మోసెటోని మీదే మొద్దేసినట్టు కూలవడ్డోని ముందు అప్పుల కుప్ప పోసినట్టు బతుకు భారమయిన కాలం
వాడేమో ఇటుకమీద ఇటుక పేరుస్తూ పునాదుల్లేని కలలమేడ అవుతాడు ఆమె పని ఉన్ననాడు మెతుకు భోంచేసి దొరకన్నాడు ఉపవాసం అంటుంది నా కూలోడి రోజు కూలీ మీద కన్నువడ్డ ఢిల్లీ పొద్దుకు ఆకలెక్కువ చేతిలో పిడికెడు ముద్ద కనబడితే తన్నుకుపోయే డేగ చూపై నెత్తిమీదే తిరుగుతున్నది
రెక్కల కష్టానికి కూలీ సొమ్ము సరితూగని రాజ్యం పీకమీద కత్తి పెట్టి కాళ్ళున్నోడికి కార్లున్నోడికి సమన్యాయం రుద్దుతున్నది
వంటింటి పాకశాస్త్రం కిరాణకొట్టు నూనె డబ్బాలో మూల్గుతున్నది సబ్బు సౌదల వాడకం కుబుసం వొదిలిన కాలనాగై బుసకొడుతున్నది గోరుచుట్టూ రోకలి పోటులా బట్ట కట్టాలన్నా వస్త్రం నేయాలన్నా సాలె కలల రెక్కలిరిసినట్టు దారం మీది పన్ను వెన్నుపోటు అవుతున్నది
ఊరుకుంటూ పోతే ఉప్పు కూడా బంగారమయ్యే సుంకం పొద్దు పొడుస్తున్నది నిత్యావసరం ఎవరికి చేదు అన్నట్టు ఢిల్లీ పీఠం మోకజూసి వాతవెట్టుడు మనం మరచిన పాఠం మనకే నేర్పుతున్నది.