Sun 22 Aug 05:11:06.86501 2021
Authorization
వాడెవడో.. ప్రపంచాన్ని జయించీ
కడకు శవపేటికలోంచి ఒట్డి చేతులు చూపిస్తూ వెళ్లిపోయినట్టు
మనమూ ఎలా వచ్చామో ..
అలానే వెళ్లిపోదాం ఒట్టి చేతులతోనే ..
యిక్కడ ప్రతి జ్ఞాపకం బ్రతుకంత బరువు
బతికేపోదాం ఉన్నన్నాళ్లూ యీ అద్దింట్లో
హాయిగా పరిమళాలు పూసే పూదోటలా .. !
మనకన్నా ముందు
ఎన్నెన్ని కుటుంబాలు యీ యింట కువకువలాడాయో..
తలాయింత ఉగాది పచ్చడి పంచుకున్నట్టు
ఎన్నెన్ని జ్ఞాపకాలు పంచుకున్నాయో..
ఏ మూలో రాలిపడ్డ చీకటి మరకల్ని చెమటతో అలికి.. వాళ్లు
యీ పచ్చని నారుమడిని మనకందించిపోయారు ప్రేమతో..!
తమ రెక్కలపై వేకువను మోసుకొచ్చి
మన యింటిముంగిట కుమ్మరించే పక్షులూ -
వసంతకాలపు పూలగంధాల్ని ఒంటికిపూస్తూ వీచే పిల్లగాలులూ -
మునులెవరో తరాల దీర్ఘతపస్సులో మునిగిపోయినట్టున్న కొండలూ-
నిత్యమూ ఓ జీవన వేదాన్ని వల్లెవేస్తున్నట్టున్న నదులూ-
ఇలా.. ప్రేమ పొదరిల్లులాంటీ యింటిని
పూలపళ్లెంలో పెట్టి మనకిచ్చే పోయారు ప్రేమతో ..!
ప్రతిరోజూ ..
ఏడుగుర్రాల రథమెక్కి వచ్చి వేకువ కళ్లాపి చల్లిపోతున్నాడు సూరీడు
నెలవంక పడవ మీద వచ్చి చుక్కల ముగ్గేసిపోతున్నాడు చందురుడు
ఆకాశం కాన్వాసు మీద
రోజుకో ఊహాచిత్రం గీసే పోతున్నాయి మబ్బులు
ఇంత ?అందగా చిగురు తొడిగిన యీ యింటని చిక్కేసిపోతామా..?
పచ్చనాకుల ప్రమిదల్లో శిరసూపుతున్న
యీ పూలదీపాలను ఆర్పేసిపోతామా ..?
మనం పోయాక రేపు వచ్చే వాళ్లు మనలాగే బతకొద్దూ..!
అందుకే బతకనిద్దాం.. బతుకునిద్దాం
ప్రతిదినాన్ని ఒక కార్తీకదీపం జేసీ కాలంనదిలో విడిచిపెడదాం
దాన్ని రేపటిరేయి చుక్కల ఆకాశమని పిలుద్దాం
ప్రతి రుతువునూ వంచి పూవులా వాసన జూసే పోదాం
కరోనాలూ కాలుష్యాలూ కాటేయకుండా
యీ యింటిని కాపాడుకోవాలని
రేపటి తరాలకు ఓ మాట చెప్పేపోదాం
పోయేటపుడు మాత్రం మన గురుతుగా
యీ ఇంటిమీద ఓ పచ్చనిజెండా ఎగరేసే పోదాం !!
- సిరికి స్వామినాయుడు
94940 10330