Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూడ్రోజుల నుంచి వర్షం ఏకధాటిగా కురుస్తుంది. విత్తనాలేసే సమయంలో అదునకు వానలు కురవలేదు. ఇప్పుడేమో పండిన పంటలను మింగేస్తున్నయి. నర్సమ్మ ఊళ్లేకుపోయి వానలోనే ఇంట్లోకొచ్చి... ''ఈ వాన పాడుగాను ఎప్పుడు తక్కువయిద్దో ఏమో'' అనుకుంటూ తడిసిన నెత్తిని తుడుచుకుంటూ పత్తి చేను మీదనన్న గంతోగింతో వస్తదనుకుంటే ఈ యేడు ఏమి రానట్లుంది. అప్పు తీరదు. మిత్తి కట్టక తప్పదు. ఏందో గీ కాలం గిట్లయింది. పొయ్యి మీద బియ్యం పెట్టి వెంకటేష ఎటు పోయిండో అనుకుంటూ నర్సమ్మ బయటికి చూస్తున్నది. అప్పుడే ఒచ్చిన కొడుకును ''ఒరే వెంకటేశ దుకాణం పోయి ఒక కొబ్బరికాయ పట్టుకు రారా అయ్యా... మీ నాయినకు జబ్బు తక్కువ కావాలని చెర్వుగట్టు రామలింగేశ్వర సామికి మొక్కుకున్నరా... మయ్యగని జల్దిబొయ్యి అందుకు రాపో..'' అనుకుంటూ కొడుకును బతిమిలాడింది.
మీ నాయన మంచంల పడి నెలరోజులవుతుంది. ఆ దేవున్ని మొక్కితే జబ్బు తక్కువయ్యిదంట... అంటూ వంద రూపాయల నోటు ఇచ్చింది.
వెంకటేష్ కొబ్బరికాయ కొనుక్కొచ్చి ఇస్తూ.. ''అమ్మా... ఇయ్యాల నాకొక యాభై రూపాయలు కావాలనే, రేపు మా దోస్తులందరు సిన్మాకు పోతరంటనే... నేను కూడా పోతనే...'' అంటూ దీనంగా అడిగాడు.
సర్లే కొడుకా అని కొబ్బరికాయ తీసుకొని అడిగిన డబ్బులు ఇచ్చింది.
నర్సమ్మకు ఒక్కడే కొడుకు. ప్రేమగా చూసుకుంటది. ఏదడిగినా కాదనదు.
వెంకటేష్ బడికి పోయి సాయంత్రం ఇంటికొచ్చి.. ''అమ్మా ... అమ్మా... మా బడిలో ఇయ్యాల సార్లు ఒకటి చెప్పిండ్రే''..
''ఏం చెప్పిండ్రు నాయినా''... అంటూ ఇంటిముందు పొరకతో ఊడ్చుకుంటూ నర్సమ్మ అడిగింది.
''శుక్రవారం నాడు స్కూల్ నుంచి టూర్‌కు పోతమని, ఏమేమి తెచ్చుకోవాలో బోర్డు మీద కూడా రాఇంచ్చిండ్రు...'' అంటూ లోపలికెళ్ళి పుస్తకాలు ఉన్న బ్యాగును పుస్తకాలకు దెబ్బ తగిలిందా అన్నట్టు కింద పడేసిండు.
శ్రీకాంత్ పరిగెత్తుకుంటూ వచ్చి.. ''ఒరెరు వెంకటేష్ టూర్ కు ఏ రోజు పోయేది బడిలో చెప్పిండ్రారా ఈరోజు''?
''శుక్రవారం పోతారంట రా''
''శ్రీకాంత్ బడికి రాలేదేందని కూడా సార్లు అడిగిండ్రు రా'' అంటూ వెంకటేష్ ఏదో తినుకుంటూ శ్రీకాంత్‌కు కూడా ఇచ్చిండు.
వెంకటేష్, శ్రీకాంత్ ఒకటో తరగతి నుంచి దోస్తులు. గుణాలు కాస్తంత వేరుగా ఉంటాయి. అయినా స్నేహంగుంటరు.
శ్రీకాంత్ బాగా కష్టపడి చదువుతడు. ఏ పని చేయాలన్నా ఆలోచించి చేస్తడు.
