Mon 27 Jun 04:38:07.584097 2022
Authorization
వెచ్చని పచ్చనిచీర కట్టుకొని
కన్నుల్లో కైపుల్ని నింపుకొని
కవ్విస్తూ వుంటాయి
అటేపు కొండలు
ఎంత ముద్దుగా బొద్దుగా వుంటాయో
పొద్దు పొద్దున్నే సూత్తూనే వుంటానా
ఇంతలోనే పొద్దువాలిపోద్ది
మురిసి మైమరుస్తూ బ్రతుకంతా
ఎదురు చూపుల ప్రేమపక్షవుద్ది
ఎక్కుతెగాని ఎత్తులు
దిగితేగాని లోతులు తెల్వదాయే
కాలం కాళ్లను కట్టేసినట్టు
నేనటు పోయెట్టులేదు
దారులన్నీ మూసుకు పోయినట్టు
ఎప్పుడూ ఏవో తెలవని ముళ్ల కంచెలు
ఆశ గుదిబండై బరువెక్కుద్ది
రకతం సలసల సలుపుతూనే వుంటది
తనువు తన్లాడుతూనే వుంటది
తీరని దూరపు ముచ్చట్లన్నీ
సిల్లుబడ్డ కుండలోంచి
జరజరా జారిపోతుంటయి
కోరికలకు రెక్కల్ని తొడిగి
గిజిగాడిలా శ్రమించినా
దిగులుగూడు మారదాయే
దూరమెపుడూ
చిక్కగా చక్కగా నునుపుగా
కళ్ల బడుతూనే వుంటదికదా..
మిన్ను విరిగి మీద పడ్డట్టు
ఎదలో ఎప్పుడూ ఏదో మోయలేని బాధ
అశువులను ఒలికిన కళ్ళు
తేలికవ్వాలి..తేటతెల్లం కావాలి
బరువు తగ్గకుంటే..
ఇంకాస్త బోరుమని ఏడ్వు
పొరలు పొరలుగా తొలగిన మసకలు
దశ్యాలను ఫ్రస్ఫుటం చేస్తుంటయి
దూరపు కొండల్ని వొక్కపాలె
తనువును నిలువెల్లా విరుచుకుని చూడు
భ్రమలన్నీ
శిథిలమైన మట్టి గోడల్లా
పెళ పెళా రాలిపోతాయి
చూపులు నగపునీతమవ్వటానికి
రెప్పపాటు కాలం చాలదూ
నువ్విప్పుడు నిలబడ్డ చోటే
నీడల ఊడల చెట్టయితది
ప్రశాంతంగా సేదతీరుతావు
సత్యం బోధ పడింది కదా..
కొండనాలుక కూడా కోయిలై కూస్తాంటది
ఇక దూరపు కొండల్ని నువ్వెప్పటికీ ఎక్కవు
కోర్కెల దీపం కొండెక్కుతుంది..!
- డా.కటుకోఝ్వల రమేష్
9949083327