Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కాశీలోని గంగానదిలో జరిగిన బోటు ప్రమాదం నుంచి ఏపీలోని నిడదవోలు వాసులు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు, పరిసర ప్రాంతాలకు చెందిన 120 మంది ఈ నెల 20న తీర్థయాత్రలకు బయలుదేరారు. అలహాబాద్, గయ, అయోధ్యను సందర్శించుకుని శుక్రవారం వారణాసి చేరుకున్నారు. గంగానదిలో పిండ ప్రదానాలు చేయాలని భావించిన 40 మంది నిన్న పడవలో నది దాటుతుండగా కొంతదూరం వెళ్లాక పడవకు చిల్లు పడింది. అది చూసిన అందులోని వారు భయంతో కేకలు వేశారు. దీంతో బోటును వెనక్కి మళ్లించేందుకు డ్రైవర్ ప్రయత్నిస్తున్న సమయంలో వారంతా భయంతో అటూఇటూ కదలడంతో అదుపుతప్పిన బోటు బోల్తాపడింది. నదిలో పడిన వారు తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేయడంతో సమీపంలో ఉన్న మిగతా బోట్ల వారు స్పందించారు. వెంటనే అక్కడికి చేరుకుని మునిగిపోయిన 40 మందిని రక్షించారు. మరోవైపు, విషయం తెలిసిన వారణాసి కలెక్టర్, పోలీసులు, స్థానిక ఎమ్మెల్యే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, యాత్రికులు నిన్న సాయంత్రం వారణాసి నుంచి నిడదవోలుకు తిరుగు పయనమయ్యారు.