Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో టీమ్‌ఇండియాకు శిఖర్ ధావన్ నాయకత్వం వహిస్తున్నాడు. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో భారత్‌పై కివీస్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 307 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్ 47.1 ఓవర్లలోనే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడినా కెప్టెన్ శిఖర్ ధావన్ (72) రాణించాడు. ఈ నేపథ్యంలో ధావన్‌పై టీమ్ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఆటతీరుకు తగిన విధంగా గుర్తింపు దక్కట్లేలేదన్నాడు.
'ధావన్ చాలా అనుభవజ్ఞుడు. అతడికి దక్కాల్సిన గుర్తింపు దక్కడం లేదు. నిజం చెప్పాలంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపైనే ఎక్కువ దృష్టి ఉంది. కానీ, ధావన్ వన్డే క్రికెట్ రికార్డు, ముఖ్యమైన మ్యాచ్‌ల్లో అగ్రశ్రేణి జట్లపై అతడు ఆడిన కొన్ని ఇన్నింగ్స్‌లు చూడండి. ఇది అద్భుతమైన రికార్డు. ధావన్ సహజంగానే దూకుడైన ఆటగాడు. ఫాస్ట్ బౌలింగ్‌ను బాగా ఎదుర్కొంటాడు. ఫుల్, కట్, డ్రైవ్ వంటి షాట్లు ఆడతాడు. బంతి బ్యాట్ మీదికి రావడాన్ని ఇష్టపడతాడు. అతడి అనుభవం ఈ సిరీస్‌లో ఉపయోగపడుతుందని భావిస్తున్నా. ధావన్ చుట్టూ చాలా మంది ప్రతిభావంతులైన యువ క్రికెటర్లున్నారు. కానీ, వన్డే ఫార్మాట్‌లో అతని అనుభవానికి విలువ ఉంటుందని భావిస్తున్నా' అని రవిశాస్త్రి వివరించాడు.