Sat 18 Dec 23:29:28.95527 2021
Authorization
ప్రియతమా
నా హదయమా
నను గెలిచిన సర్వస్వమా
నువ్వు చూడగలిగితే
నీ మనోనేత్రాలకు
నా అంతరాల్లో పొంగిపొర్లుతున్న
అవ్యక్త వేదన
స్పష్టంగా కనిపిస్తుంది....
నీవు వినగలిగితే
నీ మనసు సన్నిధికి
నా అనువణువున అలజడి పుట్టిస్తున్న
అశాంత స్పందన
వివరంగా వినిపిస్తుంది....
నిజం!
నేను నిజం....
నా ప్రేమ నిజం....
ఈ నిజాన్ని బతికించమని
వేడుకుంటున్న
నా ఈ ఆవేదన
నీకు నివేదన....
తీరని ఆశలతో
నీకై శ్వాసిస్తున్నాను.....
తీరని దాహమై
నీకోసం తపిస్తున్నాను.....
నీ శీతల ఊహాలతో
శూన్యమైన నా హదయాన్ని
ఊరడించుకుంటున్నాను....
నీ హేమంత తుషారాలతో
ఎడారిగా మారిన గుండెలను
ఓదార్చుకుంటున్నాను.....
చిక్కటి చీకటి
వెలుగులకై ఎదురుచూసినట్టు
పొక్కిలైన వాకిలి
తొలకరికై తొంగి చూసినట్టు
ఎండమావులు
ఒయాసిస్సులను ఆశించినట్టు...
నీకై నేను
ప్రతీ క్షణం
వెయ్యి కళ్ళ వీక్షణమౌతుంటాను....
క్షణాలు కరిగిపోతున్నాయి
జీవితం తరిగిపోతోంది
మనసు నీరస పడుతోంది
వయసు దిగులు చెందుతోంది
కలలు క్రుంగి పోతున్నాయి
ప్రశ్న నిరవధికమౌతోంది
యుద్దం అనివార్యమవుతోంది
దుఖం నిరంతరమౌతోంది ??
ఇదేనా జీవితం?
ఇదేనా నా ప్రేమకు ఫలితం!?
ప్రియా..
ఎడబాటును జయించలేక పోయాను
సంఘర్షణగా మిగిలిపోయాను....
అలసి సొలసి పోయాను
నిశ్చలమై నిలబడిపోయాను.....
ఆవును!
నీకోసం కుమిలిపోయాను.....
బతుకంతా
నిరవధికంగా పరుచుకున్న
బాధల బరువును మోస్తూ
ఏ మలుపులో ఆగిపోవాలో ??
ఏ మజిలీగా మిగిలిపోవాలో ???
నిర్ణయం నీదే ప్రియా !
-పొన్నం రవిచంద్ర, 9440077499