ఇపుడు నేను శిల్పిగా మారి నన్ను నేను కొత్తగా చెక్కుకుంటున్నాను. ఓ మనిషీగా మలుచుకుంటున్నాను. స్వార్ధపు పెచ్చులను ఊడబీకుకుంటూ.. కాస్తంత మానవత్వం ఉన్న మనిషిలా నన్నునేను మార్చుకుంటున్నాను
ఒక్కో ఉలిదెబ్బ తగులుతుంటే... నా హదయంలో గూడుకట్టుకొని ఉన్న బాధలన్ని ఎండిపోయిన ఆకుల్లా రాలిపోయి సంకల్పం మనోధైర్యం అనే మహాబలాలు ఎదలో నిండుకుంటున్నాయి. ఊసరవెల్లిలా రంగులు మార్చే గుణాల్ని పులుముకున్న తనువిప్పుడు... స్వచ్ఛమైన నదీ జలంలా మారి పారుతుంది.
శూన్యం అనే చీకటి శిఖరాలను రాల్చుకుంటు వెలుగు పూలు పూయిస్తున్నాను. చిరునవ్వుల ముఖాన్ని చెక్కుతున్నాను. సహాయం చేసే చేతుల్ని... మంచులాంటి మనసుని... చల్లని చూపును పంచే కళ్లని చెక్కుతున్నాను. అందమైన హరివిల్లులాంటి రంగుల్ని అద్దుతున్నాను.
నేనిప్పుడు వెలుగులు పంచె మిణుగురు పురుగై... చీకట్లను చీల్చుతున్నాను. ప్రేమానుబంధాలు అనే పిచ్చుక గూల్లను కట్టి రెక్కలిరిగిన పక్షులను అక్కున చేర్చుకుంటున్నాను. నేనిప్పుడు మారిన మనిషిని కదా....! మార్పు ఏనాటికైనా మంచిదే. - అశోక్ గోనె, 9441317361