నిశ్శబ్దంగా నన్ను నేనే ముందేసుకొని పదేపదే చదువుకొంటున్నాను లోపలి పేజిల్ని ఆరగా ఆరగా బిగ్గరగా చదువుకొంటూవుంటాను కొన్ని పేజీలు అప్పుడే అచ్చులోంచి వచ్చినంత తాజావాసనల్తో మరికొన్ని పేజీలు చెదపట్టి చివికిపోయి పాతవాసనల్తో
కాలపు కోసలకు వేలాడుతూ ఇన్నేళ్లు గడిపేసిన తరువాత బొట్లు బొట్లుగా రాలుతున్న ఆలోచనల్లోంచి నీటితాళ్ళు పెనుకుంటూ దాటాల్సిన నదికి ఎదురుగా కూర్చున్నాను నదికి ఆవలిగట్టున ఉన్నదేదో స్పష్టాస్పష్టంగా అవగతమవుతోంది గుండెల్లో బిగించిన లంగరు నుండి విముక్తి కోసం తెప్ప ఊగిసలాడుతోంది
విస్మతమవుతున్నదాన్నిజి పొగుచేసుకొనే క్రమంలో జీవితం మీద పేరుకుపోయిన దుమ్ము ధూళిని వదిలించుకోవాలి జీర్ణమవుతున్నదేదో పరకాయించాలి అర్ధంతరంగా ఆగిపోయిన అక్షరాల్లోంచో సగం గీసి వదిలేసిన బొమ్మల్లోంచో హడావిడిగా లేచి వెళ్లిపోతూ కంచంలో మిగిల్చిన ముద్ద గురించో మళ్లీ మళ్లీ వెనుక్కు తిరిగి చూసుకోవాలి