''శుక్రవారం తొందరగా వస్తే బాగుండు రా వెంకటేష్'' అంటుండంగనే... మా అమ్మ పిలుస్తుందిరా అనుకుంటూ శ్రీకాంత్ వెళ్ళిపోయాడు శుక్రవారం అప్పుడే వచ్చింది.
తెల్లవారుజామున బస్సొచ్చింది.
పిల్లలందరూ ఒక్కొక్కరు స్కూల్‌కు చేరుకుంటున్నరు. పిల్లలను తల్లిదండ్రులు తీసుకొస్తున్నరు. జాగ్రత్తగా తీసుకుపోయి తీసుకురండి సార్ అంటూ టీచర్లకు చెప్తున్నరు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటము. అలాంటి భయం ఏమీ వద్దు. టూర్ ఏర్పాట్లు చేసిన కష్ణ సార్ సమాధానం చెప్పాడు.
నిన్న అందరిని ఒక తరగతి గదిలో కూర్చోబెట్టి క్రమశిక్షణతో ఉండాలని ఎటు వెళ్లినా చెప్పి వెళ్లాలని జాగ్రత్తలు చెప్పాము. నందు సార్ వివరంగా చెప్పాడు.
డబ్బులు ఎక్కువగా తీసుకురావద్దని మా హెచ్ఎం సార్ కూడా చెప్పారంటూ మరొకరు చెప్పారు.
బస్సు కదిలింది. పిల్లలంతా ఒక్కసారిగా మొత్తుకున్నారు. కొంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్‌కు చేయి ఊపుతూ టాటా చెప్పారు.
ఊరు దాటంగనే కేరింతలతో డ్యాన్స్ లే.... డాన్సులు... బస్సు ముందు భాగంలో అమ్మాయిలు, వెనుక భాగంలో అబ్బాయిలు కూర్చున్నారు. ఎప్పుడు నవ్వనివాళ్ళ ముఖాల్లో నవ్వులు పూస్తున్నాయి. బస్సు నిండా సంతోషమే. బస్సుకు కూడా సంతోషమే అన్నట్లుగా దూసుకెళ్తున్నది.
యాత్ర సాగిపోతున్నది. బస్సు ఆగిన ప్రతిచోట కొంతమంది పిల్లలు తిను బండారాలపై ఎగబడుతున్నరు. తినేటందుకే వచ్చినట్లు కనిపించిన ప్రతిదీ కడుపులో వేస్తున్నరు.
మరి కొంతమంది సార్ చెప్పినట్టు నోట్స్ తీసుకుని చారిత్రక విశేషాలు రాసుకుంటున్నరు.
వేయి స్తంభాల గుడిలోకి వెళ్ళగానే ఇది ఎవరు కట్టించారంటూ ఎదురైన భక్తులను అడుగుతున్నరు. భక్తులేమో అమాయకంగా చూస్తున్నరు. శ్రీకాంత్ మాత్రం అక్కడే నిలబడి చూస్తున్న ఓ వ్యక్తి దగ్గరకు వెళ్లి తనకు కావలసిన సమాచారం అడగ్గానే అన్నింటికీ సమాధానం చెప్పాడు.
ఓహో ఇది కాకతీయులు కట్టించారా...! రుద్రదేవుడు ఎంత అద్భుతంగా కట్టించాడు. ఆ విగ్రహాలను తాకి ఆనాటి శిల్పులు ఎంత నైపుణ్యంతో చేశారో కదా... ఎంత శ్రమధార పోశారో ...!
కొంతమంది ఫొటోలు దిగుతున్నరు. మరి కొంతమంది సెల్ఫీలతో...
వెంకటేష్ కనిపించిన ప్రతిదీ కడుపులో వేస్తున్నడు. మరి కొంతమంది విజ్ఞాన విషయాలను మెదడుకు మేత వేస్తున్నరు.
బస్సు ఊరి బయటకు వెళ్లి ఒక చెట్టు కింద రోడ్డు పక్కన ఆగింది. తెచ్చుకున్న లంచ్ బాక్స్‌లను విప్పి తింటున్నరు. పులిహోర, చపాతీలు, కొంతమంది పూరీలు తెచ్చుకొని తింటున్నరు. ఒకరు తెచ్చుకున్నవి మరొకరు పంచుకుంటున్నారు. అక్కడ అప్పుడు స్నేహం విరబూసింది. అందరూ హాయిగా తిన్నారు.
