Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి విద్యుత్ ఉద్యోగుల హెచ్చరిక
- మింట్‌కాపౌండ్‌లో భారీ ధర్నా
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్ సంస్థల్ని ప్రయివేటీకరించే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం మానుకోకుంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎస్‌పీఈజేఏసీ) హెచ్చరించింది. విద్యుత్ సవరణ బిల్లు-2021ను పార్లమెంటులో ప్రవేశపెడితే కేంద్రప్రభుత్వం తనకు తాను మరణశాసనం రాసుకున్నట్టేనన్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల ఐక్య ఉద్యమాలకు సిద్ధమవుతున్నారనీ, కేంద్రం తక్షణం తన విధానాలను పున:స్సమీక్షించుకోవాలని సూచించారు. విద్యుత్ సంస్థల్లోని 25 కార్మిక సంఘాలతో కూడిన టీఎస్‌పీఈజేఏసీ ఆధ్వర్యంలో రెండ్రోజుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా మంగళవారంనాడిక్కడి మింట్‌కాంపౌండ్ తెలంగాణ చౌరస్తా వద్ద భారీ నిరసన ధర్నా, బహిరంగ సభ నిర్వహించారు. జేఏసీ చైర్మెన్ జీ సాయిబాబు (టీఈఈయూ-1104) అధ్యక్షతన జరిగిన ఈ ఆందోళనలో రాష్ట్ర నాయకులు ప్రభాకర్, సురేష్ (టీఎస్‌ఈఈయూ-327), కన్వీనర్ పి రత్నాకరరావు, పీ సదానందం (టీఎస్‌పీఈఏ), కో కన్వీనర్ పీ బీసిరెడ్డి, శ్రీనివాస్ (టీపీడీఈఏ), వైస్ చైర్మెన్లు ఎమ్ అనిల్‌కుమార్, వేణుగోపాల్ (టీఎస్‌ఈఏఈఏ), ఎమ్‌ఏ వజీర్ (టీఎస్‌పీఈయూ-1535), జాయింట్ సెక్రటరీలు వీ గోవర్థన్ (టీఎస్‌యూఈఈయూ-సీఐటీయూ), డి శ్యాంమనోహర్ (టీఎస్‌ఈఎస్సీ, ఎస్టీ ఈడబ్ల్యూఏ), ఎమ్ వెంకన్నగౌడ్ (టీఈబీసీఈడబ్ల్యూఏ), ఆర్ సుధాకర్‌రెడ్డి (టీఈఓసీఈడబ్ల్యూఏ), ఎమ్ రాంజీ (ఎస్‌టీఈడబ్ల్యూఏ), ఎమ్ తులసీనాగరాణి (ఈడబ్ల్యూడబ్ల్యూఏ), కరుణాకర్‌రెడ్డి (టీఈఏఎస్‌ఏ), నెహ్రూ (టీవీఈఏ), లోహిత్ ఆనంద్ (టీఎస్‌పీఈడబ్ల్యూఏ), మోసెస్ (టీఈ ఎస్సీ అండ్ ఎస్టీ డీసీ ఈఏ), సత్యనారాయణరావు (జెఎన్‌సీ టీఈపీఏ) తదితరులు మాట్లాడారు. వరంగల్‌లోని టీఎస్‌ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వద్ద కూడా భారీ ధర్నా నిర్వహించారు. కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, ఉద్యోగ, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తున్నట్టు ప్రకటించారు. రెండ్రోజుల సమ్మె సక్సెస్ అయ్యిందనీ, ప్రజాగ్రహాన్ని కేంద్రం గుర్తించాలని చెప్పారు. దశాబ్దాలుగా దేశాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న రైల్వే, విద్యుత్, బొగ్గు, స్టీల్, ఆయిల్, టెలికం, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సహా యావత్ ప్రభుత్వరంగాన్ని కేంద్రప్రభుత్వం ప్రయివేటీకరిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేటురంగంలో పోటీ ఉంటే ధరలు తగ్గుతాయనే భ్రమల్ని కేంద్రం ప్రచారం చేస్తున్నదని ఎద్దేవా చేశారు. ఏరంగంలో ధరలు తగ్గాయో స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. ప్రయివేటీకరణకు ఒడిస్సాలోని డిస్కంలు బలయ్యాయనీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో విద్యుత్ ఫ్రాంచైజ్ వ్యవస్థ సరైన ఫలితాలు ఇవ్వకపోవడంతో రద్దు చేశారని గుర్తుచేశారు. 13 రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకించాయనీ, 25 లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు, ఇంజినీర్లు, కార్మికులు ఎన్‌సీసీఓఈఈఈ ఆధ్వర్యంలో సుదీర్ఘ పోరాటం చేస్తున్నారని వివరించారు. విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు.