Sat 12 Mar 23:36:50.568571 2022
Authorization
గెలుపు అనేది కొండంత ఉత్సాహాన్ని ఇస్తుంది ఎవరికైనా. అసలు గెలవటం అంటే ఏమిటో నిర్వచించుకోవాలి మనం. ఏ పోటీ లేకుండానే ఒక్కో సారి మనం గెలుపు ఉత్సాహాన్ని , ఆనందాన్ని పొందుతుంటాము. గెలుపును విజయమని కూడా చెబుతాము. విజయమంటే పూర్వం రాజులు, రాజ్యాలకోసం యుద్ధాలు చేసి ఎదుటి రాజ్యాన్ని ఆక్రమించుకోవటమే విజయంగా ప్రకటించేవారు. అలాంటి విజయాలు పొందిన దినాలను పర్వదినాలుగా పండుగలు ఏర్పడటమూ మనం చూస్తాము. విజయం అనేది పోటీ పడటంలోంచి వస్తుంది. ఆటల్లో పోటీ వుంటుంది. విద్యా పరీక్షల్లోనూ పోటీ వుంటుంది. వేగంలో పోటీ, వాదంలో పోటీ, గానంలో పోటీ, కుస్తీ పోటీ, కండబలంలో పోటీ, బుద్ది బలంలోనూ పోటీ... ఇలా అనేక పోటీలు వున్నాయి. ప్రతి పోటీలోనూ గెలుపు ఓటములు వుంటాయి. ఏ గెలుపూ శాశ్వతం కానట్లే ఏ ఓటమీ శాశ్వతం కాదు.
అయితే శాశ్వతంగా కొనసాగేది మన వ్యవస్తలో పోటీ మాత్రమే. నెగ్గిన వాడికి పట్టపగ్గాలు లేకుండా వ్యవహరిస్తాడు. ఓడినవారు కొందరు నిరాశకు లోనయి కుంగిపోతారు. మరికొందరు కసితో రగిలిపోతారు. ఇంకొందరు, ఓటిమి కారణాలను సమీక్షించుకుని, పాఠాలు నేర్చుకుని తిరిగి గెెలుపుకోసం ప్రయత్నాలు మొదలేస్తారు. గెలిచిన వారు, భవిష్యత్తులో ఓటమి కలగకుండా జాగరూకులై వుంటారు. ఇవి ఆటలు, పాటలు అయితే పెద్దగా సమస్య వుండదు. రాజ్యానికి, అధికారానికి సంబంధించినవి అయితే మరింత ప్రాధ్యాన్యతను సంతరించుకుంటాయి. అధికారమూ ఆధిపత్యము అనేది ఎలాగైనా పొందాలనే కోర్కె చాలా మందిలో వుంటుంది. అంతేకాదు, కొన్ని బృందాలు, సమూహాలు, వర్గాలు, వారి ప్రయోజనాలు నెరవేర్చి పెట్టడానికి కొందరు వ్యక్తుల్ని అధికారంలోకి తెచ్చే పనికి పూనుకుంటాయి. ఆ రకంగా గెలుపొందిన వారు వారి ప్రయోజనాలను చక్కబెడుతూ వుంటారు. ఇదంతా రాజ్యానికి చెందిన అధికారం కోసం జరిగే పోటీలో మనం చూస్తాం. ఇప్పుడు రాజ్యాలు లేకపోయినా, ప్రజాస్వామ్యమని పేరుచెప్పినా పోటీ, గెలుపులు సాధారణంగానే ఉంటాయి. ఇక ఇప్పుడు ఎన్నికలలో పోటీ ఎవరైనా చేయవచ్చని చెబుతున్నప్పటికీ గెలుపును పొందే పరిస్థితులు కొందరికే వుంటాయనే విషయం అందరికీ తెలిసినదే.
గెలవడం కోసం మనం ఎన్నిసార్లు మనుషులంగా, నిజాయితీని, నీతిని, ధర్మాన్ని, న్యాయాన్ని ఫణంగా పెడతామో! మన ఎన్నికల సందర్భంలో డబ్బును, మద్యాన్ని, కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, అన్నింటినీ పోటీలో తమకు బదులుగా నిలబెడతాం. అంతేకాదు బెదిరింపులకు, బల ప్రయోగాలకు, హతమార్చడానికి హత్యలకూ పూనుకుంటాము. ఇవన్నీ ప్రయోగించిన మీదట గెలిచినది ఎవరని ఒకసారి ప్రశ్నించుకుంటే వ్యక్తులది గెలుపు కాదని తెలిసి పోతుంది. అపుడు గెలవటమనేది నిలువెత్తు ఓటమిలా కనపడుతుంది.
కాబట్టి గెలుపు అనగానే ఎవరు, ఎలా, ఎవరి కోసం గెలిచారు అనేది రాజ్యాధికారానికి సంబంధించి ముఖ్యమైన విషయంగా వుంటుంది. ఇక వైయక్తికమైన విజయాలు, ఇతర ప్రక్రియలలో గెలుపులను కూడా మనం విశ్లేషించుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ గెలుపు అనేది ఒక నూతనోత్తేజాన్ని ఇస్తుంది. అందుకే ఈ గెలుపోటములను విమర్శకులు ఏమంటారంటే, 'గెలుపు నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తే, ఓటమి నీకు ప్రపంచాన్ని పరిచయం చేస్తుందని' చెబుతారు. కాబట్టి గెలుపు ఓటములు నుండి పాఠాలను తీసుకుని భవిష్యత్తును నిర్మించుకోవటమే మనం నిరంతరం చేయాల్సిన పని. ఒకటి గెలవగానే గెలిచేది మరోటి వుండనే వుంటుంది. అనంతమైన సామాజిక పరిణామంలో వెనక్కు తిరగకుండా ముందుకు మునుముందుకు కదలిపోవడమే నిజమైన గెలుపు. విలువలను, మానవీయతను వొదిలివేయటమే ఓటమి.