అందరూ బస్సెక్కారు. బస్సు కదిలింది.
నందు సార్ అందరినీ లెక్కించాడు. అందరూ ఉన్నారని నిర్ధారించుకున్నడు.
రాత్రి రామప్పలో నిద్ర. లక్నవరంలో నీటి అలల అందాలు కనువిందు చేశాయి. మల్లూరులో ఎత్తైన కొండపై దేవుడు. ఆ వనం నిండా వానర సైన్యం.
ఒరేరు పిల్లలు ఇవాళ మన హెచ్ఎం పుట్టినరోజు ఇక్కడే జరుపుకుందాం అనగానే చప్పట్లు మొగాయి. పిల్లలతో చెప్పిన పీఇటి సార్ హెచ్.మ్ తో కేక్ కట్ చేయించాడు. మేడారంలో సమ్మక్క సారక్కలను చూసుకొని రాత్రికి కాళేశ్వరంలో కాలక్షేపం. పొద్దున్నే గోదావరితో ముచ్చటించిండ్రు. ఇక బస్సు బయలు దేరింది. వేగంగా కదిలిపోతుంది. బస్సులో పాటల హోరు లేదు. ఇక డ్యాన్సులు ఎక్కడివి?
సార్ పాటలు వేయండి సార్ అంటూ కొంతమంది మొత్తుకుంటున్నరు.
ఒరేరు సార్లు కోపంతో ఉన్నరు ఎందుకురా? అంటూ ఒకరినొకరు గుసగుసలాడుతున్నరు.
మనం రాత్రి కాళేశ్వరంలో బస్సు దిగంగనే కడుపులో ఏవేవో వేయాలని బజార్లన్నీ తిర్గితిమి కదరా....
అప్పుడు సార్లు బాగా బాధపడ్డారురా.... నేను కూడా విన్నాను రా.. అంటూ అందులో నుంచే పిల్లలు చెప్పుకుంటున్నరు.
అవును రా నిజమే రా...
ఈ పిల్లలు చెప్పితే వినట్లేదు. మనం అనవసరంగా టూర్‌కు తీసుకొచ్చినం. మనం చెప్పితే వినంది, మన మీద గౌరవం లేనిది ఈ టూర్ ఎందుకు ఏర్పాటు చేయాలి సార్...?
ఇంట్లో తల్లిదండ్రులను పీడించి డబ్బులు తెచ్చినట్లుంది. ఇక మళ్లీ టూర్ అనేది తీయొద్దని రాత్రి అనుకుంటుంటే విన్నాను రా...
బస్సులో పాటలు కూడా వేయొద్దనుకున్నరు.
పిల్లలు ఒకరినొకరు మాట్లాడుకుంటున్నరు.
కొంతమంది ఇంటికి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఇంతలో కష్ణ సార్ లేచి నిలబడి 'రాత్రి మీరు ఏం చేశారో తెలుసు కదా ? మాకు ఎవరికీ చెప్పకుండానే బజార్లన్నీ తిరిగారు. భయం లేదు. క్రమశిక్షణ అసలే లేదు' అంటూ తీవ్రంగా మందలించాడు.
పిల్లలంతా ముఖం కిందికేశారు.
నిజమే ఇలా చేయకూడదు కదా అని కొంతమంది ఆలోచిస్తున్నరు.
సార్ ఇక అలా చేయం సార్ అంటూ అమ్మాయిలంతా ఒక్కసారిగా 'సారీ సార్' అని గట్టిగా చెప్పారు.
సర్లే ఈసారికి క్షమిస్తున్నాం, క్రమశిక్షణ తప్పొద్దు అంటూ పాటల ఆడియోను ఆన్ చేయమని సైగ చేయగానే డ్రైవర్ ఆన్ చేశాడు.
మళ్లీ డ్యాన్సులు. అరే ఇది ఏ ఊరు కావచ్చు రా? సార్లందరూ బస్సు దిగుతున్నరు? పిల్లలంతా అనుకుంటున్నరు...
ఇది చెన్నూర్ రా... నేను అక్కడ బోర్డు చూసినా... అని తరుణ్ అన్నడు.
సార్లందరూ టీ కోసం బస్సు దిగారు.
దూళికట్ట ఏ మార్గంలో వెళ్లాలో తెలియక ఎవరిని అడగాలని టీ తాగుతూనే కష్ణ సార్ ఆలోచిస్తున్నడు. అక్కడికి వచ్చిన ఒక వ్యక్తిని అడగ్గానే రూట్ మ్యాప్ గీసిచ్చిండు.
సార్లు బస్సు ఎక్కగానే... పిల్లలు మనమంతా ఇప్పుడు ధూళికట్ట వెళ్తున్నాం అనగానే ఆసక్తిగా విన్నారు. ఎప్పుడొస్తుందని ఆత్రుతతో అందరూ ఎదురు చూస్తున్నరు. చిన్న చిన్న ఊర్లు దాటుకుంటూ బస్సు వెళ్తున్నది. కష్ణ సార్ బస్సు దిగి ధూళికట్టకు ఎట్ల వెళ్లాలో అడుగుతున్నడు.
ఊరి బయట కళ్ళు గీసేటందుకు గౌడ్ ముస్తాదు కట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నడు. ధూళికట్టుకు ఎట్లా వెళ్లాలని అడగ్గానే వివరంగా చెప్పిండు.
గా మర్రి చెట్టు నుంచి ఎదురువైపుగా రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. బస్సయితే వెళ్ళదు అని చెప్పి వెళ్ళిపోయాడు.
మర్రి చెట్టు దగ్గర బస్సు ఆపి....
లంచ్ ఇక్కడే వండితే ఎలా ఉంటుందని హెడ్మాస్టర్, కష్ణ, నందు సార్ లు ఆలోచిస్తున్నరు....
ఆ మర్రి చెట్టు కింద కూర్చుని చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్లు కల్లు తాగుతున్నారు.
ఏమి సార్ ఇక్కడ వంట చేద్దామా? అమ్మాయిలు ఉన్నారు కదా! బాగుంటుందంటారా? అని బస్సు దిగి అక్కడే ఉన్న గౌడ్ ని అడగ్గానే...
వాళ్లు మిమ్మల్ని చూసి వెళ్ళిపోతారు సార్. ఏం పర్వాలేదు. ఈ చెట్టు కిందే వంట చేసుకోండి. ఇక్కడే చేదబావి కూడా ఉంది. మీకు ఏ ఇబ్బంది ఉండదు అనుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
ఎండ నడి నెత్తిపై ఉంది. ఇంత ఎండలో బౌద్ధ స్తూపం దగ్గరకు వెళ్లడం అవసరమా? నందు సార్ కష్ణ సార్‌తో అనగానే...
ఎలాగైనా వెళ్లాలి సార్ అంటూ బుద్ధుని బోధనలు పిల్లలు తెలుసుకుని బుద్ధిమంతులు కావాలి సార్ అని గట్టిగా చెప్పాడు ...
పిల్లలతో నడక సాగించారు. కొంతమంది పిల్లలు పరిగెత్తుతున్నారు. మరి కొంతమంది తీవ్రమైన ఎండ కావడంతో చిన్నగా నడుస్తున్నరు.
అక్కడే ఒక వాగు దాటి వెళ్ళాలి. ఆ నీళ్లను పిల్లలంతా చూడగానే కేరింతలు... చప్పట్లు...
ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకున్నరు. నీళ్లలో కేరింతలతో ఎగురుతుంటే ఒంటిపై నీళ్లు పడి బట్టలన్నీ తడిసిపోయాయి.
బుద్ధుని స్మారక స్థూపం దగ్గరకు చేరుకుని అక్కడ ఇటుకలన్నింటినీ పరిశీలించారు. వందల ఏండ్ల నాటివని పిల్లలకు చెప్పారు.
అవునా అన్నట్లు తదేకంగా పిల్లలు చూశారు.
పిల్లలందరిని కూర్చోమని చెప్పగానే నిశ్శబ్దంగా కూర్చున్నారు. ధూళికట్ట ప్రాముఖ్యాన్ని, గౌతమ బుద్ధుని గురించి కష్ణ, నందు సార్లు ఒకరి తర్వాత ఒకరు వివరంగా చెప్తున్నారు.
బుద్ధుడు అంటే ఎవరు రా... అని పక్కన కూర్చున్న తరుణ్ ను అడిగాడు వెంకటేష్.
బుద్ధుడు తెల్వదారా...?
దుఃఖానికి మూలం కోరికలే అని సోషల్ సార్ మొన్ననే కదరా చెప్పింది...
''ఒరేరు శ్రీకమ్, వెంకటేష్, తరుణ్ ఏం మాట్లాడుతున్నర్రా''..
''నేను మాట్లాడుతుంటే డిస్ట్రబ్ అవుతుంది రా''...
బుద్ధుడు ఎవరని వెంకటేష్ అడుగుతున్నడు సార్... అని తరుణ్ సమాధానం చెప్పాడు.
అవునా.... అయితే... ఈ పుస్తకం బుద్ధుని జీవితం గురించి ఉంది. వెంకటేష్‌కు ఇవ్వు అని నందు సార్ అందించాడు.
ఈ పుస్తకాన్ని చదువు, బుద్ధుని గురించి తెలుస్తుంది.
అందరి ముఖాల్లో ఆకలి కనిపిస్తుంది. వెంటనే బయలు దేరుదాం సార్ అంటూ నందు సార్ చెవిలో కష్ణ సార్ చెప్పాడు.
మళ్లీ మర్రి చెట్టు దగ్గరకు అందరూ బయలుదేరారు.
గుబురు చెట్ల పొదల్లో నుంచి ఒకరి వెంట ఒకరు నడుస్తున్నారు.
సార్ ఇక్కడ ఫొటోలు దిగుదాం అని కావ్య అనగానే ఫొటోలకు ఫోజులిచ్చుకుంటూ దిగిండ్రు. ఆ నీటి ప్రవాహంలో అందరూ తడిసి ముద్దయ్యారు. ఆకలి మరిచిపోయి ఆ నీళ్లలో నుంచి ఎవరూ వెళ్లడం లేదు.
ఒరే పిల్లలు మనం తొందరగా వెళ్ళాలి. మన హెడ్మాస్టర్ సార్ ఎదురు చూస్తుంటడు. కష్ణ సార్ పిల్లలకు చెప్పాడు.
ఒక్కరొక్కరు నీళ్లలో నుంచి బయటికెళ్ళి మర్రి చెట్టు వైపు నడుచుకుంటూ వెళ్లారు.
అందరూ భోజనాలకు కూర్చున్నరు. తొందరగా తినండి రా పిల్లలు, ఇప్పటికే ఆలస్యమైంది. నందు సార్ తొందర పెట్టాడు.
బస్సు బయలుదేరింది. కష్ణ సార్‌కు ఫోన్ పే నుంచి పేరెంట్స్ డబ్బులు పంపిస్తున్నరు. ఆ డబ్బులు ఇచ్చెయ్యాలి. అదో డిస్ట్రబ్... అనుకుంటూ ఎవరికి ఎన్ని డబ్బులు వచ్చాయో చూసుకుంటూ చికాకు పడుతున్నడు.
ఏం కష్ణ సార్ చాలా బిజీగా ఉన్నారు?
హెడ్మాస్టర్ సార్ పిల్లల వైపు చూసుకుంటూ అడిగాడు. దగ్గర కూర్చుంటే కాస్త నవ్వుకోవచ్చని పిలిచాడు.
పాపికొండలు టూర్‌కు పోయినప్పుడు ఈ ఫోన్ పే ఎక్కడిది సార్? టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సమస్యలు కూడా పెరుగుతున్నయి. పాటల హోరుతో బస్సు వేగంగా వెళ్తున్నది.
కొంతమంది ఫోన్లు చార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయ్యాయి.
కష్ణ సార్ ఫోన్ రింగ్ అవుతుంది. బస్సు శబ్దానికి సరిగా వినబడడం లేదు.
ఎవరు మాట్లాడేది? బస్సు శబ్దానికి మీ మాట వినబడటం లేదు అంటూ పాట సౌండ్‌ను తక్కువ చేయమని డ్రైవర్‌కు సైగ చేశాడు.
నేను సార్ వెంకటేష్ వాళ్ళ అమ్మను సార్. మావోని ఫోను మోగట్లేదు సార్ ...
వాళ్ల నాయనకు సీరియస్‌గా ఉందని చెప్పు సార్. హైదరాబాద్ తీస్క పోవాల్నట.....
చేతిలో చిల్లిగవ్వలేదు. డబ్బుల కోసం ఆ అయ్యా.. ఈ అయ్యా... కాళ్ళు మొక్కుతున్న అంటూ ఏడ్చడం ప్రారంభించింది.
అయ్యో.... అవునా... ఊరుకోమ్మా.....ఊరుకో...
వెంకటేష్‌కు ఈ విషయం చెప్తానులే... అంటూ ఓదార్చి ఫోన్ పెట్టేశాడు.
బస్సు వెనుక సీట్లో కూర్చున్న వెంకటేష్ దోస్తులతో నవ్వుకుంటూ ముచ్చట్లో మునిగిపోయాడు.
సార్లు టీ తాగాలని బస్సు ఆపారు. కిందికి దిగారు. వెంకటేశును కూడా కిందికి దిగమని కష్ణ సార్ పిలిచాడు.
ఏంది సార్ అని నవ్వుకుంటూ అడిగాడు.
ఏం లేదురా వెంకటేష్..
మీ అమ్మ ఫోన్ చేసింది. మీ నాన్నకు సీరియస్ గా ఉందంట. హైద్రాబాద్‌కు తీసుకుపోవాలట. ఇంట్లో డబ్బులు కూడా లెవ్వట..
''ఏడ్చుకుంటూ చెప్పింది రా''...
వెంకటేష్ కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరుగుతున్నాయి.
తన జీవితంలో ఎన్నడూ ఏడవలేదు.
తలవంచి కిందికి చూస్తున్నడు.
జీవితాన్ని సరదాగా గడిపేవాడు. ఇప్పుడు దుఃఖం ఉప్పొంగుతుంది. ఒకవేళ నాన్న చనిపోతే, నేను కారణమవుతానా..?
Excurssion డబ్బుల కోసం అమ్మ డబ్బులు ఇవ్వనంటే అన్నం తినకుండా అలిగి పడుకున్నాను. అంతకుముందు కూడా నా సరదాల కోసం ఇంట్లో డబ్బులన్నింటిని అమ్మతో కొట్లాడి అడుక్కున్న.
నాన్న లేకుంటే అమ్మ ఒంటరిదవుతుంది.
ఎలా జీవిస్తుంది? నేను నాన్న అని పిలవలేను కదా.....
నాలో ఉన్న కోరికలు ఈ పరిస్థితికి తెచ్చాయేమో.....
తన మనసులో అనేక ఘర్షణలు....
శ్రీకాంత్ ఆదివారాలు వధా చేయలేదు, పత్తి చేన్లు ఏరబోయేటోడు. ఊళ్లో న్యూస్ పేపర్లు పొద్దున్నే ఇంటింటికి తిరిగి వేసేవాడు.
పైసలు అట్లా సంపాయించుకుని ఇంట్లో కొంత ఇచ్చి.... టూర్ కు వచ్చిండు ... మరి నేను చేసింది ఏమిటి? నా విపరీత కోరికల కోసం అమ్మ నాన్నలను కష్టపెట్టిన. ధూళికట్టలో సార్ చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. దుఃఖానికి మూలం కోరికలని... తను వెళ్తున్న మార్గాన్ని చూసుకున్నడు. తప్పు మార్గమని, శ్రీకాంత్ వెళ్తున్న దారి సరైనదని తను అటువైపే వెళ్లాలనుకున్నడు.
బస్సు కదులుతుంటే బస్సెక్కాడు.
వెంకటేష్‌లో ఉన్న నిశ్శబ్దాన్ని అందరూ చూస్తున్నరు.
వాళ్ళ నాన్న గురించే ఆలోచిస్తున్నడు..
బస్సు చదువులమ్మ ఉండే వర్గల్ వైపు వెళ్తున్నది.
రేపటి ఉదయం కోసం వెంకటేష్ ఎదురు చూస్తున్నాడు...
నాన్న క్షేమంగా ఇంటికి రావాలని బస్సు కిటికీల్లోంచి బయటికి చూస్తూ...
తాను నడిసొచ్చిన తొవ్వ గురించి ఆలోచిస్తున్నాడు...
- పెరుమాళ్ళ ఆనంద్
9985389506