Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు పాఠశాల్లో విద్యార్థుల రక్షణ, భద్రత కోసం అవసరమైన మార్గదర్శకాలు సిద్ధం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి, అడిషనల్ డీజీ స్వాతి లక్రా సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ కమిటీ సమావేశం నేడు నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగింది.
ఈ సందర్భంగా విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పాఠశాల భద్రత అంటే కేవలం సదుపాయాలు, భౌతిక భద్రతకు మాత్రమే పరిమితం చేయకుండా విస్తృత కోణంలో చూడాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలు గౌరవంగా జీవించే, సురక్షితమైన వాతావరణంలో విద్యను పొందే అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పిల్లలు ఎక్కువ సమయం పాఠశాలల్లోనే గడుపుతున్నందున పరిసరాలతో సహా పాఠశాల వాతావరణం సురక్షితమైంది, రక్షణాత్మకమైందిగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.
అభద్రతాభావం నెలకొంటే చదువుపై సరైన దృష్టి సారించలేకపోయే ప్రమాదం ఉంటుందన్నారు. ప్రస్తుతం పాఠశాలల్లో పలు భద్రతా జాగ్రత్తలు తీసుకుంటున్నా మరింత కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యం ఇస్తుందని, విద్యార్థుల భవిష్యత్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను స్వేచ్ఛగా పాఠశాలకు పంపే వాతావరణాన్ని కల్పించాలన్న మంత్రి.. విద్యార్థులు, తల్లిదండుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. తల్లిదండ్రుల మానసిక పరిస్థితిని అర్థం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు భద్రతా చర్యలకు శ్రీకారం చుట్టాలని భావించి ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
విద్యార్థుల భద్రతకు సంబంధించి పలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలను సూచించిందని, వీటిని తప్పనిసరిగా పాటించేలా చూడడంతో పాటు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందో ప్రభుత్వానికి సూచించాలని కమిటీ సభ్యులను కోరారు. తల్లిదండ్రులు, మేధావులతోనూ, విద్యారంగ నిపుణులతో చర్చించి తగిన సలహాలు సూచనలు ప్రభుత్వానికి అందించాలని కోరారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, అదనపు డీజీపీ స్వాతిలక్రా, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య, డీఐజీ సుమతి తదితరులు పాల్గొన్నారు.