Sat 30 Oct 22:39:48.600975 2021
Authorization
ఎవరి సంభాషణైనా
నిష్క్రమణకు కారణం కారాదు.
ఒక గొప్ప
చరిత్రను ఆవిష్కరించి పోవాలె !
చెప్పే మాటలు..
చేసే చేష్టలు..
తూర్పు కొండల నట్టనడుమ
'కొత్తపొద్దు' పొడిసినట్లుండాలె !
సంక్షోభాలను మాపి
సుడిగుండాలన్నిటిని పోగొట్టాలె !!
వాక్దానాల నసేగాని
చేతల పస అస్సల్లేని
మాటకారితనం
బూడిదలో పండిబొర్రె పిల్లి సాత్రం !
పదవి..
పైత్యం కొసెల్లడానికి
ఎందుకింత ప్రకటనల నోటి దురద !
ఓటర్లెప్పుడో శొంఠిపొడి
నాకిచ్చి పసరంత కక్కవోత్తరు !!
ఎంత..
కోరలున్న కోడె నాగుంబామైనా
ఎప్పుడో ఒక్కప్పుడు ఎక్కడో చోట
గుట్టుగ కుబుసం ఇడువాల్సిందే !
గొప్ప గొప్పోల్లయే
అల్కగ పదవి గోచీలూసిపోయినరు !!
ఓ నియంతా నువ్వెంత !?
పది వరుస గెలుపుల కంటె
ఒక్క ఓటమి..
దూలాబ్ దీసుకున్నంత పనిసేత్తది !
విపరీత పోకడలు..
తొవ్వల పోట్రౌతు తాకిన తరీఖ !!
ఏ చర్చల్లేకుండా
పాలకవర్గం నిర్ణయాలన్ని
'విడిదిగది' లో అమోదించబడ్డప్పుడు
మేమెన్ని తరాజులు,బాట్లు
మార్చి మార్చి మల్లమల్ల జోకినా
పదవీ పాసంగం భవదీయుల వైపే!
ఇక్కడ..
కష్టాలు,త్యాగాలు గాలి ముచ్చట
కుర్సీ,అంకెలు,ఆదాయమే ప్రధానం !
కాళ్ళల్ల కట్టెవెట్టినోడే కామ్ దార్ !!
కాలమెప్పుడూ..
ఎవరిని కనుకరించదు,క్షమించదు
సమయం చూసి..
గట్టిగ మోసేత్తోని గుద్ది వంగవెడ్తది !!
అంకె బలం, లెక్కల్లేని అర్థ బలగం
ఎకసెక్కాలు,ఎటకారాలు
ఎక్కడ్లేని చమత్కారం, అహంకారం
మిడిసిపాటు, ఎవరన్నా లెక్కలేనితనం
అన్నీ లెక్కలు సరి తేలేవరకే !
- అశోక్ అవారి, 9000576581