-3 (ఈవోఎస్-06) ఉపగ్రహంతో పాటు మరో 8 ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ శుక్రవారం 10.26 గంటలకు ప్రారంభమైంది.25.30 గంటల పాటు కౌంట్‌డౌన్ కొనసాగాక షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ 54 రాకెట్ నింగిలోకి ఎగరనుంది.
ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ శుక్రవారం ఉదయం షార్ సమీపంలోని చెంగాళమ్మ ఆలయంతో పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రయోగం విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం షార్‌కు చేరుకొని ప్రయోగ ఏర్పాట్లను పరిశీలించారు. భూటాన్ దేశానికి చెందిన ఉపగ్రహం కూడా ఈ ప్రయోగంలో ఉండడంతో ఆ దేశానికి చెందిన శాస్త్రవేత్తల బృందం కూడా షార్‌కు చేరుకుంది. కౌంట్‌డౌన్ జరిగే సమయంలో రాకెట్ పనితీరును శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలించారు. రాకెట్‌లోని 2, 4 దశల్లో ధ్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను పూర్తి చేశారు. కడలిపై అధ్యయనానికి ఇస్రో ఓషన్ శాట్-3 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు.