Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు నక్సల్స్ మృతి చెందారు. బీజాపూర్ జిల్లా మిర్తూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోమ్రా-హల్లూర్ అటవీ ప్రాంతంలో బీజాపూర్ డివిజన్ కమిటీ సభ్యులు సహా దాదాపు 40 మంది మావోయిస్టులు సమావేశమైనట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సెంట్రల్ రిజర్వు ఫోర్స్, జిల్లా రిజర్వు బలగాలు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా ఆ ప్రాంతానికి చేరుకుని గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఇరు వర్గాలు తారసపడడంతో వారి మధ్య ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఆరుగురు మావోలు మృతి చెందారు. బలగాలు నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. రెండు మృతదేహాలను మావోయిస్టులు ఎత్తుకెళ్లినట్టు బీజాపూర్ పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో మరో ముగ్గురు మావోయిస్టులు గాయపడినట్టు చెప్పారు. ఘటనా స్థలం నుంచి 303, 315 రైఫిళ్లతోపాటు మూడు ఆయుధాలు, మందుపాతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. డిసెంబరు 2వ తేదీ నుంచి 8 వరకు పీపుల్స్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగానే మావోయిస్టులు అక్కడ సమావేశమైనట్టు పోలీసులు భావిస్తున్నారు.