Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గురుగ్రామ్: ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లోని గురుగ్రామ్‌లో శనివారం తెల్లవారుజామున 4 గంటలకు ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి స్టోర్‌లో షాపింగ్ కోసం వచ్చాడు. షాప్‌లోకి ప్రవేశిస్తూనే జేబులోని సిగరెట్, లైటర్ తీసి వెలిగించే ప్రయత్నం చేశాడు. అది గమనించిన సెక్యూరిటీ గార్డ్ అడ్డుకున్నాడు. స్టోర్‌లో పొగ తాగడానికి అనుమతి లేదని వారించాడు. దాంతో సెక్యూరిటీ గార్డుతో, స్టోర్ సిబ్బందితో అతను వాగ్వాదానికి దిగాడు. సిబ్బంది సముదాయించడంతో ఆ తర్వాత షాపింగ్ పూర్తిచేశాడు. అనంతరం తాను కొనుగోలు చేసిన వస్తువులను పార్కింగ్ ఏరియాలోని తన కారు వద్దకు తీసుకురావాలని కోరాడు. దాంతో అశీశ్ అనే స్టోర్ వర్కర్ ఆ వస్తువులను మోసుకెళ్లాడు. వాటిని కారులో పెట్టి వెనక్కి వస్తుండగా నిందితుడు అతడిపై కాల్పులు జరిపి పారిపోయాడు. అయితే బుల్లెట్ గురి తప్పడంతో అశీశ్ ప్రాణాలతో బయటపడ్డాడు. దీనిపై స్టోర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా నిందితుడి కోసం వెతుకుతున్నారు.