ఆకలిగొన్న పేదల డొక్కలు అడుక్కు తింటున్న బాలుడి రెక్కలు పంటి కింద దాచిన పడతి బాధలు సాక్షిగా ఈ రాజ్యం విఫలమైందంటాను....!
చెరచబడ్డ స్త్రీ అరుపులు ఖూనీ చేయబడ్డ అమాయకుడి పిడికిలి అన్యాయానికి గురవుతున్న గుడిసెల కథలే దష్టాంతాలుగా ఇది ప్రజాస్వామ్యం కాదంటాను...?
బలవంతుడి పాదాల కాడి కుక్కలు నేరస్థుడికి సపర్యలు చేసే బానిసలు లేనోడిపై ఎగిరెగిరి పడే ఎదవలే ఏతులు కొడుతుంటే ఇహ ఈ న్యాయస్థానం ఉన్నది ఎందుకంటాను...??
చట్టం చట్టం అంటూ అరవటమే తప్ప చట్టాన్ని మీరిన ఏ గట్టివానికి జరిగిందేమిటి..? చట్టాన్ని మన్నిస్తూ గౌరవిస్తూ బతుకుతున్న బడుగు వర్గాలకు ఇన్నేళ్లలో ఒరిగిందేమిటంటాను...??
ఆధిపత్యం లేని ఊరెక్కడ అంతులేని కథలకు చివరెక్కడంట.. చీకాకు పరిచే ధనవంతుల బలుపుని అణచివేసిన ఒక్క అధికారి పేరు చెప్పమంటాను...??
కోటానుకోట్ల రూపాయలు సహజ వనరుల్ని మింగెడి వాడినొదిలేసి, ఆకలికై జేబు కొడితే జైలులేసి కర మగం వలె చూసే ఇదేం సమాజమంటాను...!!
అరణ్యనీతినే అమలు చేస్తునప్పుడు సమానత్వం అమలు సాధ్యం కానప్పుడు న్యాయం అనేది బలాన్ని బట్టి మారుతున్నప్పుడు అంతంత చట్టాలు, పుస్తకాలుండి లాభమేంటంటాను...!!