Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఎక్కాలు అప్పజెప్పని విద్యార్థిని టీచర్ దారుణంగా శిక్షించాడు. అతడి అర చేతిపై మెషిన్‌తో డ్రిల్ చేశాడు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో ఈ దారుణ సంఘటన జరిగింది. కాన్పూర్ జిల్లా ప్రేమ్ నగర్ ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వివాన్ అనే విద్యార్థి ఐదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 24న ఆ విద్యార్థి స్కూల్ లైబ్రరీ వద్ద ఉన్నాడు. గమనించిన టీచర్ అనుజ్ పాండే అతడ్ని మందలించడంతోపాటు రెండో ఎక్కం చెప్పమని అడిగాడు. అయితే విద్యార్థి వివాన్ రెండో ఎక్కం చెప్పలేకపోవడంతో ఆ టీచర్ ఆగ్రహించాడు. లైబ్రరీ వద్ద పని చేస్తున్న వ్యక్తి నుంచి మెషిన్ డ్రిల్ తీసుకున్నాడు. విద్యార్థి అర చేతిని దానితో డ్రిల్ చేశాడు. కాగా, అక్కడే ఉన్న మరో విద్యార్థి కృష్ణ వెంటనే స్పందించాడు. మెషిన్ డ్రిల్ ప్లగ్‌ను తీసేశాడు. అప్పటికే విద్యార్థి వివాన్ అర చేతిలో డ్రిల్ దిగడంతో గాయపడ్డాడు. తన స్నేహితుడు స్పందించకపోతే అర చేతిలో మరింత లోతుగా ఆ డ్రిల్ దిగేదని ఆ విద్యార్థి వాపోయాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో దర్యాప్తు చేస్తున్నారు.