Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం రేపిన శ్రద్ధా హంతకుడు ఆఫ్తాబ్ పూనావాలా పోలీస్ కస్టడీ ముగిసింది. శనివారం ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ కోర్టులో హాజరుపర్చారు. దీంతో డిసెంబర్ 8 వరకు 13 రోజులు జ్యుడీషియల్ కస్టడీని కోర్టు విధించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఆఫ్తాబ్‌ను తీహార్ జైలుకు తరలించారు. సహజీవనం చేసిన శ్రద్ధా వాకర్‌ను హత్య చేసిన ఆఫ్తాబ్, అనంతరం ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి పాలిథిన్ కవర్లలో చుట్టి పలు ప్రాంతాల్లో పడేశాడు. మే 18న జరిగిన శ్రద్ధా హత్యపై దర్యాప్తు చేసిన ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు నిందితుడు ఆఫ్తాబ్‌ను ఈ నెల 12న అరెస్ట్ చేశారు. అతడ్ని ప్రశ్నించగా ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరకడంతోపాటు పలు షాకింగ్ విషయాలు వెల్లడించాడు. అనంతరం ఆఫ్తాబ్‌ను కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు అతడ్ని మరింతగా ప్రశ్నించేందుకు పోలీస్ కస్టడీ కోరారు. అలాగే మరిన్ని వివరాలు రాబట్టేందుకు పాలిగ్రాఫ్, నార్కో టెస్ట్‌ల కోసం అనుమతి కోరగా కోర్టు అంగీకరించింది. ఈ నేపథ్యంలో గురువారం ఆఫ్తాబ్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు. అయితే ఫలితాలు సంతృప్తికరంగా లేకపోవడంతో సోమవారం నార్కో టెస్ట్ నిర్వహించనున్నారు. కాగా, హతురాలు శ్రద్ధా, నిందితుడు ఆఫ్తాబ్ మహారాష్ట్రకు చెందిన వారు. వీరిద్దరికీ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది మే 8న ఢిల్లీకి వచ్చి ఒక అద్దె ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. అనంతరం పది రోజుల తర్వాత శ్రద్ధా వాకర్‌ను ఆఫ్తాబ్ హత్య చేశాడు.