Sat 10 Apr 23:06:09.632693 2021
Authorization
మీ ఆకాశం నుంచి
సూర్యుణ్ణి చంద్రుణ్ణి
ఇవ్వమని అడగను.
మీ వ్యవసాయ క్షేత్రాన్ని,భూమిని
మీ ఎత్తైన భవనాలను
మీ దేవుళ్ళను మీ ఆచారాలను
కులాలను తెగలను
తల్లిని సోదరీమణులను కూతుర్లను
అడగను.
మనిషిగా నా హక్కులను మాత్రమే
నేను అడుగుతాను.
నా ప్రతి శ్వాస
మీ గ్రంథాల్లో సంప్రదాయాల్లో
స్వర్గనరకాలలో కాలుష్యపు భయాన్ని
తీవ్రమయిన ప్రకంపనలను కలిగిస్తుంది
నన్ను దోచెయ్యడానికి నరికెయ్యడానికి
మా ఇండ్లను బూడిద చెయ్యడానికి
మీ చేతులు కబంధ హస్తాలవుతాయి.
కానీ స్నేహితులారా!
తూర్పుదిక్కున సూర్యుడిలా పాతేసిన
నా అక్షరాల్ని హక్కుల్ని మీరు తుంచెయ్యగలరా?
కులకలహాల కాలుష్యంతో
నగరం తరువాత నగరాన్ని
గ్రామం తరువాత గ్రామాన్ని
మనిషి తరువాత మనిషిని
కాటువేస్తున్నారుజి
అందుకే తన హక్కుల్ని అడుగుతున్నాడు
ఈ అస్పశ్యుడు బహిష్కతుడు
నాకు నా హక్కులు కావాలి
నా హక్కులు నాకు ఇవ్వండి.
మీ పవిత్రగ్రంథాలు అన్నిటిని
రైలు పట్టాల్లా పెకిలించి వేస్తాను
నీతి తప్పిన మీ చట్టాల్ని
సిటీ బస్సుని తగులబెట్టినట్లు తగులబెట్టేస్తాను
మిత్రులారా!
నా హక్కులు సూర్యుడిలా
ఉదయిస్తున్నాయి
ఈ సూర్యోదయాన్ని
మీరు ఆపగలరా?
(శరన్ కుమార్ లింబాలే మరాఠీ నవలా రచయిత, కవి, విమర్శకుడు. 40 గ్రంథాలు రచించిన ఈ మరాఠీ దళిత సాహితీవేత్త సనాతన్ నవలకు బిర్లా ఫౌండేషన్ వారు 2020 సంవత్సరానికి సరస్వతీ సన్మాన్ పురస్కారాన్ని ప్రకటించారు)
మరాఠీ: శరన్ కుమార్ లింబాలే
తెలుగు: చింతపట్ల సుదర్శన్