Sat 05 Feb 22:56:03.480102 2022
Authorization
త్యాగాలన్నీ..
స్థూపాలకు పరిమితమైపోయినై
సందర్భోచితంగ నాల్గుపూలు జల్లే
సంస్మరణ స్థలాలుగ వాసికెక్కినయి.
స్వరాష్ట్రమే ఏకైక లక్ష్యంగ
ఒక్కచోట జట్టుగ నిలబడ్డోళ్ళు
ఇప్పుడు సంఘాలుగ వర్గీకరించబడ్డరు.
విభజించి పాలించుడు
ఇంకా మరుగునపడని విద్య !
అస్మదీయులంత అమాత్యులై
భవదీయులంత..
పేనంమీంచి పొయ్యిల వడ్డట్టు
ఫలాల పంపకాల్లో..
పేలాల్లెక్క ఎక్కడెక్కడో ఎగిరిపడ్డరు !
బుల్లెట్లకు, లాఠీదెబ్బలకు
కమిలిన ఎముకల గూళ్ళ ఎనుక
బతుకుతెరువుందని సెప్తె
సకల జనుల సమ్మె జేసినం.
నీళ్ళు,నిధులు,ఉద్యోగాలంటూ
తెలం'గానా'నికి
శరీరాల్ని ఇంధనంగ మండించినం.
ఉప్పిడి,ఉపాసముండి
సడకులమీద సమరం జేసినం.
తుక్కపెక్క అన్నం మెత్కులైవుడ్కినం.
ఉప్పెనల్ని,ఉత్పాతాల్ని
గుండెల్లో దాసుకొని
సాగరహారాలు సగర్వంగ జేసినం !
అరెస్టులను,అడ్డంకులను దాటి
మిలియన్ మార్చిల
నిప్పుకణికలై మెరిసి మురిసినం !
ప్రత్యేకానికి..
ధ్వజస్తంభమై నిల్సినోళ్ళు
చివరికి కార్యకర్తలై
పార్టీజెండాలు మోస్తూ
ఆగమన సూచికలై నిలబడ్డరు !
ఓటర్లంత ఎగవడి
గెలిపిచ్చిన శాసనకర్తలు
అధినాయక కటాక్షం కోసం
తలకిందుల తాపసులై
మోక్షం కోసం తండ్లాడుతున్నరు.
ఉద్యమం..
అధికారం గొడుగు కింద సేరితే
మోకాలొడ్డిన ద్రోహులకు
అగ్రతాంబూలాలు దక్కుతున్నయి.
రాజు కొట్లాడి గెలిత్తే
రాజ్యం ఏలువడిలుంటది.
ఓడితే వ్యూహం పదునెక్కుతది.
సైనికుని సేతుల మాత్రం
ఎప్పటికీ ఆయుధమే మిగులుతది.
రాజకీయాలల్లజి
రంగు,రూపు,స్వభావం మార్సుకున్న
పార్టీజెండాలు,పదవుల
ఊసరవెల్లులై ఎవరినైన ఊరిత్తరు !
ఓ కవీ ! ఒక్కటి మన్సులవెట్టుకో !!
పాలకపక్షం ప్రతిపక్షమైనా
ప్రతిపక్షం పాలకపక్షమైనా
పాలకపక్షం పాలకపక్షమైనా
సమస్యలు ఉండనే ఉంటయి.
సజనకారులకు..
పురిటినొప్పులు దప్పనేదప్పయి.
పీడితుల తరపున కనవడని
కవనయుద్ధం సేసుడే ఉంటది!
కేవలం భౌగోళికంగ
హద్దులు గీయబడ్డ తెలంగాణల
ఆఖరోనికి ఫలాలు అందేదాక
పోరాటం ఇంకా మిగిలే ఉంటది.!
- అశోక్ అవారి, 9000576581